సాక్షి, హైదరాబాద్: కాపలాలేని లెవల్ క్రాసింగ్స్.. దశాబ్దాలుగా ప్రజలను బెంబేలెత్తిస్తున్న మృత్యు కుహరాలు. ఇప్పుడు ఈ పీడ నుంచి తెలంగాణ విముక్తి పొందింది. రాష్ట్రంలో ఇకపై కాపలాదారు లేని లెవల్ క్రాసింగ్స్ అనేవి కనిపించవు. మరో మాసాయిపేట దుర్ఘటన జరిగే ఆస్కారమే లేదు. నాందేడ్ రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే తెలంగాణ భూభాగంలోని 3 చోట్ల మినహా అన్ని ప్రాంతాల్లో రైల్వే శాఖ కాపలాదారు లేని లెవల్ క్రాసింగ్స్ మొత్తాన్ని తొలగించింది. ఆ 3 చోట్ల కూడా పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల పూర్తవుతాయి. దేశంలో కాపలాదారులేని లెవల్ క్రాసింగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణ కొత్త రికార్డు సృష్టించనుంది.
ఒక్క ఘటన.. కదిలిన రైల్వే శాఖ
2014 జూన్ 24.. తూప్రాన్ సమీపంలోని మాసాయి పేట లెవల్ క్రాసింగ్ వద్ద పాఠశాల బస్సు పట్టాలు దాటుతుండగా హైదరాబాద్–నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న దుర్ఘటనలో బస్సు డ్రైవర్ సహా 20 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. పార్లమెంటును ఈ దుర్ఘటన కుదిపేసింది. ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అదే సమయంలో బిహార్‌లో కూడా ఇలాంటి దుర్ఘటనే జరగటంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇటీవల రైల్వే మంత్రిగా పీయూష్ గోయల్ బాధ్యతలు తీసుకున్నాక ఈ పనుల్లో వేగం పుంజుకుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా మూడొంతుల ప్రాంతాల్లో కాపలాలేని లెవల్ క్రాసింగ్స్ తొలగిస్తే.. తెలంగాణలో దాదాపు అన్నీ కనుమరుగయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనూ మూడేళ్లలో 300 కాపలాలేని మార్గాలను తొలగించారు. మరో 63 చోట్ల తొలగించాల్సి ఉంది. వెరసి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 1,499 చోట్ల కాపలాదారులున్న లెవల్ క్రాసింగ్స్ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే భద్రత కోసం పనులు చేపట్టేందుకు కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్రీయ రైల్ సంరక్షా కోశ్ పేరుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఈ బడ్జెట్‌లో ఇందుకోసం రూ.73 వేల కోట్లను కేటాయించి పనులు చేపడుతున్నారు. వచ్చే సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఎక్కడా అన్‌మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్స్ ఉండబోవని రైల్వే శాఖ సగర్వంగా ప్రకటించింది.
ఆరు గంటల్లో అండర్‌పాస్ రెడీ
గతంలో రైల్వేలైన్ దిగువన అండర్‌పాస్ నిర్మిం చాలంటే నెలల సమయం పట్టేది. ప్రస్తుతం ఆధునిక నిర్మాణ విధానాలతో కేవలం ఆరు గంటల్లోనే అండర్‌పాస్ సిద్ధమవుతోంది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంతో సిమెంట్ నిర్మాణాన్ని విడిగా నిర్మిస్తారు. రైల్వే లైన్‌కు రెండు వైపులా పొక్లెయిన్‌తో మార్గాన్ని ఏర్పా టు చేసి ఆరు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిపేస్తారు. పట్టాలు తొలగించి, పొక్లెయిన్‌తో కట్ట భాగం లో ద్వారం ఏర్పాటు చేసి సిమెంటు నిర్మాణాన్ని క్రేన్‌తో అందులో బిగిస్తారు. దానిపై పట్టాలు అమర్చి అండర్‌పాస్ గుండా వాహనాల రాకపోకలు ప్రారంభిస్తారు. కొద్దిరోజు ట్రయల్ వేసి, ఇబ్బంది రాకుంటే తిరిగి వేగాన్ని పునరుద్ధరిస్తారు.
మాసాయిపేట ప్రమాదం జరిగేనాటికి పరిస్థితి ఇలా..
ద.మ.రైల్వే పరిధిలో మొత్తం లెవల్ క్రాసింగ్స్: 2122
ఇందులో కాపలాదారు లేనివి: 640
ఈ నాలుగేళ్లలో జరిగిన మార్పు ఇలా...
రాష్ట్రంలో 121 కాపలాలేని గేట్లను తొలగించారు.
(ఆదిలాబాద్–మహారాష్ట్రలోని పింపల్‌కుట్టి మధ్య మూడు చోట్ల తొలగించే పనులు జరుగుతున్నాయి.)
అందులో దారులను రద్దు చేసినవి: 10
కాపలాదారులను ఏర్పాటు చేసినవి:10
అండర్‌పాస్‌లు నిర్మించినవి: 32
రోడ్ అండర్ బ్రిడ్జిలను నర్మించినవి: 60
రోడ్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించినవి: 9
మళ్లీ జరగదు ‘మాసాయిపేట’!
Published Tue, Jun 5 2018 1:30 AM | Last Updated on Wed, Aug 15 2018 2:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment