ముంబై: స్టాక్ మార్కెట్‌లో విస్తృతస్థాయి కొనుగోళ్లు జరగడంతో బుధవారమూ బుల్ జోరు కొనసాగింది. ఒక్క ప్రభుత్వరంగ షేర్లలో తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరి కొత్త రికార్డులను నమోదుచేశాయి. ఇటీవల విడుదలైన మెరుగైన ఆర్థిక గణాంకాలు వ్యవస్థలో రికవరీని ప్రతిబింబింప చేయడం ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ 403 పాయింట్లు లాభపడి 46,666 వద్ద ముగిసింది.
నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 13,683 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. అత్యధికంగా రియల్టీ, మెటల్ షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,704 – 46,263 పాయింట్ల రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ 13,568 వద్ద కనిష్టాన్ని, 13,692 వద్ద గరిష్టాన్ని తాకాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ చర్చలు సఫలవంతమవుతాయనే ఆశలతో పాటు కోవిడ్–19 వ్యాక్సిన్ పంపిణీకి వేగవంతమైన చర్యలతో దేశీయ ఈక్విటీలు ఇప్పటికీ బుల్స్ గుప్పెట్లో ఉన్నట్లు రిలయన్స్ సెక్యూరిటీస్ స్ట్రాటజీ హెడ్ బినోద్ మోదీ వివరించారు. భారత మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ బుల్లిష్ వైఖరిని కలిగి ఉండడంతో సూచీలు రోజుకో రికార్డు నమోదవుతుందని ఆయనన్నారు.
ప్రభుత్వరంగ షేర్లలో అమ్మకాలు...
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రభుత్వరంగ(పీఎస్‌యూ)బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.60 శాతం పతనమైంది.
10 నెలల గరిష్టానికి నిఫ్టీ రియల్టీ ...
ప్రధాన నగరాల్లో నివాసయోగ్యమైన స్థలాల అమ్మకాలు పెరగినట్లు గణాంకాలు వెల్లడితో రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 5.1% ఎగసింది.
బర్గర్ కింగ్ రయ్.. రయ్
బంపర్ లిస్టింగ్‌తో ఇన్వెస్టర్లకు భారీ లాభాలన్ని పంచిన బర్గర్ కింగ్ షేర్లు ట్రేడింగ్‌లోనూ రాణిస్తున్నాయి. వరుసగా రెండోరోజూ 20 % లాభపడి రూ.199.25 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఇష్యూ ధర రూ.60తో ఐపీఓను పూర్తి చేసుకొని ఈ వారం ఎక్సే్చంజ్‌ల్లో లిస్టై్టన షేర్లు కేవలం మూడు రోజుల్లో 232% లాభాల్ని పంచాయి.
Comments
Please login to add a commentAdd a comment