స్టాక్ మార్కెట్లో రికార్డుల మోత మోగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ సోమవారం ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన స్థాయి, 11,900 పాయింట్ల ఎగువకు ఎగబాకింది. కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించి పోతుండటం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు....వీటన్నింటి ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాల్లోనే ముగిశాయి. మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పుంజుకొని 70.77 కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది. అయితే సెన్సెక్స్ రికార్డ్ లాభాల కారణంగా పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఇంట్రాడే లాభాలు తగ్గాయి. లోహ, టెలికం, ఐటీ షేర్లు లాభపడగా, వాహన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది.
రికార్డ్ బ్రేక్...
బీఎస్‌ఈ సెన్సెక్స్ 137 పాయింట్ల లాభంతో 40,302 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్‌కు జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపు దీంతో ఈ ఏడాది జూన్ 3 నాటి ఆల్‌టైమ్ క్లోజింగ్ రికార్డ్, 40,268 పాయింట్ల రికార్డ్ బద్దలైంది. ఇక ఇంట్రాడేలో కూడా సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 40,483 పాయింట్లను తాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 11,941 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్‌టైమ్ హై (12,103 పాయింట్లు)కు 162 పాయింట్ల దూరంలో నిఫ్టీ ఉంది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. లాభాల స్వీకరణ కారణంగా ఆరంభ లాభాలు ఆవిరైనా, చివరకు లాభాల్లోనే ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
అన్నీ శుభ శకునములే...
విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ రిస్క్‌లు తగ్గుముఖం పట్టటం, వృద్ధి జోరు పెంచడం లక్ష్యంగా మరిన్ని సంస్కరణలకు కేంద్రం తెరతీయనున్నదన్న వార్తలు... ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిస్తున్నాయి. ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్లో రూ.16,464 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోళ్లు జరపడం ఇది వరుసగా రెండో నెల. చైనా–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు దశకు రావడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి.
► అవకతవకలు చోటు చేసుకున్నాయనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కంపెనీ స్పష్టతనివ్వడంతో ఇన్ఫోసిస్ షేర్ 3 శాతం లాభంతో రూ.709 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే.
► ఈ క్యూ2లో రూ.629 కోట్ల నికర నష్టాలు రావడంతో యెస్ బ్యాంక్ షేర్ ఇంట్రాడేలో 10 శాతం మేర పతనమై రూ.60ను తాకింది. ఆ తర్వాత రికవరీ అయి 0.75 శాతం నష్టంతో రూ.66 వద్ద ముగిసింది. ఒక దశలో ఈ షేర్ 8 శాతానికి పైగా లాభంతో రూ.71ను తాకడం విశేషం.
► సెన్సెక్స్‌తో పాటు పలు షేర్లు కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ హోల్డింగ్స్, అబాట్ ఇండియా, అదానీ గ్రీన్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ బ్యాంక్, ఐనాక్స్ లీజర్, మణప్పురం ఫైనాన్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, మిధాని, ఎమ్‌ఎస్‌టీసీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
రికార్డుల హోరు
Published Tue, Nov 5 2019 5:07 AM | Last Updated on Tue, Nov 5 2019 5:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment