Forensic
-
నిషేధిత జాబితాలోని భూములే టార్గెట్ గా అక్రమాలు..
-
ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై‘రెవెన్యూ’లో గుబులు
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి పోర్టల్ పేరుతో గత ప్రభుత్వంలోని పెద్దలు అక్రమాలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి భూముల రికార్డులు మార్చేశారు. ఇదో పెద్ద ఆర్థిక నేరం. ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరుపుతాం..’ ఇది ఇటీవల ముగిసిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. ఈ ప్రకటన రెవెన్యూ శాఖలో గుబులు రేపుతోంది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ ఎలా ఉంటుంది? ఏఏ లావాదేవీలపై ఆడిటింగ్ చేస్తారు? ఎవరిని బాధ్యులుగా తేలుస్తారు? ఎప్పుడు ఏం జరుగుతుంది? అనే అంశాలు ఇప్పుడు రెవెన్యూ శాఖ పరిధిలో హాట్‌టాపిక్‌గా మారాయి. అసలేంటీ... ఆడిటింగ్?: ఆన్‌లైన్‌తో ముడిపడి ఉన్న ప్రతి వ్యవస్థలో జరిగే లావాదేవీలను డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా సరి పోల్చడాన్ని ఫోరెన్సిక్ ఆడిటింగ్ కింద పరిగణించవచ్చు. ఇందుకోసం ట్రాన్సాక్షన్ హిస్టరీ (లావాదేవీ జరిగిన తీరు)ని పరిగణనలోకి తీసుకుంటారు. లావాదేవీ ఎక్కడ, ఎలా జరిగింది? ఏ రికార్డుల ఆధారంగా నిర్వహించారు? ఎవరెవరు ఏ సమయంలో జరిపారు? ఆ కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఏంటి?... ఇలా సదరు లావాదేవీ జరిగిన తీరును కూలంకశంగా పరిశీలించి నిబంధనల మేరకు జరిగిందా లేక నిబంధనలు ఉల్లంఘించారా అన్నది నిగ్గు తేల్చడమే ఈ ఆడిటింగ్ ప్రధాన ఉద్దేశమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన దాన్ని బట్టి ఇప్పుడు ధరణి పోర్టల్ లావాదేవీలను కూడా డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ లేదా ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా మదింపు చేయనున్నారు. ఆ లావాదేవీల్లో ఎవరెవరు భాగస్వాములయ్యారనే దాన్ని ఈ ఆడిటింగ్ కీలకంగా పరిగణించనుంది. క్రయ, విక్రయదారుల నుంచి ధరణి ఆపరేటర్, తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్ఏ వరకు ఎవరి పాత్ర ఏంటన్న దానిపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.పాత రికార్డులు... కొత్త లావాదేవీలు ధరణి పోర్టల్ వేదికగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో అక్రమ లావాదేవీలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. రాత్రికిరాత్రి నిషేధిత జాబితాను అన్‌లాక్ చేసి వారికి కావాల్సిన సర్వే నంబర్‌ను తొలగించి మళ్లీ ఆ జాబితాను లాక్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా భూములే టార్గెట్‌గా ఈ ఆడిటింగ్ జరగొచ్చనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటికి ఉన్న రికార్డుల వివరాలు, పోర్టల్‌లో నమోదు చేసిన వివరాలు, ఈ రికార్డుల ఆధారంగా జరిపిన లావాదేవీలు ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో కీలకమవుతాయని రెవెన్యూ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ‘పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటికి నిషేధిత జాబితా కింద ఉన్న భూముల రికార్డులు తీసుకుంటారు. ఆ తర్వాత ధరణి పోర్టల్‌లో నమోదైన వివరాలను సరిచూస్తారు. ఈ క్రమంలో సందేహాస్పదంగా ఉన్న లావాదేవీలను మరింత లోతుగా పరిశీలించి నిగ్గు తేలుస్తారు’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు. ట్రాన్సిట్ పీరియడ్ పూర్తి కాగానే...! ఫోరెన్సిక్ ఆడిటింగ్‌ను రెవెన్యూ శాఖ ముఖ్యఅధికారులతో చేయిస్తారా? లేక ఇతర శాఖల్లోని ముఖ్య అధికారులతో కలిపి చేయిస్తారా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై వచ్చే నెలలో విధాన ప్రకటన చేసే అవకాశం ఉంది. వాస్తవానికి, ధరణి పోర్టల్ నిర్వహణను ప్రస్తుత ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించింది. గతంలో ఈ పోర్టల్ నిర్వహించిన టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీ ఈ బాధ్యతలు తీసుకుంటోంది.ఈ క్రమంలో టెర్రాసిస్ నుంచి పోర్టల్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఎన్ఐసీ తీసుకుంటోంది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ఈ వివరాల పంపిణీ (ట్రాన్సిట్) కోసం ప్రభుత్వం ఇచ్చిన రెండు నెలల గడువు.. డిసెంబర్ 31తో ముగియనుంది. అంటే జనవరి 1 నుంచి భూభారతి (ధరణి స్థానంలో) పోర్టల్‌ను ఎన్ఐసీ నిర్వహించనుంది. ఫోరెన్సిక్ ఆడిట్లో వచ్చిన సమాచారం ఆధారంగా ‘సిట్’ను ఏర్పాటు చేయొచ్చని, తద్వారా ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారన్న అంశాలను తేలుస్తారని చెబుతున్నారు. తహశీల్దార్ల డిజిటల్ సంతకాలు ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత భూ సమస్యల పరిష్కార బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించారు. కానీ సదరు పరిష్కారాలను ధ్రువీకరిస్తూ సవరించే రికార్డులపై తహశీల్దార్ల డిజిటల్ సంతకాలే నమోదు చేశారు. ఈ విషయంలో పలుమార్లు తహశీల్దార్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కనీసం తమ ప్రమేయం లేకుండా తీసుకునే నిర్ణయాలను తమ డిజిటల్ సంతకాలతో ధ్రువీకరించడమేంటని, వెంటనే తమ సంతకాలు తొలగించాలని కూడా డిమాండ్ చేశాయి. కానీ, అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ డిజిటల్ సంతకాలేం చేస్తాయోననే గుబులు తహశీల్దార్లలో మొదలైంది.ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పనిచేసిన తహశీల్దార్లు ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనతో ఉన్నారు. ఇదిలాఉంటే.. అసలు తహశీల్దార్ల డిజిటల్ సంతకాలు కూడా లేకుండా రాత్రికిరాత్రే డాక్యుమెంట్లు మారిపోయాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిటింగ్‌ను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో.. ఏం తేలుస్తుందో.. ఎవరిని బాధ్యులను చేస్తుందో... అనే అంశాలు ఇప్పుడు రెవెన్యూ శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
‘నీట్’ నిందితులకు నార్కో బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు!
పాట్నా/దేవగఢ్: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బిహార్ పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నీట్ అసలైన ప్రశ్నపత్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) నుంచి సేకరించారు. పేపర్ లీకేజీకి సంబంధించి గత నెలలో పాటా్నలోని ఓ ఇంట్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న ప్రశ్నపత్రాలతో ఈ ప్రశ్నపత్రాలను సరిపోల్చనున్నారు. ఫోరెన్సిక్ టెస్టు తర్వాత సరిపోల్చే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన నిందితులకు నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాల్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉండడంతో ఈడీ సైతం దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
దటీజ్ డాక్టర్ మహాలక్ష్మీ..వెయ్యికి పైగా డైడ్బాడీస్కి పోస్ట్‌మార్టం
‘అమ్మాయిలు పోస్ట్‌మార్టం చేయలేరు’ ఈ అపోహ తప్పని నిరూపిస్తున్నారు ఈ రంగంలోకి వస్తున్న యువ డాక్టర్లు. నాలుగేళ్లలో వెయ్యికి పైగా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసి, అమ్మాయిలూ చేయగలరు అని నిరూపిస్తున్నారు కర్ణాటకలోని కార్వార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహాలక్ష్మి మన దేశంలో మొట్టమొదటి ఫోరెన్సిక్ సైంటిస్ట్‌గా డాక్టర్ రుక్మిణీ కృష్ణమూర్తి వార్తల్లో నిలిచారు. ముంబయ్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో 1974లో చేరిన ఆమె రిటైర్ అయ్యేంతవరకు వర్క్ చేశారు. ఆమె స్ఫూర్తితో ఆ తర్వాత ఈ రంగంవైపు ఆసక్తి చూపినవాళ్లు ఉన్నారు. కానీ, వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలోనే ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని చూడటం సాధారణం. కానీ, కాలిపోయిన శరీరాలు, ప్రమాదాలలో ఛిద్రమైన శరీరాలు, నీటిలో మునిగిపోయిన శరీరాలు చూడటం సాధారణం కాదు. విషం కారణంగా శరీరం నీలం రంగులోకి మారడం లేదా ఆత్మహత్య కారణంగా మృతదేహాలను చూడటం మరింత బాధాకరం. సున్నితమనస్కులైన మహిళలు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించలేరనేది అందరూ అనుకునేమాట. అయితే, ఈ వృత్తిని తాను ఛాలెంజింగ్‌గా తీసుకున్నానని చెబుతున్నారు డాక్టర్ మహాలక్ష్మి. చదువుకునే రోజుల్లో... ‘‘అమ్మనాన్నలకు ఐదుగురం ఆడపిల్లలం. అందులో ముగ్గురం డాక్టర్లమే. ఒక అక్క డెంటిస్ట్, మరొకరు ఆయుర్వేద డాక్టర్. వాళ్లని చూసే నేనూ డాక్టర్ కావాలని కల కన్నాను. ఆయుర్వేద వైద్యురాలైన మా అక్క ఫోరెన్సిక్ డాక్టర్ కావాలనుకుంది. కానీ, తను ఆ దారిలో వెళ్లలేకపోయింది. నేను ఈ టాపిక్‌ను ఎంచుకున్నప్పుడు మా అక్క ఎంతో సపోర్ట్‌నిచ్చింది. మా నాన్న ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. మా ఇంట్లో ఎప్పుడూ చదువుకే ప్రాధాన్యత ఉండేది. రిస్క్ ఎందుకు అన్నారు.. చదువుకునే రోజుల్లో సీఐడీ సీరియల్ చూసేదాన్ని. అందులో ఫోరెన్సిక్ విభాగం నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలోనే ఫోరెన్సిక్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టాను. మా ప్రొఫెసర్లు కూడా నాకు ఆ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని, నేర కథనాలను వివరించేవారు. ఇందుకు సంబంధించిన నవలలు కూడా చదివాను. మా క్లాస్మేట్ అబ్బాయిలు మాత్రం ‘ఈ విభాగం వద్దు, అమ్మాయివి ఎందుకు రిస్క్. ఇది కేవలం మార్చురీ గురించి మాత్రమే కాదు, సాక్ష్యం కోసం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులతో కలిసి పనిచేయాలి. రాత్రి, పగలు ఎప్పుడు అవసరమున్నా చురుగ్గా పనిచేయాలి. లేడీస్‌కి అంత సులభం కాదు’ అన్నారు. ‘మా నాన్నగారు కూడా పెళ్లై, సంప్రదాయ కుటుంబంలోకి వెళితే ఇబ్బందులుగా మారతాయి’ అన్నారు. కానీ, ఒక కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణుల పాత్ర చాలా ముఖ్యం అని నాకు తెలుసు. ఈ ఫీల్డ్‌లో ఛాలెంజెస్ ఎక్కువ. నేను చేయగలను అని భావించే ఈ విభాగంలోకి వచ్చాను. ఇప్పుడు నా నిర్ణయాన్ని అంతా సమర్ధిస్తున్నారు’’ అని వివరించారు ఈ ఫోరెన్సిక్ డాక్టర్. అనేక పరిశోధనలు.. మేల్ డామినేటెడ్ వృత్తిలో ఎలా చోటు సంపాదించుకున్నావని నన్ను చాలామంది అడుగుతుంటారు. సవాళ్లు అంటే ఇష్టం అని చెబుతుంటాను. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని హుబ్లీ నగరం. ప్రాథమిక విద్య వరకు బెల్గాంలో చదివాను. ఆ తర్వాత కాలేజీ చదువంతా హుబ్లీలోనే. 2007 నుండి 2017 మధ్యన బెల్గాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఏడాది పాటు గ్రామీణ ప్రజలకు సేవ చేశాను. 2020లో ఫోరెన్సిక్ విభాగంలో చేరాను. అప్పటి నుండి అనేక పరిశోధనలను ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో కలిసి పనిచేశాను. మెడికల్ స్టూడెంట్స్‌కు క్లాసులు తీసుకుంటున్నాను. ఈ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. – డాక్టర్ మహాలక్ష్మి -
ఫోరెన్సిక్ ఆడిటర్లకు గడువు పెంపు
న్యూఢిల్లీ: ఫోరెన్సిక్ ఆడిటర్లుగా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇలా ఎంపికైన ఆడిటర్లు మ్యూచువల్ ఫండ్స్, ఆస్తుల నిర్వహణ కంపెనీ(ఏఎంసీ)లు, ట్రస్టీ సంస్థలకు సేవలు అందించవలసి ఉంటుంది. అర్హతగల సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఇచ్చిన గడువు ఈ నెల 6తో ముగియగా.. తాజాగా మార్చి 31వరకూ సెబీ పొడిగించింది. దరఖాస్తుదారులు మొబైళ్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు తదితర యూఎస్బీ డ్రైవ్‌ల నుంచి సమాచారాన్ని సేకరించడం, క్రోడీకరించడం, డిజిటల్ ఎవిడెన్స్‌పై నివేదికలు రూపొందించడం తదితర కార్యకలాపాలు చేపట్టవలసి ఉంటుంది. బైబ్యాక్ బిడ్స్, ధరలపై సెబీ ఆంక్షలు స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా చేపట్టే బైబ్యాక్‌లకు వర్తింపు స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా చేపట్టే సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)లో సెబీ తాజాగా ఆంక్షలు విధించింది. బిడ్స్ వేయడం, ధరల నిర్ణయం, పరిమాణం తదితర అంశాలకు ఆంక్షలు వర్తింపచేస్తూ సెబీ సర్క్యులర్‌ను జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం కొనుగోలు తేదీ నుంచి గత 10 ట్రేడింగ్ పనిదినాల రోజువారీ సగటు పరిమాణం(విలు వ)లో 25 శాతాన్ని మించి బైబ్యాక్ చేపట్టేందుకు వీలుండదు. మార్కెట్ ప్రారంభానికి ముందు తొలి అర్ధగంట, ట్రేడింగ్ సమయంలో చివరి అర్ధగంట లో బైబ్యాక్ బిడ్స్‌ను అనుమతించరు. క్రితంరోజు ట్రేడైన ధరకు 1% శ్రేణిలో మాత్రమే ఆర్డర్లకు అను మతి ఉంటుంది. తాజా నిబంధనలను అమలు చేయవలసిందిగా అటు కంపెనీలు, ఇటు ఎంపిక చేసిన బ్రోకర్లను సెబీ ఆదేశించింది. నిబంధనల అమలును స్టాక్ ఎక్సే్ఛంజీలు పర్యవేక్షిస్తుంటాయని, ఉల్లంఘిస్తే జరిమానా లేదా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బైబ్యాక్ చేపట్టేందుకు స్టాక్ ఎక్సే్ఛంజీలు, టెండర్ ఆఫర్ మార్గా లు అందుబాటులో ఉన్నాయి. కాగా.. స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా బైబ్యాక్ చేపట్టడాన్ని దశలవారీగా తొలగించనున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరుకల్లా పాన్–ఆధార్ లింక్ ఇన్వెస్టర్లకు సెబీ తాజా ఆదేశాలు సెబీ ఈ నెలాఖరులోగా ఆదాయ పన్ను శాఖ నుంచి పొందే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) కు ఆధార్‌ను లింక్ చేయవలసిందిగా ఇన్వెస్టర్లను మరోసారి ఆదేశించింది. తద్వారా సెక్యూరిటీల మార్కెట్లో లావాదేవీలను ఎలాంటి సమస్యలూ లేకుండా నిర్వహించుకునేందుకు వీలుంటుందని తెలియజేసింది. గడువులోగా పాన్‌కు ఆధార్‌ను లింక్ చేయని ఇన్వెస్టర్లను కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తామని పేర్కొంది. దీంతో సెక్యూరిటీలు, ఇతర లావాదేవీలపై ఆంక్షలు అమలుకానున్నట్లు వెల్లడించింది. 2023 మార్చి31లోగా ఆధార్‌ను లింక్ చేయకుంటే పాన్ సేవలు నిలిచిపోనున్నట్లు 2022 మార్చిలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది. అంతేకాకుండా 1961 ఆదాయపన్ను చట్టం ప్రకారం తగిన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేసింది. -
మ్యూచువల్ ఫండ్స్ ఫోరెన్సిక్ ఆడిటింగ్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్, వాటి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ట్రస్టీల ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ఫోరెన్సిక్ ఆడిటర్లను సెబీ నియమించనుంది. యూనిట్ హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా మ్యూచువల్ ఫండ్ ట్రస్టీల పాత్ర, వాటిని జవాబుదారీ చేయడానికి సెబీ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేయడం తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, ఏఎంసీలు, ట్రస్టీలు లేదా బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతల నిర్వహణకు అర్హత కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ సెబీ ప్రకటన జారీ చేసింది. ఎంపికైన సంస్థలు డిజిటల్ ఆధారాలైన మొబైల్, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, హార్డ్ డ్రైవ్‌లు, యూఎస్బీ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకుని, వాటిని విశ్లేషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రక్రియలో గుర్తించిన అంశాలతో నివేదికను రూపొందించి సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్, డిజిటల్ ఫోరెన్సిక్లో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలని సెబీ షరతుల్లో పేర్కొంది. అలాగే, కనీసం 10 పార్ట్నర్లు లేదా డైరెక్టర్లను ట్రస్టీ బోర్డుల్లో కలిగి ఉండాలని నిబంధనలు విధించింది. దరఖాస్తుల సమర్పణకు మార్చి 6 వరకు గడువు ఇచ్చింది. -
గోమెకానిక్ ఖాతాల్లో గోల్మాల్
న్యూఢిల్లీ: వాహనాల రిపేర్ సేవలు అందించే స్టార్టప్ సంస్థ గోమెకానిక్ ఆర్థిక అవకతవకల వివాదంలో చిక్కుకుంది. ఈ వ్యవహారాన్ని స్వయంగా అంగీకరించిన కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. సంస్థ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే వ్యాపారాన్ని కూడా పునర్వ్యవస్థీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 70 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపారు. గోమెకానిక్లో దాదాపు 1,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోగా మిగిలిన సిబ్బందిని జీతాలు లేకుండా మూడు నెలల పాటు పని చేయాలంటూ కంపెనీ కోరినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ గోమెకానిక్ను మరింత వృద్ధిలోకి తేవాలనే యావలో పడి వ్యవస్థాపకులు నియంత్రణ తప్పి వ్యవహరించారని, తప్పిదాలు చేశారని లింక్డ్ఇన్లో రాసిన పోస్టులో భాసిన్ పేర్కొన్నారు. దీనికి తాము తీవ్రంగా చింతిస్తున్నామని ఆయన తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత మాదే. పెట్టుబడులను సమకూర్చుకునేలా పరిష్కార మార్గాలను అన్వేషించుకుంటూ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించాలని అంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం‘ అని భాసిన్ చెప్పారు. రూ. 120 కోట్ల పైగా రుణభారం ఉండగా, అందులో మూడో వంతు రుణాన్ని సత్వరం తిరిగి చెల్లించాల్సిన నేపథ్యంలో గోమెకానిక్ మనుగడ సాగించాలంటే నిధులను తప్పనిసరిగా సమీకరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఆదాయాలను అధికంగా చూపడమే కాకుండా వ్యవస్థాపకులు కావాలనే వాస్తవాలను దాచిపెట్టారని ప్రధాన ఇన్వెస్టర్లు ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఈ అవకతవకలపై విచారణ జరిపేందుకు థర్డ్ పార్టీని ఎంపిక చేసినట్లు వివరించారు. కార్ల యజమానులను వారి ప్రాంతంలోని మెకానిక్ షాపులకు అనుసంధానించే స్టార్టప్‌గా గోమెకానిక్ 2016లో ప్రారంభమైంది. కుశాల్ కర్వా, నితిన్ రాణా, రిషభ్ కర్వా, భాసిన్ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. సెకోయా క్యాపిటల్, టైగర్ గ్లోబల్ వంటి సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. గోమెకానిక్ 2021 జూన్‌లో 42 మిలియన్ డాలర్లు సమీకరించింది. -
ఏపీ ఫోరెన్సిక్ మాజీ డైరెక్టర్ మృతి
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ శివ కుమార్ రాజు (74) విజయవాడలోని డీవీ మేనర్ హోటల్లో శుక్రవారం రాత్రి మృతి చెందటం కలకలం సృష్టించింది. అయితే, ఆయనది సాధారణ మృతిగానే ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు పోలీసులు. హైదబాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న శివకుమార్.. ఓ కేసు విషయంలో ఇటీవలే విజయవాడకు వచ్చారు. శనివారం ఉదయం ఎన్నిసార్లు ఫోన్ చేసినా, బెల్ కొట్టినా రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది మరో తాళంచెవితో లోపలికివెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నారు శివకుమార్. హోటల్ సిబ్బంది అందించిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని క్లూస్ సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సాధారణ మృతిగానే ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి.. కేసుగా నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ.. 5 పెద్ద విమానాల టేకాఫ్ చేసేలా విస్తరణ -
ఫోరెన్సిక్ వర్సిటీ ఏర్పాటు చేయండి
సాక్షి,న్యూఢిల్లీ: తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్యూ) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల కొరతను తీర్చేలా.. జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్ సైన్స్, క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు నిర్వహించేందుకు ఈ యూనివర్సిటీ ఏర్పాటు ఎంతో అవసరమని సీఎం వివరించారు. దేశంలో ప్రపంచ స్థాయి విద్యను అందించడంతో పాటు, దేశ వ్యాప్తంగా క్రిమినల్ జస్టిస్ ఇన్స్టిట్యూట్లను బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందులో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్ కేంద్రంగా ఇప్పటికే నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. దీంతోపాటు ఢిల్లీ, గోవా, త్రిపురలో కూడా క్యాంపస్‌లు స్థాపించిందని గుర్తు చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండవ రోజు గురువారం ఉదయం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విన్నవించిన అంశాలు సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాల గురించి అమిత్ షాతో చర్చించారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడిచినప్పటికీ, విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలా వరకు ఇప్పటికీ నెరవేర్చలేదని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య కీలక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రూ.6,886 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పనపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం.. అమిత్‌షాను కోరారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యకమని పునరుద్ఘాటించారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరారు. కడపలో నిర్మించనున్న సీల్ ప్లాంటుకు సరిపడా ముడి ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న తెలంగాణ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు సంబంధించిన పలు అంశాలను అమిత్ షాకు ముఖ్యమంత్రి వివరించారు. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అన్ని ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అనధికారకంగా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగుల వద్ద నిర్మిస్తున్న విషయం గురించి ఇదివరకే కేంద్రం దృష్టికి తెచ్చామని చెప్పారు. ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్ సైన్స్, క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు మరింతగా ఊపందుకోవాలి. ఈ దిశగా గుజరాత్లో ఎన్ఎఫ్ఎస్యూ వర్సిటీ.. ఢిల్లీ, గోవా, త్రిపురలో ఇప్పటికే క్యాంపస్‌లు ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ రంగాలు మరింత బలోపేతమవ్వడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం చేకూర్చే దిశగా మరిన్ని అడుగులు ముందుకు పడతాయి. 2014–15కు సంబంధించి రూ.18,330.45 కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ.32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలి. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,937.92 కోట్ల సొంత నిధులు ఖర్చు చేసింది. ఈ డబ్బును రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదు. ఇప్పటికైనా ఇచ్చేలా వెంటనే చర్యలు తీసుకోగలరు. – కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్ జగన్ -
ఏపీలో పటిష్టంగా ఫోరెన్సిక్ వ్యవస్థ
సాక్షి, అమరావతి : దిశ వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం నేర పరిశోధనను బలోపేతం చేస్తోంది. ఇందులో కీలకమైన ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలనూ పటిష్టపరుస్తోంది. 2014లో రాష్ట్ర విభజనతో ఫోరెన్సిక్ మౌలిక వసతుల వ్యవస్థ అంతా హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. 2019 వరకు రాష్ట్రంలో ఏ నేరం జరిగినా.. ఫోరెన్సిక్ నివేదికల కోసం హైదరాబాద్‌పై ఆధారపడాల్సి వచ్చేది. దీంతో నేర పరిశోధన ఆలస్యమై దోషులను గుర్తించడం, నేరాన్ని నిరూపించడంలో జాప్యం జరిగేది. దీనికి విరుగుడుగా రాష్ట్రంలోనే ఫోరెన్సిక్ సైన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునిక ల్యాబొరేటరీలతో మౌలిక వసతులను కల్పిస్తూనే.. మరోవైపు పూర్తిస్థాయిలో నిపుణుల నియామకం ద్వారా ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఏడుచోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు రాష్ట్రంలో ఏడు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లతోపాటు పెద్దఎత్తున నిపుణుల నియామక ప్రక్రియను సర్కారు చేపట్టింది. అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, విజయవాడలలో దిశ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల ఏర్పాటుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను ఆమోదించింది. డీఎన్ఏ పరిశోధన సామర్థ్యాన్ని మూడింతలు.. సైబర్ నేర పరిశోధన మౌలిక వసతుల సామర్థ్యాన్ని ఐదింతలు పెంచింది. దాంతోపాటు ఫోరెన్సిక్ నిపుణుల సంఖ్యను ఐదింతలు పెంచాలని నిర్ణయించింది. అందుకోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. 58 మంది సైంటిఫిక్ అసిస్టెంట్ల నియామకం రాష్ట్రంలో ఇటీవలే 58 మంది సైంటిఫిక్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. మొత్తం 58 మంది పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 8,127 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. వారిలో 3,481 మంది అర్హత సాధించగా 58 మందిని ఎంపికచేసింది. సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్) పోస్టులకు 18 మందిని, సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్) పోస్టులకు 18 మందిని, సైంటిఫిక్ అసిస్టెంట్ (బయాలజీ/సెరోలజీ) ఖాళీల్లో 22 మందిని నియమించి వారికి శిక్షణనిస్తోంది. కాంట్రాక్టు పద్ధతిలో 46 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఇక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో మరో 46 మంది నిపుణులను కాంట్రాక్టు విధానంలో ప్రభుత్వం తాజాగా నియమించింది. ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి అర్హుల జాబితాను తెప్పించుకుని అర్హులైన వారికి రాత పరీక్ష నిర్వహించింది. తద్వారా సైంటిఫిక్ అసిస్టెంట్లు 16 మంది, ల్యాబ్ అసిస్టెంట్లు 15 మంది, ల్యాబ్ టెక్నీషియన్లు 15 మందిని నియమించింది. త్వరలో 15 మంది సైంటిఫిక్ ఆఫీసర్ల పోస్టులను కూడా భర్తీ చేయనుంది. -
శవమే శివం.. భోజనం 2 పూటలే.. శుభకార్యాలకు దూరం
కర్నూలు(హాస్పిటల్): ఫోరెన్సిక్ విభాగం అంటే పోలీసులు, వైద్యులు, మీడియా, కొద్దిగా ఉన్నత విద్యావంతులకు మినహా మిగిలిన వారికి పెద్దగా పరిచయం లేని ప్రాంతం. అయితే మార్చురి అంటే దాదాపుగా అందరికీ పరిచయమే. దాని పేరు చెబితేనే...ఆ శవాల గదా..అని ముఖం చిట్లిస్తారు. మరికొందరు అటువైపు వెళ్లాలంటేనే దెయ్యాలంటాయని భయపడతారు. మరికొందరు అక్కడి దుర్వాసనను తట్టుకోలేక అటువైపు వెళ్లాలంటే జంకుతారు. తప్పనిసరైన పరిస్థితుల్లో అక్కడికి వెళ్లే వివిధ వర్గాల ప్రజలు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతామా అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో అక్కడే విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే ఒళ్లు జలదరిస్తుంది. కాస్త లోతుగా ఆలోచిస్తే అయ్యోపాపం అనిపిస్తుంది. వారి జీవితం దయనీయంగా ఉంటుంది. కర్నూలు మెడికల్ కాలేజి 1954లో స్థాపించారు. కాలేజి ఆవిర్భావంతోనే ఫోరెన్సిక్ విభాగం కూడా ఏర్పడింది. ప్రస్తుతం ఈ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్. శంకర్(హెచ్‌వోడి), డాక్టర్ పి. బ్రహ్మాజీ మాస్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వైకేసి రంగయ్య, మరో నలుగురు కన్సాలిడేట్ పే అసిస్టెంట్ వైద్యులు, ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులు పనిచేస్తున్నారు. మరో నాలుగు ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విభాగానికి సంబంధించి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే గది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉంది. ఇక్కడికి చికిత్సకు కర్నూలు జిల్లాతో పాటు పక్కనున్న ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లా, అనంతపురం, తెలంగాణాలోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, కర్నాటకలోని