Northern Discom TSNPDCL Is Under Huge Losses, Recently Announced In Quarterly Electricity Audit Report - Sakshi
Sakshi News home page

TSNPDCL In Huge Losses: భారీ నష్టాల్లో ఉత్తర డిస్కం

Published Wed, Jul 19 2023 12:56 AM

Northern Discom in heavy losses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. 2023 జనవరి 1– మార్చి 31 మధ్య కాలానికి సంబంధించి సంస్థ తాజాగా ప్రకటించిన ‘త్రైమాసిక విద్యుత్‌ ఆడిట్‌’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థ పరిధిలోని 17 జిల్లాల/విద్యుత్‌ సర్కిళ్లలో మొత్తం 38 విద్యుత్‌ డివిజన్లుండగా.. డివిజన్ల వారీగా విద్యుత్‌ సాంకేతిక, ఆర్థిక నష్టాల మొత్తాలను (ఏటీఅండ్‌సీ లాసెస్‌)ను సంస్థ ఈ నివేదికలో పొందుపరిచింది.

మూడు డివిజన్లలో పరిధిలో ఈ నష్టాలు ఏకంగా 70–80 శాతానికి ఎగబాకినట్లు నివేదిక పేర్కొంది. అంటే ఈ డివిజన్లకు సరఫరా చేసిన మొత్తం విద్యుత్‌కు గాను కేవలం 20–30 శాతం బిల్లులు మాత్రమే వసూలయ్యాయన్నమాట. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సరఫరా చేసిన విద్యుత్‌కి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో పెద్దయెత్తున బకాయిలు పేరుకుపోతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

స్థూలంగా 36 శాతం నష్టాలు
గత త్రైమాసికంలో టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ మొత్తం రూ.4,726.60 కోట్ల విద్యుత్‌ బిల్లులను జారీ చేయగా, రూ.3,203.89 కోట్లను (67.78శాతం) మాత్రమే వసూలు చేసుకోగలిగింది. అంటే 36.33 శాతం ఏటీ అండ్‌ సీ నష్టాలు నమోదయ్యాయి. డిస్కంల సుస్థిర మనుగడ కోసం ఏటీ అండ్‌ సీ నష్టాలను 2019–20 నాటికి 6 శాతానికి తగ్గించుకోవాలని ఉదయ్‌ పథకం కింద కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. అయినా రాష్ట్ర డిస్కంలు అంతకంతకు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. 

వసూలు కాని ‘ఇతర’ కేటగిరీ బిల్లులు
గృహాలు, వాణిజ్యం, పారిశ్రామిక కేటగిరీల వినియోగదారులు 90 నుంచి 100 శాతం విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నట్టు త్రైమాసిక విద్యుత్‌ ఆడిట్‌ నివేదిక తెలిపింది. ఇతర కేటగిరీలో మాత్రం చాలా డివిజన్లలో ఒక శాతం బిల్లులు కూడా వసూలు కావడం లేదు. ఈ డివిజన్ల పరిధిలోని కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంప్‌హౌస్‌ల విద్యుత్‌ కనెక్షన్లు ఇతర కేటగిరీలోనే ఉన్నాయి.  

ఏటీ అండ్‌ సీ నష్టాలు అంటే..?
సాంకేతిక లోపాలు, విద్యుత్‌ చౌర్యంతో డిస్కంలకు జరిగే నష్టాలను విద్యుత్‌ రంగ పరిభాషలో.. ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ (టీ అండ్‌ డీ) నష్టాలంటారు. సాంకేతిక లోపాలు, విద్యుత్‌ చౌర్యంతో పాటు వసూలుకాని విద్యుత్‌ బిల్లులను కలిపి..అగ్రిగేట్‌ టెక్నికల్‌ అండ్‌ కమర్షియల్‌ లాసెస్‌ (ఏటీ అండ్‌ సీ లాసెస్‌) అంటారు. 

పెద్దపల్లిలో 80%..కరీంనగర్‌ రూరల్‌లో 78.99% నష్టాలు
పెద్దపల్లి డివిజన్‌లో విద్యుత్‌ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం ఏకంగా 80.18 శాతానికి ఎగబాకి రాష్ట్ర విద్యుత్‌ రంగ చరిత్రలోనే కొత్త రికార్డును సృష్టించింది. ఈ డివిజన్‌లో గత త్రైమాసికంలో రూ.435.08 కోట్ల విద్యుత్‌ బిల్లులను జారీ చేయగా, కేవలం రూ.89.63 కోట్లు (20.6%) మాత్రమే వసూలయ్యాయి.

డివిజన్‌ పరిధిలో 1,71,002 విద్యుత్‌ కనెక్షన్లుండగా, 421.55 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ సరఫరా చేశారు. 15.95 ఎంయూల (3.78 శాతం) ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ నష్టాలు (టీ అండ్‌ డీ లాసెస్‌) పోగా, మిగిలిన 405.6 ఎంయూల విద్యుత్‌ను వినియోగించినందుకు గాను వినియోగదారులకు రూ.435.08 కోట్ల బిల్లులు జారీ చేశారు. 

కరీంనగర్‌ రూరల్‌ డివిజన్‌లో 78.99 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలు నమోదయ్యాయి. అక్కడ రూ.445.67 కోట్ల బిల్లులకు గాను రూ.96.28 కోట్లు (21.6%) మాత్రమే వసూలయ్యాయి. 

 భూపాలపల్లిలో 71.2 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.205.7 కోట్ల బిల్లులకు గాను రూ.80.19 కోట్లే (38.98 శాతం) వసూలయ్యాయి. ఇక అక్కడ టీ అండ్‌ డీ నష్టాలు సైతం 26.13 శాతంగా ఉన్నాయి. చౌర్యం/సాంకేతిక లోపాలతో ఏకంగా 99.35 ఎంయూల విద్యుత్‌ నష్టం జరిగింది. 

 ములుగు డివిజన్‌లో  61.58 శాతం ఏటీ అండ్‌ సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.122.36 కోట్ల బిల్లులకు గాను రూ.48.97 కోట్లు (40.02 శాతం) మాత్రమే వసూలయ్యాయి.

కరీంనగర్‌ డివిజన్‌లో 48.86 శాతంఏటీఅండ్‌సీ నష్టాలు నమోదయ్యాయి. అక్కడ రూ.444.12 కోట్ల బిల్లులకు గాను రూ.218.46 కోట్లు (49.10%) మాత్రమే వసూలయ్యాయి. 

మంథని డివిజన్‌లో 44.12 శాతం ఏటీఅండ్‌ సీ నష్టాలున్నాయి. అక్కడ రూ.328.8 కోట్ల బిల్లులకు గాను రూ.144.48 కోట్లు (43.94%) మాత్రమే వసూలయ్యాయి.  హన్మకొండ రూరల్‌లో 34.54 శాతం ఏటీఅండ్‌ సీ నష్టాలు వచ్చాయి. అక్కడ రూ.177.25 కోట్ల బిల్లులకు గాను రూ.124.79 కోట్లు (70.4శాతం) మాత్రమే వసూలయ్యాయి.

మరో 7.04 శాతం టీ అండ్‌ డీ నష్టాలున్నాయి. పైన పేర్కొన్న ఈ డివిజన్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి పంప్‌హౌస్‌లతో పాటు దేవాదుల, సమ్మక్క సాగర్‌ వంటి భారీ లిఫ్టులు కూడా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement