సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ నష్టాల్లో చార్మినార్ డివిజన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీ అండ్ సీ లాసెస్) 50.63శాతంగా నమోదయ్యాయి. అంటే సరఫరా చేసిన విద్యుత్‌కుగాను బిల్లులు వచ్చింది సగం మేర మాత్రమే. ఇక వనపర్తి, నాగర్‌కర్నూల్, ఆస్మాన్‌గఢ్, సిద్దిపేట, గజ్వేల్ డివిజన్లలో సైతం 30–40శాతం ‘ఏటీఅండ్‌సీ’నష్టాలు రావడం గమనార్హం. 2021 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలానికి సంబంధించి.. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్) త్రైమాసిక విద్యుత్ ఆడిట్ నివేదికలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. మొత్తంగా ఎస్పీడీసీఎల్ 13.05శాతం, ఎన్పీడీసీఎల్ 9.46 శాతం ఏటీ అండ్ సీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
అన్నిరకాలుగా నష్టం
చార్మినార్ డివిజన్ పరిధిలో 247.89 మిలియన్ యూనిట్ల (ఎంయూల) విద్యుత్‌ను సరఫరా చేయగా.. 116.29 ఎంయూల మీటర్డ్ సేల్స్ (వినియోగదారులు వాడినట్టుగా మీటర్లలో నమోదైన లెక్క) మాత్రమే జరిగాయి. మిగతా 131.60 ఎంయూ (53శాతం) ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్(టీ అండ్ డీ) నష్టాలు వచ్చాయి. సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో జరిగే నష్టాలను కలిపి విద్యుత్ రంగ పరిభాషలో ‘ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) నష్టాలు’అంటారు. ఇక రూ.78.89 కోట్ల బిల్లులకుగాను రూ.83.02 కోట్లు (105 శాతం) వసూలయ్యాయి. ఇక్కడ మొత్తంగా ఏటీఅండ్ టీ నష్టం 50.63శాతంగా నమోదైంది. (సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతోపాటు వసూలుకాని విద్యుత్ బిల్లులను కలిపి ఏటీఅండ్‌సీ నష్టాలు అంటారు.)
► నాగర్‌కర్నూల్ డివిజన్‌లో ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు ఏడుశాతమే నమోదైనా.. రూ.252.7 కోట్ల బిల్లులకు గాను రూ.166.55 కోట్లు (65.9శాతం) మాత్రమే వసూలయ్యాయి. మొత్తం నష్టం 39.01 శాతంగా నమోదైంది.
► ఇదే తరహాలో టీఅండ్‌డీ నష్టాలు తక్కువగానే ఉన్నా.. బిల్లుల వసూలు సరిగా లేక.. వనపర్తి డివిజన్‌లో 37.63 శాతం, సిద్దిపేట డివిజన్‌లో 31.87 శాతం, గజ్వేల్ డివిజన్‌లో 28.71%, దేవరకొండ డివిజన్‌లో 25.42%, గద్వాల డివిజన్‌లో 24.58%, తాండూరు డివిజన్‌లో 19.96% ఏటీఅండ్ టీ నష్టాలు నమోదయ్యాయి.
► బిల్లుల వసూళ్లు బాగానే ఉన్నా.. కీలకమైన సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యం (టీఅండ్‌డీ) నష్టాలే ఎక్కువగా ఉండటంతో ఆస్మాన్‌గఢ్ (33.33శాతం), బేగంబజార్ (26.94 శాతం) తదితర డివిజన్లలో నష్టాలు ఎక్కువగా నమోదయ్యాయి.
‘చార్మినార్’లో సగం గాయబ్!
Published Sun, May 15 2022 4:54 AM | Last Updated on Sun, May 15 2022 3:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment