ఎత్తిపోతల్లో మునిగిన డిస్కంలు! | Telangana: Drifting Irrigation Projects Causes More Losses To Discoms | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతల్లో మునిగిన డిస్కంలు!

Published Mon, Jan 3 2022 1:18 AM | Last Updated on Mon, Jan 3 2022 8:38 AM

Telangana: Drifting Irrigation Projects Causes More Losses To Discoms - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ ఎత్తిపోతల పథకాలు విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు గుదిబండగా మారుతున్నాయా? ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న డిస్కంలను మరింతగా కుంగదీస్తున్నాయా? దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) తాజాగా ప్రకటించిన త్రైమాసిక ఎనర్జీ అడిట్‌ నివేదిక అవుననే సమాధానం చెబుతోంది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఐదు ఉమ్మడి జిల్లాలకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ విద్యుత్‌ సరఫరా చేస్తుండగా, గతంలో ఒక్క హైదరాబాద్‌ పాతబస్తీ పరిధిలోనే అసాధారణ రీతిలో విద్యుత్‌ నష్టాలు జరిగేవి.

అయితే తాజాగా చార్మినార్‌ డివిజన్‌లో 35.73 శాతం, అస్మాన్‌గఢ్‌లో 35.01 శాతం, గజ్వేల్‌లో 35.5 శాతం, సిద్దిపేటలో 32.31 శాతం విద్యుత్‌ సాంకేతిక, వాణిజ్య (ఏటీఅండ్‌సీ లాసెస్‌) నష్టాలున్నట్టు 2021 జూలై –సెప్టెంబర్‌ మధ్య కాలానికి సంబంధించిన ఎనర్జీ ఆడిట్‌ నివేదిక వెల్లడించింది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా సిద్దిపేట, గజ్వేల్‌ ప్రాంతాల్లో నిర్మించిన రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లకు సంబంధిం చిన పంప్‌హౌస్‌ల కరెంట్‌ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోవడంతోనే ఓల్డ్‌సిటీకి సమానంగా ఈ రెండు డివిజన్ల పరిధిలో ఏటీఅండ్‌సీ (అగ్రిగేట్‌ టెక్నికల్‌ అండ్‌ కమర్షియల్‌) నష్టాలు పెరిగిపోయినట్టు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. సాంకేతిక లోపాలతో జరిగే విద్యుత్‌ నష్టాలు, విద్యుత్‌ చౌర్యం, బిల్లింగ్‌ లోపాలతో జరిగే నష్టాలు, విద్యుత్‌ బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థతతో జరిగే నష్టాల మొత్తాన్ని ఏటీఅండ్‌సీ లాసెస్‌ అంటారు.  

భారీగా కొనుగోలు.. అరకొరగా బిల్లులు! 
ఎత్తిపోతల పథకాల నిర్వహణకు డిస్కంలు భారీ మొత్తంలో విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కరెంట్‌ బిల్లులను చెల్లించడం లేదు. దీంతో ఎత్తిపోతల పథకాల కనెక్షన్ల నుంచి రావాల్సిన విద్యుత్‌ బిల్లుల బకాయిలు, వాటిపై చెల్లించాల్సిన అపరాధ రుసుం (డిలేయ్డ్‌ పేమెంట్‌ సర్‌చార్జీ)లు రూ.వందల నుంచి రూ.వేల కోట్లకు ఎగబాకి డిస్కంలను భారీ నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి.

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 132 కేవీ లోడ్‌ సామర్థ్యం గల 18 ఎత్తిపోతల పథకాల కనెక్షన్లుండగా, గత జూలై–సెప్టెంబర్‌ మధ్య కాలంలో 476.04 ఎంయూల విద్యుత్‌ను వినియోగం జరిగింది. మరో 11 కేవీ లోడ్‌ సామర్థ్యం కలిగిన 130 కనెక్షన్లుండగా, 7.99 ఎంయూలు, 33 కేవీ సామర్థ్యం లోడ్‌ కలిగిన 19 కనెక్షన్లుండగా 2.69 ఎంయూల విద్యుత్‌ను వాడినట్టు ఆడిట్‌ రిపోర్టు వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement