సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి విద్యుత్ సరఫరాకు చేస్తున్న వ్యయంతో పోలిస్తే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న బిల్లులు, సబ్సిడీల రూపంలో వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో.. విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) నష్టాలు ఏటేటా పేరుకుపోతున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రంలోని రెండు డిస్కంల నష్టాలు కలిపి మొత్తం రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. అందులో రూ.39,692 కోట్ల నష్టాలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)వే కాగా, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పిడీసీఎల్) నష్టాలు రూ.17,756 కోట్లు ఉన్నాయి.
2023–24లో రెండు డిస్కంలు మరో రూ.6,299.29 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పిడీసీఎల్ సంస్థలు 2023–24కి సంబంధించిన తమ చివరి త్రైమాసిక నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఏటేటా పెరుగుతున్న నష్టాలు: గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, ఇతర అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాలో కీలకమైన డిస్కంలు ఏటేటా భారీ నష్టాలు మూటగట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లకు పెరిగిన డిస్కంల నష్టాలు, 2018–19 ముగిసే నాటికి రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2020 మార్చి 31 నాటికి రూ.రూ.42,292 కోట్లకు ఎగబాకినట్టు తాజాగా డిస్కంలు బహిర్గతం చేసిన వార్షిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2022–23 నాటికి 51,149.98 కోట్లు ఉన్న నష్టాలు 2023–24 నాటికి రూ.57,448 కోట్లకు చేరాయి.
రూ.45,241 కోట్లకు చేరిన అప్పులు: రెండు డిస్కంల దీర్ఘకాలిక రుణాలు రూ.23,895.27 కోట్లకు, స్వల్ప కాలిక రుణాలు రూ.21,345.73 కోట్లకు పెరిగాయి. దీంతో డిస్కంల మొత్తం రుణాలు రూ.45,241 కోట్లకు చేరాయి. విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపులతోపాటు ఉద్యోగులకు జీతాల చెల్లింపుల కోసం డిస్కంలు ఎడాపెడా స్వల్పకాలిక రుణాలు తీసుకుంటున్నాయి. దీనికితోడు పంపిణీ వ్యవస్థ సామర్థ్యం పెంపుదల కోసం భారీగా దీర్ఘకాలిక రుణాలు పొందాయి.
బకాయిలు రూ.44,744 కోట్లు
తెలంగాణ జెన్‌కో, ఏపీ జెన్‌కో, సింగరేణి తదితర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కి సంబంధించిన బకాయిలతోపాటు ఇతర అన్ని బకాయిలు కలిపి రెండు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.44,744.3 కోట్లను ఎగబాకాయి.
ఇటు అప్పులు, అటు చెల్లించాల్సి ఉన్న బకాయిలు భారీగా పెరిగిపోవడంతో రెండు డిస్కంలు దివాళాబాటలో నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు వెంటిలేటర్‌గా మారి డిస్కంల దీపం ఆరిపోకుండా కాపాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment