railway safety
-
Odisha Train Accident: వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది?
ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడమే కారణమని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనిపై గతంలో కాగ్ విడుదల చేసిన రైల్వే ఆడిట్ రిపోర్ట్ తెరపైకి రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రైల్వే ఆడిట్ రిపోర్టును గత ఏడాది సెప్టెంబర్‌లోనే పార్లమెంట్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) విడుదల చేసింది. రైల్వే ట్రాక్‌లలో ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి లోటుపాట్లను సవరించే అంశంపై విస్తుపోయే అంశాలను కాగ్ నివేదికలో పేర్కొంది. విస్తుపోయే నిజాలు.. 2017-21 మధ్య మొత్తం 1,127 రైలు ప్రమాదాల్లో 289 ప్రమాదాలు ట్రాక్‌ల పునరుద్ధరణకు సంబంధించినవేనని కాగ్ నివేదిక పేర్కొంది. రైల్వే ట్రాక్‌ల నిర్మాణాలు, ప్రమాద ప్రదేశాల తనిఖీలు 30- 100 శాతం తగ్గాయి. 2017 నుంచి 2021 మార్చి వరకు 422 రైలు ప్రమాదాలు ఇంజనీరింగ్ సమస్యల కారణంగా జరిగాయి. అందులో 275 ప్రమాద ఘటనలు ఆపరేటింగ్ విభాగంలో లోపాల కారణంగా జరిగాయి. ట్రాక్‌లపై పాయింట్లను తప్పుగా గుర్తించారు. ప్రధానంగా 171 ప్రమాద కేసులు నిర్వహణ లోపాల కారణంగా జరిగాయి. 156 కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌ల నిర్మాణం చేపట్టినట్లు విస్తుపోయే విషయాలను కాగ్ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వేగంగా రైలు నడపడం కూడా ప్రమాద ఘటనలకు ప్రధాన కారణం అని నివేదిక వెల్లడించింది. నిధుల తగ్గింపు.. 63 శాతం ప్రమాద ఘటనల్లో నిర్ణీత గడువులోగా విచారణ చేపట్టలేదు. అంతేకాకుండా 49 శాతం కేసుల్లో ఆ నివేదికలను ఆమోదించడంలోనే ఆలస్యం జరిగింది. 2017-18 నుంచి ఐదేళ్లలో దాదాపు రూ. ఒక లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌ను అందుకున్న రైల్వే శాఖ.. వ్యయం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిదులు సరైన మోతాదుల్లో కేటాయించలేదు.. అంతేకాకుండా కేటాయించిన దానిలో పూర్తిగా ఖర్చు చేయలేదని నివేదిక వెల్లడించింది. రైల్వే ట్రాక్‌ల నిర్వహణను సకాలంలో చేయాలని కాగ్ తెలిపింది. మెరుగైన సాంకేతికతను ఉపయోగించాలని కోరింది. ఇలా అయితేనే రైలు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నియంత్రించగలమని నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు బాలాసోర్‌లోని బహనగ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:లూప్ లైన్లో ఐరన్ ఓర్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమండల్ ఢీకొట్టింది: రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా -
రైల్వే భద్రతపై లఘు చిత్రాలతో అవగాహన
సాక్షి, హైదరాబాద్: రైల్వేభద్రతపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రైలు ప్రమాదాల నియంత్రణ, ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లఘు చిత్రాల ద్వారా అవగాహన కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గురువారం ఇక్కడ డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన స్టేట్ లెవల్ సెక్యూరిటీ కమిటీ ఫర్ రైల్వేస్ (ఎస్ఎల్ఎస్సీఆర్) సమావేశం నిర్వహించారు. రైల్వే అడిషనల్ డీజీపీ బి.శశిధర్‌రెడ్డి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ రాజారామ్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవీ.. ►రైల్వే ట్రాక్‌లపై మరణాలు, రైళ్లలో మానవ అక్రమ రవాణా, రైళ్లలో చోరీల కట్టడి, కదులుతున్న రైళ్లపై రాళ్ల దాడుల నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ►రైల్వే ట్రాక్‌ల సమీపంలో నివాసం ఉండే ప్రజలకు రైల్వే ట్రాక్‌లపై పాటించాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లు, రైళ్లలో మొబైల్ చోరీలు వంటి అంశాల్లో జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా లఘు చిత్రాల నిర్మాణం ►రైళ్లో మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా మత్తు పదార్థాల రవాణా ముఠాలపై చట్టపరమైన చర్యలు, రైలు టికెట్ బుకింగ్‌లో అక్రమాల కట్టడికి చర్యలు ►రైల్వే ట్రాక్‌లు, ప్లాట్‌ఫాంలపై ప్రమాదాలతోపాటు మృతుల గణాంకాలు వెల్లడిస్తూ ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. -
‘కాపలా లేని రైల్వే గేట్లను ఎత్తేస్తాం’
సాక్షి, హైదరాబాద్/సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల భద్రత విషయంలో రాజీలేకుండా పని చేస్తున్నామని జీఎం వినోద్‌కుమార్ అన్నారు. ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి ప్రయాత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియతో మాట్లాడారు. 6 నెలలుగా ప్రమాదాల నివారణకు నిర్విరామంగా పనులు సాగుతున్నాయని తెలిపారు. ప్రమాదాల సంఖ్య 116 నుంచి 73కు తగ్గిందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వేను జీరో ప్రమాదాల స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.. గతేడాది 200, ఈ ఏడాది 300 కిలో మీటర్లు నూతనంగా ట్రాక్‌ల నిర్మాణం చేపట్టామన్నారు. తద్వారా ఎక్కువ సర్వీసులను నడిపి వెయిటింగ్ లిస్టు లేకుండా చేసే దిశగా ముందడుగు వేశామన్నారు. కాపలా లేని రైల్వే గేట్లను జీరో స్థాయికి తీసుకొస్తామని అన్నారు. గతేడాది 136, ఈ ఏడాది 132 కాపలా లేని రైల్వే గేట్లు తొలగించామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో మన్మాడ్ జోన్‌ను పూర్తి ఎలక్ట్రిక్ లైన్ జోన్‌గా మారుస్తామన్నారు. సికింద్రాబాద్ గణపతి ఆలయం వద్ద మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాని తెలిపారు. రైల్వేలో మౌలిక సదాపాయాల కల్పనకు నిధుల కొరత లేదన్నారు. -
మళ్లీ జరగదు ‘మాసాయిపేట’!
సాక్షి, హైదరాబాద్: కాపలాలేని లెవల్ క్రాసింగ్స్.. దశాబ్దాలుగా ప్రజలను బెంబేలెత్తిస్తున్న మృత్యు కుహరాలు. ఇప్పుడు ఈ పీడ నుంచి తెలంగాణ విముక్తి పొందింది. రాష్ట్రంలో ఇకపై కాపలాదారు లేని లెవల్ క్రాసింగ్స్ అనేవి కనిపించవు. మరో మాసాయిపేట దుర్ఘటన జరిగే ఆస్కారమే లేదు. నాందేడ్ రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే తెలంగాణ భూభాగంలోని 3 చోట్ల మినహా అన్ని ప్రాంతాల్లో రైల్వే శాఖ కాపలాదారు లేని లెవల్ క్రాసింగ్స్ మొత్తాన్ని తొలగించింది. ఆ 3 చోట్ల కూడా పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల పూర్తవుతాయి. దేశంలో కాపలాదారులేని లెవల్ క్రాసింగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణ కొత్త రికార్డు సృష్టించనుంది. ఒక్క ఘటన.. కదిలిన రైల్వే శాఖ 2014 జూన్ 24.. తూప్రాన్ సమీపంలోని మాసాయి పేట లెవల్ క్రాసింగ్ వద్ద పాఠశాల బస్సు పట్టాలు దాటుతుండగా హైదరాబాద్–నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న దుర్ఘటనలో బస్సు డ్రైవర్ సహా 20 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. పార్లమెంటును ఈ దుర్ఘటన కుదిపేసింది. ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అదే సమయంలో బిహార్‌లో కూడా ఇలాంటి దుర్ఘటనే జరగటంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల రైల్వే మంత్రిగా పీయూష్ గోయల్ బాధ్యతలు తీసుకున్నాక ఈ పనుల్లో వేగం పుంజుకుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా మూడొంతుల ప్రాంతాల్లో కాపలాలేని లెవల్ క్రాసింగ్స్ తొలగిస్తే.. తెలంగాణలో దాదాపు అన్నీ కనుమరుగయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనూ మూడేళ్లలో 300 కాపలాలేని మార్గాలను తొలగించారు. మరో 63 చోట్ల తొలగించాల్సి ఉంది. వెరసి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 1,499 చోట్ల కాపలాదారులున్న లెవల్ క్రాసింగ్స్ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే భద్రత కోసం పనులు చేపట్టేందుకు కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్రీయ రైల్ సంరక్షా కోశ్ పేరుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఈ బడ్జెట్లో ఇందుకోసం రూ.73 వేల కోట్లను కేటాయించి పనులు చేపడుతున్నారు. వచ్చే సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఎక్కడా అన్మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్స్ ఉండబోవని రైల్వే శాఖ సగర్వంగా ప్రకటించింది. ఆరు గంటల్లో అండర్‌పాస్ రెడీ గతంలో రైల్వేలైన్ దిగువన అండర్‌పాస్ నిర్మిం చాలంటే నెలల సమయం పట్టేది. ప్రస్తుతం ఆధునిక నిర్మాణ విధానాలతో కేవలం ఆరు గంటల్లోనే అండర్‌పాస్ సిద్ధమవుతోంది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంతో సిమెంట్ నిర్మాణాన్ని విడిగా నిర్మిస్తారు. రైల్వే లైన్‌కు రెండు వైపులా పొక్లెయిన్‌తో మార్గాన్ని ఏర్పా టు చేసి ఆరు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిపేస్తారు. పట్టాలు తొలగించి, పొక్లెయిన్‌తో కట్ట భాగం లో ద్వారం ఏర్పాటు చేసి సిమెంటు నిర్మాణాన్ని క్రేన్‌తో అందులో బిగిస్తారు. దానిపై పట్టాలు అమర్చి అండర్‌పాస్ గుండా వాహనాల రాకపోకలు ప్రారంభిస్తారు. కొద్దిరోజు ట్రయల్ వేసి, ఇబ్బంది రాకుంటే తిరిగి వేగాన్ని పునరుద్ధరిస్తారు. మాసాయిపేట ప్రమాదం జరిగేనాటికి పరిస్థితి ఇలా.. ద.మ.రైల్వే పరిధిలో మొత్తం లెవల్ క్రాసింగ్స్: 2122 ఇందులో కాపలాదారు లేనివి: 640 ఈ నాలుగేళ్లలో జరిగిన మార్పు ఇలా... రాష్ట్రంలో 121 కాపలాలేని గేట్లను తొలగించారు. (ఆదిలాబాద్–మహారాష్ట్రలోని పింపల్‌కుట్టి మధ్య మూడు చోట్ల తొలగించే పనులు జరుగుతున్నాయి.) అందులో దారులను రద్దు చేసినవి: 10 కాపలాదారులను ఏర్పాటు చేసినవి:10 అండర్‌పాస్‌లు నిర్మించినవి: 32 రోడ్ అండర్ బ్రిడ్జిలను నర్మించినవి: 60 రోడ్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించినవి: 9 -
భద్రత, వేగానికి పెద్దపీట!
రైల్వే బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.20 వేల కోట్లు! న్యూఢిల్లీ: తొంభై రెండేళ్ల సుదీర్ఘ సంప్రదాయానికి విరుద్ధంగా తొలిసారిగా సాధారణ బడ్జెట్‌తో ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్లో భద్రత, వేగం, మౌలిక సదుపా యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాటు రైళ్ల వేగాన్ని 200 కి.మీ. వరకు పెంచే చర్యలు చేపట్టనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ చారిత్రక బడ్జెట్‌ను బుధవారం సమర్పించనున్నారు. తరచూ రైళ్లు పట్టాలు తప్పుతున్న నేపథ్యంలో కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, కొన్ని స్టేషన్ల ఆధునీ కరణ చేయనున్నారు. దీనికి రానున్న ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రైల్వే భద్రత నిధిని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నిధిలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయించవచ్చు. రైళ్ల భద్రతా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు రూ.1.19 లక్షల కోట్ల ప్రత్యేక నిధి కేటా యించాలన్న రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు అభ్యర్థన మేరకు జైట్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైళ్ల పర్యవేక్షణకు రైలు అభివృద్ధి సంస్థను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు హైస్పీడ్ రైల్ అథారిటీనీ ఏర్పాటు చేయవచ్చు. అలాగే టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు కసరత్తు జరుగుతోంది.