సెలవు లేదన్న హెడ్మాస్టర్‌.. లెక్కల టీచర్‌ ఏం చేశారంటే? | Odisha Teacher Denied Sick Leave After Saline Drip In Balangir | Sakshi
Sakshi News home page

సెలవు లేదన్న హెడ్మాస్టర్‌.. లెక్కల టీచర్‌ ఏం చేశారంటే?

Published Sun, Mar 9 2025 9:34 AM | Last Updated on Sun, Mar 9 2025 12:36 PM

Odisha Teacher Denied Sick Leave After Saline Drip In Balangir

భువనేశ్వర్‌: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు తిరస్కరించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సెలవివ్వడం కుదరదంటూ తెగేసి చెప్పారు. పాపం ఆ ఉపాధ్యాయుడు విధిలేక చేతికి ఐవీ డిప్‌ సెలైన్‌ పెట్టుకునే విధులకు హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం విషమించడం చూసి తోటి వారే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. బొలంగీర్‌ ప్రభుత్వ పాఠశాలలో విజయలక్ష్మి ప్రధాన్‌ హెడ్మాస్టర్‌ కాగా, ప్రకాశ్‌ భోయి గణితం టీచర్‌. ఇటీవల తన తాత అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన అనంతరం ప్రకాశ్‌ ఆరోగ్యం దెబ్బతింది. విధులకు హాజరు కాలేనందున, సెలవు ఇప్పించమంటూ ఆయన ప్రధానోపాధ్యాయినికి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి, మ్యాథ్స్‌ టీచర్‌ అవసరం ఎంతో ఉంటుందని చెబుతూ ఆమె ఆ వినతిని తిరస్కరించారు.

అయితే, ఎన్ని సార్లు కోరినా హెడ్మాస్టర్‌ వినిపించుకోకపోవడంతో ప్రకాశ్‌ భోయి చేతికి సెలైన్‌ పెట్టుకునే విధులకు వచ్చారు. ఆయన పరిస్థితి చూసి తోటి టీచర్లే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పటన్‌గఢ్‌ బ్లాక్‌ విద్యాధికారి(బీఈవో) ప్రసాద్‌ మాఝి స్పందించారు. కాజువల్‌ లీవ్‌ కోసం ప్రకాశ్‌ భోయి పంపించిన దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ ప్రధాన్‌ ఎందుకు తిరస్కరించారనే విషయమై విచారణ చేపట్టామన్నారు. ఆమెదే తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement