న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్, వాటి అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ట్రస్టీల ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ఫోరెన్సిక్ ఆడిటర్లను సెబీ నియమించనుంది. యూనిట్ హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా మ్యూచువల్ ఫండ్ ట్రస్టీల పాత్ర, వాటిని జవాబుదారీ చేయడానికి సెబీ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేయడం తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, ఏఎంసీలు, ట్రస్టీలు లేదా బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతల నిర్వహణకు అర్హత కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ సెబీ ప్రకటన జారీ చేసింది.
ఎంపికైన సంస్థలు డిజిటల్ ఆధారాలైన మొబైల్, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, హార్డ్ డ్రైవ్‌లు, యూఎస్‌బీ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకుని, వాటిని విశ్లేషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రక్రియలో గుర్తించిన అంశాలతో నివేదికను రూపొందించి సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్, డిజిటల్ ఫోరెన్సిక్‌లో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలని సెబీ షరతుల్లో పేర్కొంది. అలాగే, కనీసం 10 పార్ట్‌నర్లు లేదా డైరెక్టర్లను ట్రస్టీ బోర్డుల్లో కలిగి ఉండాలని నిబంధనలు విధించింది. దరఖాస్తుల సమర్పణకు మార్చి 6 వరకు గడువు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment