
న్యూఢిల్లీ: హఠాత్తుగా ఒంట్లో బాగోలేదంటూ ఉన్నతాధికారికి స్మార్ట్‌ఫోన్‌లో సందేశం పంపిన పది నిమిషాలకే ఆ ఉద్యోగి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 40 ఏళ్లకే ఓ ఉద్యోగి నూరేళ్లు నిండిన విషాద ఘటన తాలూకు వివరాలను పైఅధికారి కేవీ అయ్యర్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘‘నా కింది ఉద్యోగి శంకర్ నుంచి ఉదయం 8.37 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది.
భయంకరమైన వెన్నునొప్పి కారణంగా ఈరోజు ఆఫీస్‌కు రాలేకపోతున్నా, ఒక రోజు సెలవు ఇవ్వండి అని అందులో ఉంది. సరే విశ్రాంతి తీసుకో అని సమాధానం ఇచ్చా. ఆ తర్వాత కేవలం 10 నిమిషాలకే కుప్పకూలి శంకర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కొద్దిసేపటి తర్వాత నాకొక ఫోన్‌కాల్ వచ్చింది. శంకర్ చనిపోయాడని అవతలి వ్యక్తి చెబితే నమ్మలేకపోయా. వెంటనే మరో ఉద్యోగికి ఫోన్‌చేసి ఆరాతీశా.
10 నిమిషాలకే చనిపోయాడని వాళ్లు కూడా చెప్పడంతో నిశ్ఛేష్డుడినయ్యా. వెంటనే శంకర్ ఇంటి అడ్రస్ కనుక్కుని పరుగున వెళ్లా. కానీ అతనిక లేడని తెల్సి దుఃఖంలో మునిగిపోయా. శంకర్ ఆరేళ్లుగా మా ఆఫీస్‌లోనే పచిచేస్తున్నాడు. వయసు కేవలం 40 ఏళ్లు. పెళ్లయింది. వాళ్లకొక పసి పిల్లాడు ఉన్నాడు. అతనికి ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు లేవు. మరునిమిషం ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. చుట్టూ ఉన్న వాళ్లతో హాయిగా ఉండండి. చివరిదాకా జీవితాన్ని ఆస్వాదించండి’’ అని అన్నారు.