బళ్లారి, రాయచూరు జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. దీనికితోడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తూ రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు, ఆత్మహత్యల వల్ల మరణించిన వారి కేసులూ ఉంటాయి. ఈ మేరకు ప్రతిరోజూ సగటున మూడు నుంచి ఐదు, నెలకు 120 దాకా, ఏటా 1200 నుంచి 1500ల దాకా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు. టిఫిన్ చేసి వస్తే మళ్లీ రాత్రి భోజనమే ఇక్కడ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తారు. దీంతో పాటు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్నం 1 గంటల వరకు పోస్టుమార్టం చేస్తారు. ఈ మేరకు మొత్తం మృతదేహాలకు పోస్టుమార్టం ముగిశాకే వారు భోజనం చేయాల్సి వస్తోంది. అంటే రోజూ 4 నుంచి 5 గంటల తర్వాతే ఇంటికి వెళ్లి స్నానం చేసిన తర్వాతే భోజనం చేస్తున్నారు. అప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోవడానికి వీలుండదు. ఈ కారణంగా వారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మళ్లీ రాత్రి భోజనంకు మాత్రమే పరిమితమయ్యారు. పురుగులు పట్టినా చూడాల్సిందే.. పోస్టుమార్టం చేసే సమయంలో కొన్ని మృతదేహాలు కుళ్లిపోయి పురుగులు పట్టి ఉంటాయి. ఇలాంటి దృశ్యాలు చూస్తే సామాన్య ప్రజలు జడుసుకుంటారు. కానీ ఫోరెన్సిక్ వైద్యులు, సిబ్బంది మాత్రం వృత్తిధర్మంగా భావించి దుర్వాసనను భరిస్తూ విధులు నిర్వహిస్తారు. ఒక్కోసారి మృతదేహాలను కోసే సమయంలో లీటర్ల కొద్దీ రక్తాన్ని జగ్గుతో తోడిపోయడం వంటి దృశ్యాలను చూస్తూ రిపోర్ట్ రాసుకోవాల్సిందే. ఇలాంటి వాతావరణంలో నుంచి ఇంటికి వెళ్లినా మార్చురి తాలూకు దుర్వాసన శరీరంపై వస్తూనే ఉంటుంది. దీనికితోడు పోస్టుమార్టంకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఒక్కోసారి ఇంట్లోనూ పరిశీలిస్తూ కేసును ఛేదించాల్సిన పరిస్థితి వైద్యులది. పోస్టుమార్టం ఎలా చేస్తారంటే...! శవాన్ని ముందుగా నీటితో కడుగుతారు. ముఖాన్ని స్పాంజ్‌తో తుడుస్తారు. శవాన్ని కోశాక మరణానికి కారణాలను గుర్తించేందుకు తమ పరిశోధన కొనసాగిస్తారు. ఏదైనా క్రిమిసంహారక మందు తాగి/తాగించి చనిపోయిన వారి మృతదేహాలకైతే ముందుగా జీర్ణాశయం, 500 గ్రాముల లివర్, 30 సెంటీమీటర్ల చిన్నపేగుల, రెండు కిడ్నీల్లో సగం సగం తీసి ఫోరెన్సిక్ ల్యాబోరేటరికి పంపిస్తారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుట్టేసి కుటుంబీకులకు అప్పగిస్తారు. ►నీటిలో మునిగి చనిపోయి ఉంటే తనే నీటిలో పడ్డాడా, ఎవ్వరైనా కొట్టి నీటిలో పారవేశారా, లేక మూర్చవ్యాధితో నీటిలో పడ్డారా అని పోస్టుమార్టంలో తెలుస్తుంది. ►ఇటీవల ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోవడంతో మార్చురికి తీసుకొచ్చారు. అతనికి పొట్టలో పేగులు బయటకు రావడంతో పొడిచి చంపారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతను విద్యుత్ షాక్‌తోనే చనిపోయాడని, విద్యుదాఘాతం వల్లే అతని పొట్టలో పేగులు బయటపడ్డాయని నిర్దారించారు. ►ఇటీవల ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. కానీ అతన్ని బండరాయితో స్నేహితులు కొట్టి చంపారని కుటుంబసభ్యులు కేసు పెట్టారు. అతను రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడని పోస్టుమార్టంలో నిర్దారణ అయ్యింది. మాసం పోస్ట్‌మార్టం ఎగ్జామినేషన్ ఏజ్ డిటర్నినేషన్ సెక్సువల్ అఫెన్సెస్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ జనవరి 123 05 11 12 ఫిబ్రవరి 141 03 03 09 మార్చి 118 02 04 07 ఏప్రిల్ 123 06 03 11 మే 129 02 05 05 జూన్ 106 04 08 04 మొత్తం 740 22 34 47 2020లో వివిధ రకాల సెక్షన్లలో కేసులు సెక్షన్లు సంఖ్య 304(ఎ) రోడ్డు ప్రమాదాలు 394 174 సీఆర్పీసీ ఆత్మహత్యలు 694 302(ఎ)హత్యలు 15 318(ఎ)అనుమానస్పద మరణాలు 01 498(ఎ), 306 వేదింపుల కారణంగా మహిళల ఆత్మహత్యలు 04 306 ఐపీసీ ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్ల మరణాలు 15 307(ఎ) హత్యాయత్నం 01 నాన్ వెజ్ తినడం మానేశాను –డాక్టర్ ఆర్. శంకర్, ఫోరెన్సిక్ హెచ్‌వోడి, కేఎంసీ ఫోరెన్సిక్లో పనిచేస్తున్నప్పటి నుంచి నేను నాన్‌వెజ్ తినలేక మానేశాను. నాన్‌వెజ్ తిందామని కూర్చున్నా ప్లేట్లో మాంసం ముక్కలు చూడగానే మార్చురిలో శవానికి కోసిన శరీర భాగాలు గుర్తుకు వస్తాయి. దీంతో నాన్ వెజ్ అంటేనే విరక్తి కలిగింది. మార్చురిలోని దుర్వాసన మా శరీరానికి అంటుకుపోతుంది. స్నానం చేసినా కూడా దుర్వాసన భావన మనసులోనే ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు వెళ్లడం మానేశాం. సమాజంలో అందరినీ కలవలేని పరిస్థితి. ఇల్లు, ఉద్యోగమే జీవితం. కొన్నిసార్లు కుటుంబసభ్యులకూ దూరంగా ఉండాల్సిన పరిస్థితి. మెడికో లీగల్ కేసుల్లో మేమిచ్చే నివేదికలే ఆధారం కాబట్టి మా జీవితం ఇలా అలవాటు పడాల్సి వచ్చింది. -
24 ఏళ్ల తర్వాత తెరిచిన లిఫ్ట్.. భయపెట్టిన దృశ్యం
లక్నో: ఓ ఆస్పత్రిలో దాదాపు 24 ఏళ్లుగా మూసి ఉన్న ఎలివేటర్‌ని రెండు మూడు రోజుల క్రితం తెరిచారు. అయితే అనూహ్యంగా దానిలో వారికి ఓ అస్థిపంజరం కనిపించి భయభ్రాంతులకు గురి చేసింది. విషయం పోలీసులు తెలియడంతో వారు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ బస్తి జిల్లా కైలీ ప్రాంతంలో 1991 సంవత్సరంలో 500 పడకలతో ఓపెక్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న ఎలివేటర్ పాడు కావడంతో ఆరు సంవత్సరాల తర్వాత అనగా 1997లో మూసి వేశారు. అప్పటి నుంచి క్లోస్ చేసి ఉన్న ఈ ఎలివేటర్‌ని 24 ఏళ్ల తర్వాత అనగా ఈ ఏడాది సెప్టెంబర్ 1న తెరిచారు. ఈ క్రమంలో దానిలో వారికి ఓ అస్థిపంజరం దర్శనమిచ్చి భయభ్రాంతులకు గురి చేసింది. (చదవండి: ‘దృశ్యం’ సీన్: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం) ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఆస్పత్రి వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ సిబ్బంది ఈ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు. ఈ అస్థిపంజరం పురుషుడిదిగా గుర్తించారు. ఇక పోలీసులు గత 24 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ పర్సన్స్ ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. (చదవండి: ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ) ప్రస్తుతం పోలీసులు పని చేయని లిఫ్ట్‌లోకి ఈ వ్యక్తి ఎందుకు వెళ్లాడు... అతడే లోపలికి వెళ్లాడా.. లేక ఎవరైనా అతడిని హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకువచ్చి.. దీనిలో పడేశారా.. లేక పొరపాటున సదరు వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి.. ఊపిరాడక చనిపోయి ఉంటాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్ఏ రిపోర్ట్ వస్తే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. (చదవండి: ఈ బుడ్డోడు సూపర్.. అస్థిపంజరంతో కలిసి) ఈ సందర్భంగా బస్తి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. దీనికి సంబంధించి ఎవరైనా రాతపూర్వక ఫిర్యాదు ఇస్తే.. మేం కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతం పోలీసులు పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ మగ అస్థిపంజరం వెనక ఉన్న మిస్టరీని పరిష్కరించడానికి జిల్లాలోని 24 పోలీసు స్టేషన్ల పోలీసులు పని చేస్తున్నారు అని తెలిపారు. -
మాన్సాస్ ట్రస్ట్‌పై ఫోరెన్సిక్ ఆడిట్
సాక్షి, విశాఖపట్నం: అక్రమాల పుట్టగా మారిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఇందుకోసం దేవదాయశాఖ కమిషనర్ ప్రత్యేకాధికారిగా నలుగురు జాయింట్ కమిషనర్లతో ఫోరెన్సిక్ ఆడిట్ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరునాటికి ఈ కమిటీ నివేదిక ఇస్తుందని, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ట్ వ్యవహారాలపై పదేళ్లుగా ఆడిట్ జరగలేదని చెప్పారు. విశాఖ జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం విశాఖఫట్నం, విజయనగరం జిల్లాల్లో దేవదాయశాఖ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. మాన్సాస్ ట్రస్టు భూముల వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలోను, అనంతరం మీడియా సమావేశంలోను ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని ఈరోజు దొడ్డిదారిన చైర్మన్ అయిన అశోక్‌గజపతిరాజు పంచగ్రామాల్లో 12 వేల ఇళ్లలో నివసిస్తున్న వారి ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. కోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌లో విజయం సాధించి అశోక్‌గజపతిరాజును ఆ కుర్చీ నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్‌కు ఉన్న 14 వేల ఎకరాలకుపైగా భూములను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. బొబ్బిలి వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీకాకుళం సీతారామస్వామి దేవస్థానాల నుంచి సుమారు 6 వేల ఎకరాలను బొబ్బిలి సంస్థానం నుంచి విజయనగరం సంస్థానానికి చెందిన పీవీజీ రాజుకు లీజుకు ఇచ్చారని తెలిపారు. ఈ లీజు భూములు ఎవరి పేరుమీద ఉన్నాయో, అర్బన్ ల్యాండ్‌సీలింగ్ కింద ఎందుకు ప్రకటించలేదో అశోక్‌గజపతిరాజు చెప్పాలన్నారు. పీవీజీ రాజు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఒకరోజు ముందు మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన భూముల్లో కొన్ని మాన్సాస్ ట్రస్ట్‌కు, కుటుంబసభ్యులకు ఇచ్చారని, కొన్ని భూములు ఆయన పేరు మీదే ప్రభుత్వ రికార్డుల్లో ఉంచేశారని చెప్పారు. ఆ భూముల్ని ఎన్వోసీల పేరుతో అమ్ముకుంటూ ఏడుగురు కుటుంబసభ్యులు వాటాలు పంచుకుంటున్నారని తెలిపారు. విజయనగరంలో లెప్రసీ ఇన్స్టిట్యూట్కు ఉన్న 100 ఎకరాలకుపైగా భూమి తనదేనని ప్రకటించుకుని కాజేసేందుకు అశోక్‌గజపతిరాజు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన మాన్సాస్ చైర్మన్‌గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారని, వీటన్నింటిపైనా విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సింహాచలం భూముల సమస్య త్వరలోనే తీరుతుంది దేవదాయ, ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ, విజయనగరం జిల్లాల్లో గ్రామ దేవతల నుంచి పెద్ద ఆలయాల వరకు ఉన్న భూములు, వాటిలో ఎంతవరకు ఆక్రమణలకు గురయ్యాయనే వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. సింహాచల భూముల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ నిబంధనలు పాటించకుండా ట్రస్టు ఆస్తుల్ని సొంత ఆస్తులుగా అనుభవించడం మంచిపద్ధతి కాదని అశోక్‌గజపతిరాజు తెలుసుకోవాలని సూచించారు. పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాన్సాస్ ట్రస్టుకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ ఇసుక మైనింగ్ చేస్తున్నారంటే.. అశోక్‌గజపతిరాజు ధనదాహాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. సమీక్ష సమావేశంలో మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేవాలయాల వరకు మాత్రమే తనకు అధికారాలున్నాయని, విద్యాసంస్థల కార్యకలాపాలను కరెస్పాండెంట్ ద్వారా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
నటి ఆర్య బెనర్జీ మృతి: కీలక విషయాలు వెల్లడి
కోల్‌కతా: బాలీవుడ్ నటి ఆర్య బెనర్జీ గత వారం కోల్‌కతాలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన బెనర్జీ ఆకస్మిక మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆమెది హత్య కాదని అనారోగ్య సమస్యల కారణంగా బెనర్జీ మృతి చెందినట్లు తాజాగా ఫోరెన్సిక్ నివేధికలో వెల్లడైంది. బెనర్జీ కొంతకాలంగా కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఫోరెన్సిక్ నివేధికలో వైద్యలు ధృవికరించారు. కాగా దీనిపై కోల్‌కతా పోలీసు జాయింట్ కమిషనర్ మురళీధర్ శర్మ మాట్లాడుతూ.. ‘నటి ఆర్య బెనర్జీది హత్య కాదు. హత్య జరిగినట్లు ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఘటన స్థలంలోనే ఫోరెనిక్స్ నిపుణులు మృతదేహం శాంపుల్స్ సెకరించారు. అయితే తను చనిపోయిన సమయంలో బెనర్జీ పొట్టలో ఆల్కహాల్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు’ అని ఆయన తెలిపారు. (చదవండి: నటి ఆర్య బెనర్జీ అనుమానాస్పద మృతి) ఆర్యబెనర్జీ జోధ్‌పూర్‌లోని తన అపార్టుమెంటులో కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం బెనర్జీ ఇంటి పనిమనిషి వచ్చి తలుపు కొట్టడంతో ఆమె ఎంతకు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె సమచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసుల తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేసరికి బెనర్జీ తన గదిలో బెడ్‌పై మృతి చెంది కనిపించారు. కాగా బెనర్జీ ప్రముఖ దివంగత సితార విద్వాంసుడు పండిత్ నిఖిల్ బెనర్జీ కూతురు. ఆమె దక్షిణాది ప్రముఖ నటి సిల్క్‌స్మిత జీవికథ నేపథ్యంలో తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’లో షకీలా పాత్ర పోషించారు. అంతేగాక హిందీలో పలు సినిమాల్లో నటిస్తూనే ముంబైలో మోడల్‌గా రాణిస్తున్నారు. -
‘ఏపీలో ఫోరెన్సిక్ వర్శిటీ ఏర్పాటు పరిశీలించాలి’
న్యూఢిల్లీ : గుజరాత్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫోరెన్సిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ బిల్లుపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తొలిసారిగా గుజరాత్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన స్వాగతించారు. దేశంలో నేరాలు జరిగే తీరు, నేర దర్యాప్తు, నేరాల వెనుక కారణాలను విశ్లేషించడంలో ఇలాంటి యూనివర్శిటీ ప్రముఖ పాత్ర పోషించగలవని అన్నారు. (విశాఖలో ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయండి) అయితే నేరాలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కానందున పోలీసుల నేర పరిశోధనలో సహకరించేందుకు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఇలాంటి వర్శీటీ వలన ఫోరెన్సిక్ సైన్సెస్‌లో స్పెషలిస్టులు తయారవుతారని చెప్పారు. హైదరాబాద్‌లో అత్యంత అధునాతనమైన ఫోరెన్సిక్ లేబరేటరీ ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫోరెన్సిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని ఆయన కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. (‘రైతుల కోసమే సీఎం జగన్ నిర్ణయం’) -
దిశ: ఆ మృతదేహాలను ఏం చేయాలి?
సాక్షి, గాంధీఆస్పత్రి: చటాన్‌పల్లి ఎన్కౌంటర్లో మరణించిన దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని, వాటిని ఏం చేయాలో చెప్పాలని కోరుతూ ప్రభుత్వ ప్లీడర్(జీపీ)కి లేఖ రాసేందుకు గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నెల 7న ఎన్కౌంటర్లో మృతిచెందిన మహ్మద్ అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు అదే రోజు ఫోరెన్సిక్ వైద్యులు బృందం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మెడికల్ కాలేజీ లో భద్రపరిచారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యం లో ఈనెల 13 వరకు గాంధీ మార్చురీలో భద్రపరచాలని హైకోర్టు సూచించింది. చదవండి: దిశ కేసులో ‘ఫైనల్ రిపోర్ట్’ దీంతో నలుగురి మృతదేహాలను 9న గాంధీ మార్చురీకి తీసుకొచ్చి ఫ్రీజర్ బాక్స్‌లో భద్రపరిచారు. ఫ్రీజర్ బాక్సుల్లో పెట్టిన మృతదేహాలు వారం రోజుల తర్వాత క్రమంగా కుళ్లిపోతాయి. ఎంబామింగ్ చేసి ఫార్మల్ డీహైడ్ ద్రావకాన్ని రక్తనాళాల ద్వారా మృతదేహాల్లోకి ఎక్కిస్తే పాడవకుండా ఉంటాయి. దీంతో మృతదేహాలకు ఎంబామింగ్ చేయాలని ఫోరెన్సిక్ వైద్యులు నిర్ణయించారు. అయితే ఎంబామింగ్ చేస్తే మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసేందుకు అవకాశం ఉండకపోవడం, మరోపక్క మృతదేహాలు కుళ్లిపోవడం ప్రారంభమయ్యే దశకు చేరుకోవడంతో ఫోరెన్సిక్ వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. ఇలాంటి కేసుల్లో కోర్టు ఆదేశాల మేరకే మృతదేహాలకు ఎంబా మింగ్ చేయాలనే నిబంధన ఉందని సంబంధిత వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం, ఫోరెన్సిక్ వైద్య బృందం సోమవారం దీనిపై చర్చించారు. తర్వాత మృతదేహాలను ఏం చేయాలో చెప్పాలని కోరుతూ జీపీకి లేఖ రాయా లని నిర్ణయించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 13 వరకు మృతదేహాలను భద్రపరచమని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. గడువు ముగిసింది కనుక మృతదేహాలను ఏం చేయాలో చెప్పాలని మంగళవారం జీపీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో మరో పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన కె.సజయ, మీరా సంఘమిత్ర, వి.సంధ్యారాణి, ఎం.విమల దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావిస్తూ అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ వద్ద పిటిషన్లు ప్రస్తావించాలని ధర్మాసనం ఆదేశించింది. చదవండి: దిశ: ఆ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి -
వైఎస్ వివేకా హత్య కేసు ఛేదనకు 12 బృందాలు
సాక్షి కడప/అర్బన్: దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకోసం 12 బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చెప్పారు. ఆదివారం రాత్రి డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీఐడీ అడిషనల్ డీజీ అమిత్‌గార్గ్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, ఇందులో సిట్ ఆధ్వర్యంలో ఐదు బృందాలు పనిచేస్తుండగా, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏడు బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. వివేకానందరెడ్డి ఈ నెల 15వ తేదీ రాత్రి 11.30 గంటలకు పులివెందులలోని తన స్వగృహానికి వచ్చారని, ఇంటికి రాగానే డ్రైవర్‌ను పంపించి నిద్రపోయారన్నారు. తెల్లవారేసరికి ఆయన హత్యకు గురయ్యారని, ఈ నేపథ్యంలో ఆయన నిద్రకు ఉపక్రమించినప్పటి నుంచి మరుసటిరోజు ఉదయం 5.30 గంటల్లోపు ఏం జరిగి ఉంటుందనే దానిపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సిట్ బృందం పలుమార్లు నేర స్థలాన్ని పరిశీలించిందని, వైఎస్ వివేకా కుటుంబసభ్యులతోపాటు సోదరులను కూడా విచారించినట్లు తెలిపారు. హత్య జరిగిన రోజు ఉదయాన్నే డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలతో సమగ్రంగా విచారించి ఆధారాలు సేకరించామన్నారు. కేసును సిట్‌కు అప్పజెప్పడంతో అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు 20 మంది సాక్షులను విచారించామన్నారు. ఈ కేసులో ఫింగర్ ప్రింట్ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సేవల్నీ వినియోగించుకుంటున్నామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా బృందాలతో రంగంలోకి దిగి ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అనుమానితులపై నిఘా ఉంచామని, జిల్లావ్యాప్తంగా సమాచార సేకరణ జరుగుతోందని తెలిపారు. అలాగే ఫోరెన్సిక్ సాంకేతిక సాక్ష్యాలకోసం బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. లెటర్‌కు సంబంధించి శ్యాంపిల్ హ్యాండ్‌రైటింగ్‌ను కూడా పరిశీలించి ఫోరెన్సిక్‌కు పంపినట్లు తెలిపారు. -
డాక్టర్ భద్ర
కెమెరా వదిలేసి స్టెతస్కోప్ పట్టనున్నారు అమలా పాల్. కన్ప్యూజ్ కావొద్దు. మేటర్ కంటిన్యూ చేయండి. ఫుల్ క్లారిటీ దొరుకుతుంది. అమలా పాల్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాత్రలో నటించిన ‘అదో అంద పరవై పోల’ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడామె తన నెక్ట్స్ చిత్రం కోసం ఫోరెన్సిక్ డాక్టర్‌గా మారబోతున్నారు. సో.. కెమెరా నుంచి స్టెతస్కోప్‌కి మారనున్నారు. మలయాళం, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకు అనూప్ పానికర్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాకు అభిలాష్ పిళ్లై రచయిత. ‘‘తమిళనాడు పోలీస్ చీఫ్ సర్జన్ డాక్టర్ భద్ర పాత్రలో అమలా నటించనున్నారు. క్లిష్టమైన కేసులను ఆమె ఎంత సులువుగా పరిష్కరించారనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కేరళ పోలీస్ విభాగానికి చెందిన మాజీ ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ బి. ఉమదాథాన్ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోందని కోలీవుడ్ టాక్. -
జెట్ ఖాతాలపై ఎస్బీఐ ఫోరెన్సిక్ ఆడిట్
ముంబై: తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఎస్బీఐ ఆదేశించింది. జెట్ ఎయిర్వేస్ బ్యాంకుల నుంచి రూ.8,000 కోట్లకు పైగా రుణాలను తీసుకోగా, ఎస్బీఐ లీడ్ బ్యాంకర్‌గా ఉంది. చమురు ధరల పెరుగుదలతో జెట్ ఎయిర్వేస్ గత మూడు త్రైమాసికాలుగా రూ.1,000 కోట్లకు పైగా నష్టాలను నమోదు చేస్తోంది. తీవ్ర స్థాయిలో నిధుల కటకటను ఎదుర్కొంటున్న ఈ సంస్థ తాజా నిధుల సమీకరణ యత్నాలను కూడా చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్ నుంచి 2018 మార్చి 31 వరకు జెట్ ఎయిర్వేస్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఎస్బీఐ నిర్ణయించడం గమనార్హం. జెట్ ఎయిర్వేస్ ఖాతాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఓ ప్రజావేగు ఇచ్చిన సమాచారంతో ఎస్బీఐ ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించినట్టు సమాచారం. అంతేకాదు, ఈఅండ్‌వై సంస్థ ఇప్పటికే దీన్ని ప్రారంభించినట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి. జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేష్ గోయల్ రూ.5,000 కోట్లను మింగేసినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. సెప్టెంబర్ క్వార్టర్ నాటికి ఈ సంస్థ రుణ భారం రూ.8,052 కోట్లుగా ఉంది. -
