చార్మినార్‌ జోన్‌లో.. వికారాబాద్‌ | Vikarabad Merged In Charminar zone | Sakshi
Sakshi News home page

చార్మినార్‌ జోన్‌లో.. వికారాబాద్‌

Published Wed, Sep 4 2019 8:24 AM | Last Updated on Wed, Sep 4 2019 8:24 AM

Vikarabad Merged In Charminar zone - Sakshi

వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌లో కలపాలని నిరాహార దీక్ష చేస్తున్న టీఆర్‌ఆర్‌

ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌లో కలపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు, నిరుద్యోగ యువత, ఉద్యోగుల కల నెరవేరింది. మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించిన సీఎం.. వికారాబాద్‌ జిల్లాను జోగుళాంబ నుంచి చార్మినార్‌ జోన్‌లోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ జోషిని ఆదేశించారు.

సాక్షి, వికారాబాద్‌: జోన్‌ మార్పుపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు శుభప్రద్‌ పటేల్, చిగుల్లపల్లి, రమేశ్‌కుమార్‌ తదితరులు సీఎం నిర్ణయంతో సంబరాలు జరుపుకొన్నారు. 25, మే 2018న రాష్ట్రంలో ఏడు కొత్త జోన్లు, రెండు మల్టీజోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు హైదరాబాద్‌ 6వ జోన్‌లో ఉన్న వికారాబాద్‌ జిల్లాను కొత్తగా ఏర్పాటైన జోగుళాంబ జోన్‌లో కలుపుతూ ఉత్వర్వులు జారీ చేశారు.

మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌ జిల్లాల్లోని 44.63 లక్షల జనాభాతో జోగుళాంబను ఏడో జోన్‌గా ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంపై అప్పట్లో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. వికారాబాద్‌ను చార్మినార్‌జోన్‌లో కలపాలని, లేదంటే తమకు తీరని అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రజల ఆందోళన గమనించిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం కేసీఆర్‌ను కలిసి వికారాబాద్‌ను తిరిగి చార్మినార్‌జోన్‌లో కలపాలని సీఎంను కోరుతూ వచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌లో కలుపుతామని సీఎంతోపాటు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్‌ వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌లో కలుపుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.  

యువత, ఉద్యోగులకు మేలు..  
వికారాబాద్‌ జిల్లా జోగుళాంబ జోన్‌లో కొనసాగితే జిల్లాలోని నిరుద్యోగ యువత, ఉద్యోగులకు నష్టం వాటిల్లేది. చార్మినార్‌ జోన్‌ పరిధిలో లక్షకుపైగా ఉద్యోగాలు ఉంటాయి. దీనికితోడు కొత్తగా ఏర్పాటైన రెండు మున్సిపాలిటీలు, మూడు మండలాల్లోను ఉద్యోగాల భర్తీ ఉంటుంది. దీంతో జిల్లాకు చెందిన నిరుద్యోగులు పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. చార్మినార్‌ జోన్‌లో ఉన్న హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్స్, జీహెచ్‌ఎంసీల్లో కూడా జిల్లా యువత ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి.

జోగుళాంబ జోన్‌ పరిధిలో కేవలం 32వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. దీంతో జిల్లా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయేవి. ప్రస్తుతం జోన్‌మార్పు నిర్ణయంతో ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. జోన్‌మార్పుతో ఉద్యోగులకు సైతం లాభం చేకూరనుంది. వికారాబాద్‌ జిల్లా ఉద్యోగుల బదిలీలు కేవలం జోగుళాంబ జోన్‌ పరిధిలో ఉండేవి కాగా ప్రస్తుతం జోన్‌మార్పుతో చార్మినార్‌ జోన్‌లో ఎక్కడైనా బదిలీలు పొందవచ్చు, అలాగే పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉంటుంది.  

సీఎం నిర్ణయం చరిత్రాత్మకం 
వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌జోన్‌లో కలుపుతూ సీఎం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. ఈవిషయం లో కేసీఆర్‌ జిల్లా ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చి.. నెరవేర్చారు. జోన్‌ మార్పుతో జిల్లా యువతకు, ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ప్రజల తరఫున సీఎం కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.   – రంజిత్‌రెడ్డి, ఎంపీ  

ఆనందంగా ఉంది 
తాండూరు: వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో చేర్చడం చాలా ఆనందంగా ఉంది. జిల్లాను జోగులాంబ జోన్‌లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ యంగ్‌ లీడర్స్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి రాష్ట్రపతికి లక్ష పోస్టు కార్డులు పంపించాం.   
– రోహిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే 

త్వరలో జీవో వస్తుంది 
పరిగి: జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలపాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. వారి ఆకాంక్షలను మేము స్వయంగా సీఎం దృష్టికి తీసుకువెళ్లాం. ఎన్నికల సమయంలో వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌లో చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో విడుదలవుతుంది. 
– కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే  

శుభపరిణామం 
వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలపడం శుభపరిణామం. జోగులాంబలో కొనసాగితే  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం సంతోషంగా ఉంది. సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.   
–  రమేష్‌ కుమార్, అఖిలపక్షం కన్వీనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement