ఎఫ్ఐఐల ఫేవరెట్ షేర్ల స్పీడ్ | FII Investments in Q2- shares zoom | Sakshi
Sakshi News home page

ఎఫ్ఐఐల ఫేవరెట్ షేర్ల స్పీడ్

Published Thu, Nov 5 2020 2:21 PM | Last Updated on Thu, Nov 5 2020 2:24 PM

FII Investments in Q2- shares zoom - Sakshi

ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) భారీగా పెట్టుబడులు కుమ్మరించారు. క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూ. 35,000 కోట్లకుపైగా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. తద్వారా దాదాపు 400 కంపెనీలలో వాటాలను పెంచుకున్నారు. వీటిలో 100 కంపెనీల షేర్లు మార్చి నుంచి చూస్తే 100 శాతంపైగా ర్యాలీ చేశాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో స్టాక్ మార్కెట్లు 52 వారాల కనిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీంతో పలు కౌంటర్లు ఏడాది కనిష్టాలకు చేరాయి. ఈ స్థాయిల నుంచీ పలు షేర్లు లాభాల దౌడు తీస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 

మార్చి నుంచి
విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్న సుమారు 385 కంపెనీలలో మార్చి నుంచి చూస్తే.. 107 స్టాక్స్ 100-500 శాతం మధ్యలో జంప్ చేశాయి. మార్చి కనిష్టాల నుంచి రెట్టింపైన కౌంటర్లలో చాలా వరకూ మిడ్, స్మాల్ క్యాప్ విభాగం నుంచే చోటు చేసుకోవడం గమనార్హం. జాబితాలో ఎంఅండ్ఎం, ఇమామీ, ప్రకాష్ ఇండస్ట్రీస్, జిందాల్ పాలీ, అదానీ గ్యాస్, గ్లెన్ మార్క్ ఫార్మా, అదానీ గ్రీన్, అఫ్లే ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. గత రెండేళ్లుగా మిడ్, స్మాల్ క్యాప్స్ అక్కడక్కడే అన్నట్లుగా నిలిచిపోవడంతో కొద్ది రోజులుగా ర్యాలీ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు పటిష్ట యాజమాన్యం, నాణ్యమైన బిజినెస్ వంటి అంశాలు కొన్ని కౌంటర్లకు జోష్ నిస్తున్నట్లు చెప్పారు. 

లార్జ్ క్యాప్స్ కంటే
రానున్న ఏడాది కాలంలో లార్జ్ క్యాప్స్ ను మించి దూకుడు చూపగల మిడ్, స్మాల్ క్యాప్స్ వైపు ఎఫ్ఐఐలు చూపు సారించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ల రిటర్నులకు ప్రాధాన్యం ఇవ్వకుండా గుర్తింపు కలిగిన, పటిష్ట వ్యాపార అవకాశాలు అధికంగాగల కంపెనీలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. నిజానికి 2018 జనవరి నుంచీ మిడ్, స్మాల్ క్యాప్స్ వెనకడుగులో నిలిచిపోయినట్లు మార్కెట్ విశ్లేషకులు ఈ సందర్భంగా వివరించారు. అయితే ఇటీవల బిజినెస్ లు మందగించిన లార్జ్ క్యాప్ కంపెనీల నుంచి పెద్ద కంపెనీలుగా ఆవిర్భవించగల మిడ్ క్యాప్స్ వైపు ఎఫ్ఐఐలు చూపును మరల్చినట్లు తెలియజేశారు.

భారీ లాభాలలో
ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు, షేర్ల జోరు తీరు ఎలా ఉన్నదంటే.. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లో ఎఫ్ఐఐల వాటా క్యూ2లో 5.2 శాతం నుంచి 6.99 శాతానికి ఎగసింది. ఈ షేరు 544 శాతం ర్యాలీ చేసింది. ఈ బాటలో సీజీ పవర్లో వాటా 0.23 శాతం నుంచి 0.3 శాతానికి పెరిగింది. షేరు 459 శాతం దూసుకెళ్లింది. ఆర్తి డ్రగ్స్ లో వాటా 1.82 శాతం నుంచి 2.19 శాతానికి బలపడగా.. షేరు 408 శాతం జంప్ చేసింది. ఇదే విధంగా అదానీ గ్రీన్లో ఎఫ్ఐఐల వాటా 21.52 శాతం నుంచి 22.43 శాతానికి చేరగా.. షేరు 405 శాతం పురోగమించింది. లారస్ ల్యాబ్స్ లో వాటా 4.68 శాతంమేర పెరిగి 20.74 శాతాన్ని తాకింది. షేరు 400 శాతం లాభపడింది. ఇతర కౌంటర్లలో ఇంటలెక్ట్ డిజైన్, మాస్టెక్, టాటా కమ్యూనికేషన్స్, గ్లోబస్ స్పిరిట్స్, మార్క్ సన్స్ ఫార్మా, మజెస్కో 330-254 శాతం మధ్య ఎగశాయి. వీటిలో ఎఫ్ఐఐల వాటా 1.4-0.2 శాతం మధ్య పెరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement