6 నెలల్లో రూ. 2.22 లక్షల కోట్లు! | 30 billion dollar FDI flows in April- September | Sakshi
Sakshi News home page

6 నెలల్లో రూ. 2.22 లక్షల కోట్లు!

Nov 28 2020 1:54 PM | Updated on Nov 28 2020 2:58 PM

30 billion dollar FDI flows in April- September - Sakshi

న్యూఢిల్లీ, సాక్షి: పలు దేశాలను కరోనా వైరస్‌ పీడిస్తున్న నేపథ్యంలోనూ భారత్‌ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి ఆరు నెలల కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 15 శాతం వృద్ధి చూపాయి. ఈ విషయాలను పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య కాలంలో దేశంలోకి 30 బిలియన్‌ డాలర్ల(రూ. 2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు ప్రవహించినట్లు తెలియజేశాయి. 2019-20 తొలి ఆరు నెలల్లో ఇవి 26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఎఫ్‌డీఐలలో సింహభాగం అంటే 29 శాతం మారిషస్‌ నుంచి లభించగా.. 21 శాతం వాటాతో సింగపూర్‌ తదుపరి స్థానంలో నిలిచింది. యూఎస్‌, నెదర్లాండ్స్‌, జపాన్‌ సైతం 7 శాతం చొప్పున వాటాతో ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి.

రంగాలవారీగా..
డీపీఐఐటీ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య కాలంలో సర్వీసుల రంగం అత్యధికంగా 17 శాతం విదేశీ పెట్టుబడులను ఆకట్టుకుంది. సర్వీసుల రంగంలో ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌, బీమా, ఔట్‌సోర‍్సింగ్‌ సైతం కలసి ఉన్నట్లు డీఐఐఐటీ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ రంగాలలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌, హార్డవేర్‌ విభాగానికి 12 శాతం ఎఫ్‌డీఐలు లభించాయి. టెలికం రంగానికి 7 శాతం వాటా దక్కింది. మొత్తం ఎఫ్‌డీఐలలో రాష్ట్రాలవారీగా గుజరాత్‌ 35 శాతం వాటాతో అగ్రస్థానాన్ని పొందింది. ఇదేవిధంగా మహారాష్ట్ర 20 శాతం, కర్ణాటక 15 శాతం, ఢిల్లీ 12 శాతం చొప్పున ఎఫ్‌డీఐలను ఆకట్టుకున్నాయి. కోవిడ్‌-19ను సమర్థవంతంగా ఎదుర్కొనే బాటలో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీల ద్వారా లిక్విడిటీని పెంచిన నేపథ్యంలో భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరుగుతూ వచ్చినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలోకి విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే బాటలో పలు సంస్కరణలు తీసుకురావడం కూడా ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌, కోల్‌ మైనింగ్‌ తదితర రంగాలు భవిష్యత్‌లో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement