తీవ్ర ఆర్థిక నష్టాల్లో ధేశంలోని ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థలు
2022–23 నాటికే రూ.6,76,681 కోట్లకు చేరిన నష్టాలు
తెలంగాణలోని రెండు డిస్కంల నష్టాలు రూ.60,922 కోట్లు
నష్టాల్లో దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ డిస్కంలు
రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఏటేటా నష్టాల్లో కూరుకుపోతు న్నాయి. అత్యధిక నష్టాలున్న డిస్కంలు కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నది. దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని డిస్కంలకు కలిపి 2015–16లో రూ.3,74,099 కోట్ల నష్టాలు ఉండగా.. 2022–23 నాటికి అవి రూ.6,76,681 కోట్లకు పెరిగాయి.
ఇదే కాలంలో తెలంగాణ డిస్కంల నష్టాలు రూ.16,520 కోట్ల నుంచి రూ.60,922 కోట్లకు ఎగబాకాయి. రాజ్య సభలో ఎంపీ సంజయ్‌కుమార్ ఝా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది.
ప్రభుత్వరంగ డిస్కంల నష్టాల్లో రూ.1,62,507 కోట్లతో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. రూ.92,070 కోట్ల నష్టాలతో రాజస్థాన్, రూ.91,632 కోట్ల నష్టాలతో ఉత్తరప్రదేశ్, రూ.64,843 కోట్ల నష్టాలతో మధ్యప్రదేశ్ వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నాయి.
లాభాల్లో ప్రైవేటు.. నష్టాల్లో సర్కారీ సంస్థలు
దేశంలోని ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి దివాలా అంచున నిలువగా, ప్రైవేటు రంగ డిస్కంలు మాత్రం లాభాల్లో దూసుకుపోతున్నాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగ డిస్కంల లాభాలు రూ.12,146 కోట్లు ఉండగా.. 2022–23 నాటికి రూ.23,116 కోట్లకు పెరిగాయి.
ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 12 ప్రైవేటు డిస్కంలు ఉండగా, అవన్నీ లాభాల్లోనే నడుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 42 డిస్కంలు ఉండగా.. గుజరాత్‌లోని మూడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌లో ఒక్కో డిస్కం కలిపి మొత్తం ఐదు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మిగిలిన 37 ప్రభుత్వ రంగ డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయి.
మోయలేని అప్పుల్లో దక్షిణ తెలంగాణ డిస్కం
తెలంగాణలో రెండు ప్రభుత్వ రంగ డిస్కంలున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) నష్టాలు 2015–16లో రూ.10,625 కోట్లు ఉండగా, 2022–23 నాటికి రూ.42,330 కోట్లకు చేరాయి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) నష్టాలు ఇదే కాలంలో రూ.5,895 కోట్ల నుంచి 2022–23 నాటికి రూ.18,592 కోట్లకు పెరిగాయి.
భారీగా పెరిగిన అప్పులు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ డిస్కంల అప్పులు 2015–16లో రూ.4,08,941 కోట్లు ఉండగా, 2022–23 నాటికి రూ.6,61,263 కోట్లకు పెరిగాయి. ఇదేకాలంలో తెలంగాణ డిస్కంల అప్పుల రూ.13,944 కోట్ల నుంచి రూ.35,883 కోట్లకు పెరిగాయి.
దేశంలోని డిస్కంల పరిస్థితి
» మొత్తం ప్రభుత్వరంగ డిస్కంలు 42
» నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ డిస్కంలు 37
» 2022–23 నాటికి సర్కారు డిస్కంల నష్టాలు రూ.6,76,681
» లాభాల్లో ఉన్నవి 5
» దేశంలో మొత్తం ప్రైవేటు డిస్కంలు 12
» లాభాల్లో ఉన్న ప్రైవేటు డిస్కంలు 12
Comments
Please login to add a commentAdd a comment