నేడు కరెంట్‌ చార్జీల పెంపుపై నిర్ణయం | Discoms proposal for hike in electricity charges | Sakshi
Sakshi News home page

నేడు కరెంట్‌ చార్జీల పెంపుపై నిర్ణయం

Published Mon, Oct 28 2024 3:32 AM | Last Updated on Mon, Oct 28 2024 3:32 AM

Discoms proposal for hike in electricity charges

రూ.1,200 కోట్ల విద్యుత్‌ చార్జీల పెంపునకు డిస్కంల ప్రతిపాదన 

రూ.963 కోట్ల ట్రూఅప్‌ చార్జీల వసూళ్లకు జెన్‌కో విన్నపం

ప్రకటించనున్న తెలంగాణ ఈఆర్సీ 

9 వేర్వేరు పిటిషన్లపై రానున్న ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపేందుకు రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ మేరకు వేర్వేరు టారిఫ్‌ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈఆర్సీ చైర్మన్‌ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌ రాజు, బండారు కృష్ణయ్యల ఐదేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగియనుండగా, ఒకరోజు ముందు ఈ పిటిషన్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్‌ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కం) దాఖలు చేసిన ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్‌) పిటిషన్లతో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్‌ టారిఫ్‌ (ఎంవైటీ) పిటిషన్లపై ఈఆర్సీ ప్రకటించనున్న నిర్ణయం కీలకం కానుంది. దీంతో నవంబర్‌ 1 నుంచి వినియోగదారులపై ప్రత్యక్షంగా చార్జీల పెంపు భారం పడబోతోంది. 

హెచ్‌టీ కేటగిరీలో ఎనర్జీ (విద్యుత్‌) చార్జీల పెంపు, లోటెన్షన్‌ (ఎల్టీ) కేటగిరీలో నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే వారి ఫిక్స్‌డ్‌ చార్జీ (డిమాండ్‌ చార్జీ)ల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్‌టీ కేటగిరీకి ఎనర్జీ చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం వేసేందుకు అనుమతి కోరాయి. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారులకు ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. 

అలాగే జెన్‌కో 2022–23కి సంబంధించి దాఖలు చేసిన రూ.963.18 కోట్ల ట్రూఅప్‌ చార్జీల పిటిషన్‌తో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన ఎంవైటీ పిటిషన్‌పై సైతం ఈఆర్సీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. వీటితో భవిష్యత్తులో వినియోగదారులపై పరోక్షంగా చార్జీల పెంపు భారం పడనుంది. 

రూ.16,346 కోట్ల ట్రాన్స్‌కో ఏఆర్‌ఆర్‌పై రేపు
ట్రాన్స్‌కో దాఖలు చేసిన 2024–29 మధ్యకాలానికి ట్రాన్స్‌మిషన్‌ బిజినెస్, ఎస్‌ఎల్‌డీసీ యాక్టివిటీకి సంబంధించిన రెండు ఎంవైటీ పిటిషన్లపై ఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.16,346.1 కోట్ల ఆదాయ అవసరాలున్నట్టు అంచనా వేస్తూ ఆ మేరకు ట్రాన్స్‌మిషన్‌ చార్జీలను కొంతవరకు పెంచి వసూలు చేసుకోవడానికి ట్రాన్స్‌కో ప్రతిపాదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement