న్యూఢిల్లీ: మార్కెట్ నష్టాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. ఆటో, ఐటీ, మెటల్, పవర్ షేర్ల అండతో శుక్రవారం తిరిగి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 127 పాయింట్లు పెరిగి 40,686 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 11,930 వద్ద నిలిచింది. కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా నమోదవడంతో పాటు అమెరికా ఉద్దీపన ప్యాకేజీ విడుదల చర్చలు పురోగతిని సాధించడం లాంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే మార్కెట్‌లో అనిశ్చితి పరిస్థితులు తగ్గుముఖం పట్టాయనేందుకు సంకేతంగా ఇండియా వీఐఎక్స్ ఇండెక్స్ 4 శాతం నష్టపోయింది. చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపారు. ఇక వారం మొత్తంగా సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్లు లాభపడ్డాయి.
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్..
నష్టాల ముగింపు రోజు తర్వాత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, ఆర్థిక షేర్ల దూకుడుతో ఉదయం సెషన్‌లో సెన్సెక్స్ 253 పాయింట్లు పెరిగి 40,811 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లను ఆర్జించి 11,975 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను అందుకున్నాయి. వారాంతం కావడంతో మిడ్‌సెషన్‌లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ఆటో, మెటల్ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలవడంతో లాభాలతో ముగిశాయి.
‘‘మార్కెట్ మరోరోజు కన్సాలిడేట్‌కు లోనై లాభాలతో ముగిసింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ తాజా సమాచారంతో పాటు రానున్న అధ్యక్ష ఎన్నికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. యూరప్‌లో పుంజుకుంటున్న రెండో దశ కోవిడ్–19 కేసులను నిశితంగా పరిశీలిస్తున్నారు’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ చైర్మన్ అజిత్ మిశ్రా తెలిపారు.
క్రాంప్టన్ గ్రీవ్స్ షేరుకు ఫలితాల జోష్..
మెరుగైన క్వార్టర్ ఫలితాల ప్రకటనతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు శుక్రవారం 6 శాతం లాభపడింది. రూ.303.70 వద్ద ముగిసింది. ఈ క్యూ2లో కంపెనీ నికరలాభం 27.77 శాతం వృద్ధి చెంది రూ.141.68 కోట్లను ఆర్జించింది.
సెన్సెక్స్ 127 పాయింట్లు ప్లస్
Published Sat, Oct 24 2020 5:06 AM | Last Updated on Sat, Oct 24 2020 5:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment