Odisha Train Accident: Audit Report From Last Year Flagged Serious Concerns On Rail Safety - Sakshi
Sakshi News home page

Odisha Train Accident:వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది?

Published Sun, Jun 4 2023 3:59 PM | Last Updated on Sun, Jun 4 2023 9:24 PM

Odisha Train Accident Audit Report Flagged Serious Concerns Railway Safety - Sakshi

ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనకు ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడమే కారణమని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనిపై గతంలో కాగ్ విడుదల చేసిన రైల్వే ఆడిట్ రిపోర్ట్‌ తెరపైకి రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రైల్వే ఆడిట్ రిపోర్టును గత ఏడాది సెప్టెంబర్‌లోనే పార్లమెంట్‌లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) విడుదల చేసింది. రైల్వే ట్రాక్‌లలో ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి లోటుపాట్లను సవరించే అంశంపై విస్తుపోయే అంశాలను కాగ్‌ నివేదికలో పేర్కొంది. 

విస్తుపోయే నిజాలు.. 
2017-21 మధ్య మొత్తం 1,127 రైలు ప్రమాదాల్లో  289 ప్రమాదాలు ట్రాక్‌ల పునరుద్ధరణకు సంబంధించినవేనని కాగ్ నివేదిక పేర్కొంది. రైల్వే ట్రాక్‌ల నిర్మాణాలు, ప్రమాద ప్రదేశాల తనిఖీలు 30- 100 శాతం తగ్గాయి.  2017 నుంచి 2021 మార్చి వరకు  422 రైలు ప్రమాదాలు ఇంజనీరింగ్ సమస్యల కారణంగా జరిగాయి. అందులో 275 ప్రమాద ఘటనలు ఆపరేటింగ్ విభాగంలో లోపాల కారణంగా జరిగాయి. ట్రాక్‌లపై పాయింట్లను తప్పుగా గుర్తించారు. ప్రధానంగా 171 ప్రమాద కేసులు నిర్వహణ లోపాల కారణంగా జరిగాయి. 156 కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌ల నిర్మాణం చేపట్టినట్లు విస‍్తుపోయే విషయాలను కాగ్ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వేగంగా రైలు నడపడం కూడా ప్రమాద ఘటనలకు ప్రధాన కారణం అని నివేదిక వెల్లడించింది.  

నిధుల తగ్గింపు..
63 శాతం ప్రమాద  ఘటనల్లో నిర్ణీత గడువులోగా విచారణ చేపట్టలేదు. అంతేకాకుండా 49 శాతం కేసుల్లో ఆ నివేదికలను ఆమోదించడంలోనే ఆలస్యం జరిగింది. 2017-18 నుంచి ఐదేళ్లలో దాదాపు రూ. ఒక లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌ను అందుకున్న రైల్వే శాఖ.. వ్యయం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిదులు సరైన మోతాదుల్లో కేటాయించలేదు.. అంతేకాకుండా కేటాయించిన దానిలో పూర్తిగా ఖర్చు చేయలేదని నివేదిక వెల్లడించింది. రైల్వే ట్రాక్‌ల నిర్వహణను సకాలంలో చేయాలని కాగ్ తెలిపింది. మెరుగైన సాంకేతికతను ఉపయోగించాలని కోరింది. ఇలా అయితేనే రైలు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నియంత్రించగలమని నివేదికలో స్పష్టం చేసింది. 

మరోవైపు బాలాసోర్‌లోని  బహనగ స్టేషన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. 

ఇదీ చదవండి:లూప్‌ లైన్‌లో ఐరన్‌ ఓర్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమండల్‌ ఢీకొట్టింది: రైల్వే బోర్డు మెంబర్‌ జయవర్మ సిన్హా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement