Charminar Zone
-
ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన
చార్మినార్ / గోల్కొండ (హైదరాబాద్)/ తాండూరు టౌన్: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు శుక్రవారం ఆందోళనలకు దిగారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో మధ్యాహ్నం సామూహిక ప్రార్థనలకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ హుస్సేన్ అమేర్ అబ్దుల్లా హాజరయ్యారు. దీంతో ముస్లింలు అత్యధిక సంఖ్యలో మసీదు వద్దకు చేరుకున్నారు. ఆయన మసీదు నుంచి వెళ్లిపోయిన వెంటనే ముస్లిం యువత యునానీ ఆస్పత్రి ప్రధాన రహదారిపైకి చేరుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఎమ్మెల్యే రాజాసింగ్‌లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు చార్మినార్ వద్దకు చేరుకొని శాంతి భద్రతలను స్వయంగా పర్యవేక్షించారు. ఆందోళనకారులను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. బీజేపీ నేతల చిత్రపటాల దహనం మెహిదీపట్నం అజీజియా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనలు ముగియగానే ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. నినాదాలు ఇస్తున్న వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇలావుండగా టోలిచౌకి పారామౌంట్ కాలనీ ఫయాజ్ ఇమామ్ మసీదు వద్ద కూడా బీజేపీ నాయకుల చిత్రపటాలను ప్రదర్శిస్తూ స్థానిక యువకులు నినాదాలు చేశారు. నుపుర్ శర్మ, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరుల ఫొటోలను దహనం చేశారు. నుపుర్‌శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు నుపుర్‌శర్మపై వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. స్థానిక ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్ తెలిపారు. Youngsters protest at Charminar against Nupur Sharma and T Raja Singh. pic.twitter.com/nO14skGPV1 — ASIF YAR KHAN (@Asifyarrkhan) June 10, 2022 ఇది కూడా చదవండి: బీజేపీ వ్యతిరేక నినాదాలు.. మసీదుల వద్ద ఉద్రిక్తత -
‘చార్మినార్’లో సగం గాయబ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ నష్టాల్లో చార్మినార్ డివిజన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీ అండ్ సీ లాసెస్) 50.63శాతంగా నమోదయ్యాయి. అంటే సరఫరా చేసిన విద్యుత్‌కుగాను బిల్లులు వచ్చింది సగం మేర మాత్రమే. ఇక వనపర్తి, నాగర్‌కర్నూల్, ఆస్మాన్‌గఢ్, సిద్దిపేట, గజ్వేల్ డివిజన్లలో సైతం 30–40శాతం ‘ఏటీఅండ్‌సీ’నష్టాలు రావడం గమనార్హం. 2021 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలానికి సంబంధించి.. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్) త్రైమాసిక విద్యుత్ ఆడిట్ నివేదికలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. మొత్తంగా ఎస్పీడీసీఎల్ 13.05శాతం, ఎన్పీడీసీఎల్ 9.46 శాతం ఏటీ అండ్ సీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అన్నిరకాలుగా నష్టం చార్మినార్ డివిజన్ పరిధిలో 247.89 మిలియన్ యూనిట్ల (ఎంయూల) విద్యుత్‌ను సరఫరా చేయగా.. 116.29 ఎంయూల మీటర్డ్ సేల్స్ (వినియోగదారులు వాడినట్టుగా మీటర్లలో నమోదైన లెక్క) మాత్రమే జరిగాయి. మిగతా 131.60 ఎంయూ (53శాతం) ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్(టీ అండ్ డీ) నష్టాలు వచ్చాయి. సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో జరిగే నష్టాలను కలిపి విద్యుత్ రంగ పరిభాషలో ‘ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) నష్టాలు’అంటారు. ఇక రూ.78.89 కోట్ల బిల్లులకుగాను రూ.83.02 కోట్లు (105 శాతం) వసూలయ్యాయి. ఇక్కడ మొత్తంగా ఏటీఅండ్ టీ నష్టం 50.63శాతంగా నమోదైంది. (సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతోపాటు వసూలుకాని విద్యుత్ బిల్లులను కలిపి ఏటీఅండ్‌సీ నష్టాలు అంటారు.) ► నాగర్‌కర్నూల్ డివిజన్లో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు ఏడుశాతమే నమోదైనా.. రూ.252.7 కోట్ల బిల్లులకు గాను రూ.166.55 కోట్లు (65.9శాతం) మాత్రమే వసూలయ్యాయి. మొత్తం నష్టం 39.01 శాతంగా నమోదైంది. ► ఇదే తరహాలో టీఅండ్‌డీ నష్టాలు తక్కువగానే ఉన్నా.. బిల్లుల వసూలు సరిగా లేక.. వనపర్తి డివిజన్లో 37.63 శాతం, సిద్దిపేట డివిజన్లో 31.87 శాతం, గజ్వేల్ డివిజన్లో 28.71%, దేవరకొండ డివిజన్లో 25.42%, గద్వాల డివిజన్లో 24.58%, తాండూరు డివిజన్లో 19.96% ఏటీఅండ్ టీ నష్టాలు నమోదయ్యాయి. ► బిల్లుల వసూళ్లు బాగానే ఉన్నా.. కీలకమైన సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యం (టీఅండ్‌డీ) నష్టాలే ఎక్కువగా ఉండటంతో ఆస్మాన్‌గఢ్ (33.33శాతం), బేగంబజార్ (26.94 శాతం) తదితర డివిజన్లలో నష్టాలు ఎక్కువగా నమోదయ్యాయి. -
చార్మినార్ వద్ద సందర్శకుల రద్దీ
-
Corona effect: మమ్మల్ని ఎవరూ చూడట్లే..
చార్మినార్: పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి. కోవిడ్–19 మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న నేపత్యంలో పర్యాటక ప్రాంతాలు మూత పడడమే ఇందుకు ప్రధాన కారణం. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో భారత పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి మే 15 వరకు చార్మినార్ సందర్శనను నిలిపి వేశారు. వారం రోజులుగా చార్మినార్ పరిసర ప్రాంతాలతో పాటు సాలార్జంగ్ మ్యూజియంల వద్ద సందర్శకుల సందడి తగ్గింది. దీంతో చిరువ్యాపారాలు కూడా గణనీయంగా తగ్గి పోయాయి. ► గతేడాది లాక్డౌన్ సమయంలో చార్మినార్ కట్టడాన్ని మూసి వేసిన ఏఎస్ఐ తిరిగి ఈఏడాది మళ్లీ సందర్శనను నిలిపివేసింది. ► దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటక ప్రాంతమైన చార్మినార్ కట్టడంతో పాటు సాలార్జంగ్ మ్యూజియం సందర్శనను నిలిపి వేశారు. ►కుతుబ్‌షాహీల కాలంలోని కళాకారుల విశిష్ట కళా నైపుణ్యానికి అద్దంపట్టేలా చార్మినార్ కట్టడాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తిలకించడానికి రోజూ సందర్శకులు ఇక్కడికి వస్తుండటంతో చార్మినార్ పరిసరాలు సందర్శకులతో సందడిగా కనిపించేవి. ► వారం రోజులుగా చార్మినార్ మూసి వేయడంతో సందర్శకుల సందడి పూర్తిగా తగ్గిపోయింది. ► ఇక ఇప్పటికే మక్కా మసీదు లోనికి విజిటర్స్‌ను అనుమతించడం లేదు. ► దీంతో పాతబస్తీ చార్మినార్–మక్కా మసీదు రోడ్డులో చిరువ్యాపారాలు తగ్గిపోయాయి. ► వినియోగదారుల సందడి కనిపించడం లేదు. ( చదవండి: నకిలీలతో జాగ్రత్త.. మందులు కొనేముందు ‘6 పీ’ సరి చూసుకోండి ) -
ఏసీపీని అడ్డుకున్న ఎమ్మెల్యే..
-
ఏసీపీని అడ్డుకున్న ఎమ్మెల్యే; తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధుల్లో భాగంగా పాతబస్తీలోని శాలిబండలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్న ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్‌ని ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్, ఎంఐఎం నేతలు సీఏఏ వంకతో అడ్డుకున్నారు. ప్రజలందరి ముందే ఎమ్మెల్యే ఏసీపీ మహ్మద్ మజీద్‌ని నిలదీశారు. దీంతో ఏసీపీ, సిబ్బంది చేసేదేం లేక తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. కాగా, పోలీసుల తీరుపైనా ప్రజలు మండిపడుతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ పోలీసులకే తలవంపులు వచ్చాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే పోలీసులు వెనుదిరిగారని ఎద్దేవా చేస్తున్నారు. -
'ఆసరా' పెన్షన్ పథకంలో భారీ గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చార్మినార్ తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా ఆసరా పెన్షన్ల పథకంలో భారీ గోల్మాల్ జరిగింది. ఆ కార్యాలయ ఉద్యోగుల ప్రమేయంపై ఆధారాలు లభించకపోయినా వారి నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నలుగురితో కూడిన ముఠా 8 నెలల్లో 255 మంది పేర్లతో రూ.25 లక్షల వరకు స్వాహా చేసింది. దీనిపై హైదరాబాద్ ఆర్డీఓ డి.శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక నిందితుడు 2017లో వెలుగులోకి వచ్చిన ఇదే తరహా ఆసరా స్కామ్‌లోనూ అరెస్టు అయినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. సూత్రధారి ఇమ్రాన్‌ఖాన్ ప్రతీకాత్మక చిత్రం; పోలీసుల అదుపులో నిందితులు ఆసరా పథకం కింద పెన్షన్ కోరుకునే అర్హులు దరఖాస్తు, ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి పూర్వాపరాలు పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా అర్హుల దరఖాస్తును తహసీల్దార్ అప్రూవ్ చేస్తారు. ఈ తంతు ముగిసిన తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో ఉండే డేటా ఎంట్రీ ఉద్యోగులు దరఖాస్తుదారుడి వివరాలను తమ సంస్థాగత ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. దీనికోసం ప్రతి తహసీల్దార్‌కు ఓ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటాయి. ఇలా అప్లోడ్ చేసిన వివరాలు కలెక్టరేట్ ద్వారా ‘సెర్ఫ్’ కార్యాలయానికి చేరతాయి. దీంతో అక్కడి అధికారులు లబ్ధిదారుడి ఖాతాలో నెలనెలా పెన్షన్ జమ చేస్తుంటారు. ఈ పెన్షన్‌ను కియోస్క్ యంత్రంలో వేలిముద్రలు వేయడం ద్వారా లబ్ధిదారులు విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తతంగం మొత్తం తెలిసిన మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ అనే వ్యక్తి ఈ స్కామ్‌కు సూత్రధారిగా మారాడు. ఆరేడేళ్లుగా బండ్లగూడ, చార్మినార్ తహసీల్దార్ కార్యాలయాల కేంద్రంగా ఇతగాడు దళారీగా పని చేస్తున్నాడు. దీంతో ఇతడికి ఆయా కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగులతో పరిచయాలు ఏర్పడ్డాయి. చార్మినార్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇమ్రాన్ ఎమ్మార్వో వినియోగించే యూజర్ ఐడీ, పాస్వర్డ్ సంగ్రహించాడు. వీటిని తన స్నేహితుడు, నల్లగొండలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహ్మద్ అస్లంతో పాటు సయ్యద్ సొహైలుద్దీన్‌లకు అందించాడు. వీరి ద్వారా ఈ రహస్య వివరాలు నగరానికి చెందిన మహ్మద్ మోసిన్‌కు చేరాయి. కియోస్క్ యంత్రాలు నిర్వహిస్తూ లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం ఇతడి వృత్తి. ఈ నలుగురూ ఇలా సంగ్రహించిన వివరాలతో ఆసరా పెన్షన్లు స్వాహా చేయడానికి దాదాపు ఎనిమిది నెలల క్రితం పథకం వేశారు. ఖాతా నంబర్లు మార్చి.. బండ్లగూడ, చార్మినార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాలకు చెందిన 255 మందితో కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఈ బ్యాంకు ఖాతాల నంబర్లను అప్పటికే పెన్షన్ పొందుతున్న ఆసరా లబ్ధిదారుల వాటికి బదులుగా రీప్లేస్ చేశారు. కొన్ని పేర్లను వీరే లబ్ధిదారులుగా చేర్చారు. చార్మినార్ ఎమ్మార్వో యూజర్ ఐడీ, పాస్వర్డ్ తెలిసి ఉండడంతో వాటి ఆధారంగా కొత్త లబ్ధిదారులు, బ్యాంకు ఖాతా నంబర్ల అప్రూవల్ పొందారు. అనివార్య కారణాల నేపథ్యంలో కొందరు వృద్ధులు తమ బంధువులు, సంబంధీకుల బ్యాంకు ఖాతాలను ఆసరా పెన్షన్ కోసం ఇస్తూ/మారుస్తూ ఉంటారు. ఆ నెపంతో వీరంతా అప్రూవల్ పొందారు. దీంతో అప్పటి నుంచి ఆయా లబ్ధిదారులకు చేరాల్సిన పెన్షన్ డబ్బు వీరి పొందుపరిచిన కొత్త ఖాతాల్లోకి వస్తోంది. ఆ డబ్బును ఖాతాదారుల సాయంతో వీళ్లు స్వాహా చేస్తున్నారు. ఇలా మొత్తం రూ.25 లక్షల వరకు ఈ గ్యాంగ్ కాజేసింది. ఇలా గుర్తింపు... ఇటీవల కొందరు వృద్ధులు తమకు ఆసరా పెన్షన్లు అందట్లేదని, ఆ డబ్బు తమ ఖాతాల్లో పడడం ఆగిపోయిందని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణ చేపట్టిన ఆయన స్కామ్ జరిగినట్లు గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై మదన్ సహకారంతో సాంకేతిక దర్యాప్తు చేసి స్కామ్ మూలాలు కనిపెట్టారు. దీంతో మంగళవారం అస్లంతో పాటు సొహైల్, మోసిన్, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో వీరికి ఓ మహిళ సైతం సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క చార్మినార్ ఎమ్మార్వో యూజర్ ఐడీ, పాస్వర్డ్ బయటకు రావడం వెనుక ఇంటి దొంగల పాత్ర ఉందా? నిర్లక్ష్యమే కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. దీనికోసం నిందితుల్ని న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అస్లం గతంలో బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేశాడు. 2017లో మరికొందరితో ముఠా కట్టి ఆసరా పెన్షన్లనే కాజేశాడు. దాదాపు రూ.40 లక్షలు కాజేసిన ఆ స్కామ్‌లోనూ ఇతగాడు అరెస్టు అయ్యాడు. -
కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయం
సాక్షి, అనంతగిరి: జిల్లాను జోగులాంబ నుంచి చార్మినార్ జోన్లోకి మారుస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. జోన్ విలీనంపై వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తనను గెలిపిస్తే చార్మినార్ జోన్లో కలిపి బహుమానంగా ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పి ఇప్పుడు నెరవేర్చారని తెలిపారు. నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడంతో ఇక్కడి ఉద్యోగులు, యువకుల, నిరుద్యోగుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చార్మినార్ జోన్లో కలిపారని వివరించారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే చేపట్టి జిల్లా ప్రజలకు సాగునీరు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, నాయకులు సురేశ్, విజయ్‌కుమార్, మంచన్‌పల్లి సురేశ్, కృష్ణయ్య, ముత్తాహార్ షరీఫ్, రమేశ్‌గౌడ్, రాజమల్లయ్య, దత్తు, దీపు, కడియాల వేణు, గోపాల్, అనంత్‌రెడ్డి, రంగరాజు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్‌ను కలిసిన జెడ్పీ వైస్ చైర్మన్ అనంతగిరి: వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలపడంతో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్చార్జి బాలమల్లు, సీనియర్ నాయకులు శుభప్రద్‌పటేల్‌తో కలిసి బుధవారం కేటీఆర్‌ను కలిశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చార్మినార్ జోన్లో కలిపారని, జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. -
చార్మినార్ జోన్లో.. వికారాబాద్
ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు, నిరుద్యోగ యువత, ఉద్యోగుల కల నెరవేరింది. మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించిన సీఎం.. వికారాబాద్ జిల్లాను జోగుళాంబ నుంచి చార్మినార్ జోన్లోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ జోషిని ఆదేశించారు. సాక్షి, వికారాబాద్: జోన్ మార్పుపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు శుభప్రద్ పటేల్, చిగుల్లపల్లి, రమేశ్‌కుమార్ తదితరులు సీఎం నిర్ణయంతో సంబరాలు జరుపుకొన్నారు. 25, మే 2018న రాష్ట్రంలో ఏడు కొత్త జోన్లు, రెండు మల్టీజోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు హైదరాబాద్ 6వ జోన్లో ఉన్న వికారాబాద్ జిల్లాను కొత్తగా ఏర్పాటైన జోగుళాంబ జోన్లో కలుపుతూ ఉత్వర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లోని 44.63 లక్షల జనాభాతో జోగుళాంబను ఏడో జోన్‌గా ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంపై అప్పట్లో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. వికారాబాద్‌ను చార్మినార్‌జోన్‌లో కలపాలని, లేదంటే తమకు తీరని అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రజల ఆందోళన గమనించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం కేసీఆర్‌ను కలిసి వికారాబాద్‌ను తిరిగి చార్మినార్‌జోన్‌లో కలపాలని సీఎంను కోరుతూ వచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలుపుతామని సీఎంతోపాటు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలుపుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. యువత, ఉద్యోగులకు మేలు.. వికారాబాద్ జిల్లా జోగుళాంబ జోన్లో కొనసాగితే జిల్లాలోని నిరుద్యోగ యువత, ఉద్యోగులకు నష్టం వాటిల్లేది. చార్మినార్ జోన్ పరిధిలో లక్షకుపైగా ఉద్యోగాలు ఉంటాయి. దీనికితోడు కొత్తగా ఏర్పాటైన రెండు మున్సిపాలిటీలు, మూడు మండలాల్లోను ఉద్యోగాల భర్తీ ఉంటుంది. దీంతో జిల్లాకు చెందిన నిరుద్యోగులు పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. చార్మినార్ జోన్లో ఉన్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్స్, జీహెచ్ఎంసీల్లో కూడా జిల్లా యువత ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి. జోగుళాంబ జోన్ పరిధిలో కేవలం 32వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. దీంతో జిల్లా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయేవి. ప్రస్తుతం జోన్‌మార్పు నిర్ణయంతో ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. జోన్‌మార్పుతో ఉద్యోగులకు సైతం లాభం చేకూరనుంది. వికారాబాద్ జిల్లా ఉద్యోగుల బదిలీలు కేవలం జోగుళాంబ జోన్ పరిధిలో ఉండేవి కాగా ప్రస్తుతం జోన్‌మార్పుతో చార్మినార్ జోన్లో ఎక్కడైనా బదిలీలు పొందవచ్చు, అలాగే పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉంటుంది. సీఎం నిర్ణయం చరిత్రాత్మకం వికారాబాద్ జిల్లాను చార్మినార్‌జోన్‌లో కలుపుతూ సీఎం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. ఈవిషయం లో కేసీఆర్ జిల్లా ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చి.. నెరవేర్చారు. జోన్ మార్పుతో జిల్లా యువతకు, ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ప్రజల తరఫున సీఎం కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – రంజిత్‌రెడ్డి, ఎంపీ ఆనందంగా ఉంది తాండూరు: వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చడం చాలా ఆనందంగా ఉంది. జిల్లాను జోగులాంబ జోన్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి రాష్ట్రపతికి లక్ష పోస్టు కార్డులు పంపించాం. – రోహిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే త్వరలో జీవో వస్తుంది పరిగి: జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని ప్రజలు డిమాండ్ చేశారు. వారి ఆకాంక్షలను మేము స్వయంగా సీఎం దృష్టికి తీసుకువెళ్లాం. ఎన్నికల సమయంలో వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్లో చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో విడుదలవుతుంది. – కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే శుభపరిణామం వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపడం శుభపరిణామం. జోగులాంబలో కొనసాగితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం సంతోషంగా ఉంది. సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. – రమేష్ కుమార్, అఖిలపక్షం కన్వీనర్ -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఉద్యోగి..!
సాక్షి, హైదరాబాద్ : లంచం తీసుకుంటుండగా ఓ జీహెచ్ఎంసీ ఉద్యోగిని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇల్లు కుట్టకునేందుకు బిద్లాన్ ధర్మేందర్‌సింగ్ అనే వ్యక్తి చార్మినార్ సర్కిల్-9లో దరఖాస్తు చేశాడు. అక్కడ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సయ్యద్ అష్రఫ్ అహ్మద్ పర్మిషన్ ఇచ్చేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు విషయం చెప్పడంతో.. అష్రఫ్ లంచం తీసుకుంటుండగా జామా మజీద్ వద్ద వలపన్ని పట్టుకున్నారు. -
నిరసనకు దిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆర్డీవో ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని అదే విధంగా వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలును పొడిగించాలని ఆందోళనకు దిగారు. పాలమూరు- రంగారెడ్డి జలాల సాధన, వికారాబాద్ శాటిలైట్ సిటీ హామీ అమలు కోసం దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(తాండూరు), వికారాబాద్ మాజీ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్, గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తన ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఇప్పటికే జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికార పార్టీ తీరును ఎండగడుతున్నారు. జోన్ విషయంలో నిరుద్యోగులకు, యువతకు తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల కాకముందే విజయం సాధించాలని పక్కా వ్యూహంతో ఆయన ముందుకు సాగడం విశేషం. ఇక మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారనున్నారనే వార్తల నేపథ్యంలో ఆమెను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన కుమారుడు కార్తీక్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆమె పట్టుపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చేవెళ్లలో పట్టు ఉన్న సబితా కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తుందా లేదా విశ్వేశ్వర్ రెడ్డినే రంగంలోకి దింపుతుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది. -
జోన్ల లొల్లి.. వికారాబాద్ బంద్
సాక్షి, వికారాబాద్ : తమ జిల్లాను జోగులాంబ జోన్లో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు బంద్ చేపట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి బస్ డిపో ముందు బైఠాయించడంతో బస్సులు డిపొకే పరిమితమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు జిల్లా బంద్‌లో పాల్గొన్నాయి. కాగా, జోన్ల విషయంలో సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, దీనిపై కాంగ్రెస్ తరపున కేంద్రానికి లేఖ రాస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వికారాబాద్ జిల్లాను పక్కనే ఉన్నచార్మినార్ జోన్లో కాకుండా ఎక్కడో సుదూరంలో ఉన్న జోగులాంబలో కలపడంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఎక్కడో దూరంలో ఉన్న జహీరాబాద్ ప్రాంతాన్నే చార్మినార్ జోన్లో కలపగా, పక్కనే ఉన్న వికారాబాద్‌ను మాత్రం జోగులాంబ జోన్ల కలపడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇక్కడి వారు అక్కడికెళ్లి ఉద్యోగాలు చేయడమంటే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలైన యాదయ్య, సంజీవరావు తదితర నేతలు సైతం సీఎం కేసీఆర్‌ను ఒప్పించే విషయంలో విఫలమయ్యారని జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయం టీఆర్ఎస్కు జిల్లాలో సెల్ఫ్‌గోల్‌గా మారింది.