రైల్వే బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.20 వేల కోట్లు!
న్యూఢిల్లీ: తొంభై రెండేళ్ల సుదీర్ఘ సంప్రదాయానికి విరుద్ధంగా తొలిసారిగా సాధారణ బడ్జెట్‌తో ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్‌లో భద్రత, వేగం, మౌలిక సదుపా యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాటు రైళ్ల వేగాన్ని 200 కి.మీ. వరకు పెంచే చర్యలు చేపట్టనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ చారిత్రక బడ్జెట్‌ను బుధవారం సమర్పించనున్నారు. తరచూ రైళ్లు పట్టాలు తప్పుతున్న నేపథ్యంలో కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, కొన్ని స్టేషన్ల ఆధునీ కరణ చేయనున్నారు. దీనికి రానున్న ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రైల్వే భద్రత నిధిని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నిధిలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయించవచ్చు.
రైళ్ల భద్రతా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు రూ.1.19 లక్షల కోట్ల ప్రత్యేక నిధి కేటా యించాలన్న రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు అభ్యర్థన మేరకు జైట్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైళ్ల పర్యవేక్షణకు రైలు అభివృద్ధి సంస్థను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు హైస్పీడ్ రైల్ అథారిటీనీ ఏర్పాటు చేయవచ్చు. అలాగే టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు కసరత్తు జరుగుతోంది.