సుజనా అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) ఆర్థిక అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, అతన్ని ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ న్యాయవాది ఇమ్మనేని రామారావు సోమవారం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి ఫిర్యాదు చేశారు. కంపెనీల చట్టం కింద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ద్వారా విచారణకు ఆదేశించాలని ఆయన ఆర్వోసీని కోరారు. సుజనా గ్రూపు కంపెనీలు, వాటి యాజమాన్యాలు, ఆస్తి అప్పుల పట్టీలు, వార్షిక నివేదికలు, కంపెనీ మధ్య జరిగిన లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, కంపెనీల విలీనం తదితర అంశాలకు సంబంధించి లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుజనా గ్రూపునకు చెందిన 49 కంపెనీల ద్వారా మోసపూరిత వ్యాపార లావాదేవీలు, పన్ను ఎగవేతకు పాల్పడి తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఎంతో నష్టం చేకూర్చారని ఆయన తెలిపారు. సుజనా చౌదరి రెండు డిన్ (డైరెక్టర్ ఐడెన్టిఫికేషన్ నంబర్) కలిగి ఉన్నారని, వాస్తవానికి నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే డిన్ ఉండాలన్నారు. ప్రజలను మోసం చేయడానికే ఇలా చేశారన్నారు. ప్రస్తుతం సుజనా చౌదరి దాదాపు 15 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని వివరించారు. మరో 30 కంపెనీలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కలిగి ఉన్నారని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక సుజనా చౌదరి తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వాటాల విలువలకు, ఆయన కుటుంబ సభ్యులు కలిగి ఉన్న వాటాల విలువలకు ఎంతో తేడా ఉందని వివరించారు. సుజనా ఆర్థిక వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే అతని అక్రమాలు వెలుగులోకి వస్తాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్వోసీని కోరారు. -
చంఢీగఢ్ ఫోరెన్సిక్ నివేదికలో చంద్రబాబు వాయిస్
అమరావతి, గన్నవరం: ప్రస్తుతం చంద్రబాబునాయుడు చేస్తున్న ర్యాలీలు, ధర్మపోరాటం పేరుతో ఏసీ దీక్షలు అన్ని కూడా ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకేనని వైఎస్సార్ సీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. జైలుపాలు కావాల్సి ఉంటుందని ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు ప్రజల్లో సానుభూతి కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, మహిళలు, ఆడపిల్లల రక్షణ గురించి ఏరోజు పట్టించుకోని ఆయన ఇటీవల ప్రజలు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు కొత్త నాటకానికి తెరతీశారని విరుచుకుపడ్డారు. గతేడాది అంతర్జాతీయ మహిళా సదస్సుకు వచ్చిన ఆమెను ఎయిర్‌పోర్టులో పోలీసులు అక్రమంగా నిర్భంధించడంపై గన్నవరంలోని కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు నిమిత్తం బుధవారం ఇక్కడికి వచ్చారు. ఎయిర్‌పోర్టులో, కోర్టు బయట మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏసీబీ మీటింగ్ పెడితే ఇక్కడ చంద్రబాబు ఎలా వణుకుతున్నారో అందరూ గమనిస్తున్నారని చెప్పారు. గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లు మంత్రి సోమిరెడ్డి, కంభంపాటి, వర్ల రామయ్య మాట్లడడం చూస్తుంటేనే ఆ పార్టీకి ఓటుకు నోటు కేసు భయం పట్టుకుందని అర్థమవుతుందన్నారు. ఓటుకు నోటు కేసు అసలు కేసే కాదన్న వాళ్లు ఈ రోజు బీజేపీతో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుట్రపన్నారని చెప్పడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ను తన ఇంటికి పిలిచి 36 రకాల వంటకాలతో విందు ఇచ్చి ఆయనతో లాలూచీ పడిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికలోనే తేలింది తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణలో బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ చంద్రబాబుదేనని చంఢీగఢ్ ఫోరెన్సిక్ నివేదికలో తేల్చిందని చెప్పారు. -
నరికేసిన ఆ 54 చేతులు ఎవరివి?
మాస్కో : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 54 చేతులు నది ఒడ్డున లభించడంతో ప్రపంచమంతా కలవరానికి గురిచేస్తోంది. ఇది తీవ్రవాదులు చేశారా? వైద్య సంస్థలు చేశాయా? ఏమైనా పూజలా లేక శిక్షలా? అని తేల్చే పనిలో రష్యన్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోరెన్సిక్ వారికీ అంతు చిక్కకుండా చేతుల వేలిముద్రలను చెరిపేశారు. రష్యాలోని అముర్ నది ఒడ్డున ఒక సంచిలో మణికట్టు వరకు నరికేసిన మనుషుల అరచేతులు 54 కనిపించడం.. అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు ఆ చేతులను స్వాధీనం చేసుకొని, ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఈ మిస్టరీనీ ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ చేతుల దగ్గర్లో మెడికల్ సామాగ్రి లభించడం, వేలిముద్రలు లభించకుండా చేతులను తరగటం ఇవన్ని పోలీసులకు అనుమానాలు కలిగిస్తున్నాయి. అసలు ఈ చేతులు ఎవరివి, మృతదేహాల నుంచి సేకరించారా లేక ఎవరినైనా శిక్షించేందుకు ఇలా నరికేశారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. -
జిల్లాలకు ఫోరెన్సిక్ ఫోర్స్..
సైబర్ ఫోరెన్సిక్ సెల్ ఏర్పాటుకు పోలీస్ శాఖ యోచన సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా సైబర్‌నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేరాల నియంత్రణకు సైబర్ ఫోరెన్సిక్ సెల్లు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా దక్షిణాసియా మొత్తం లో హైదరాబాద్‌లోనే అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్(సీఎఫ్ఎల్) ఉంది. ప్రస్తుతం ఈ–మార్కెట్ ఊపందుకుంటోంది. అదే స్థాయిలో సైబర్ నేరాలుకూడా పెరిగే ప్రమాదం ఉండటంతో వాటి నియం త్రణకు ప్రతి జిల్లాకూ ఒక సైబర్ ఫోరెన్సిక్ సెల్ ఏర్పాటు చేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ భావిస్తున్నారు. ఒక్కో జిల్లాకు రూ.65లక్షలు.. ప్రతీ జిల్లాలో పూర్తి స్థాయి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.65లక్షలు ఖర్చవుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు మంజూరు అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏటా రాష్ట్ర పోలీస్ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆధునీకరణ (ఎంఓపీఎఫ్) నిధులను ఈ సారి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ఉపయోగించుకోవాలని భావి స్తోంది. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ప్రస్తుతం సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ అందుబాటులో ఉంది. మిగిలిన ఎనిమిది కమిషనరేట్లతో పాటు జిల్లా పోలీస్ విభాగాలకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలంటే రూ.15కోట్ల వరకు నిధులు అవసరం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నిధుల్లో 60 శాతం కేంద్రం, 40శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌లో శిక్షణ.. జిల్లాలు/కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేయబోయే సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లో ఎస్ఐ నేతృత్వంలో ఆరుగురు సిబ్బంది పనిచేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీపై పట్టు ఉండి, సైబర్ నేరాల నియంత్రణకు ఆసక్తి కనబరిచే అధికారులు, సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ భావిస్తున్నారు. ఈ బృందాలకు హైదరాబాద్ కమిషనరేట్‌లోని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శిక్షణ ఇప్పించి జిల్లాల్లో ఫోరెన్సిక్ సెల్‌లను నిర్వహించాలని యోచిస్తున్నారు. -
‘ఫోరెన్సిక్’కు విభజన కష్టాలు
గవర్నర్ వద్ద ప్రస్తావనకు రాని సైన్స్ ల్యాబ్ అంశం తెలంగాణ, ఏపీ మంత్రుల ఎజెండాలోనే లేని వైనం సాక్షి, హైదరాబాద్: వివిధ కేసుల్లో పోలీసు, ఎక్సైజ్‌శాఖలకు శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించి నివేదికలందించే కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) విభజన కష్టాలు ఎదుర్కొంటోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో పొందుపరిచిన సంస్థలు, విభాగాల విభజన జాబితాలో ఎఫ్ఎస్ఎల్ కూడా ఉన్నా తెలుగు రాష్ట్రాలు ఈ సంస్థను పట్టించుకోలేదు. పదో షెడ్యూల్లోని సంస్థలు, విభాగాల విభజనపై మూడు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ వద్ద జరిగిన చర్చలో ఇరు రాష్ట్రాల మంత్రులు ఎఫ్ఎస్ఎల్ విభజన అంశాన్ని వారి ఎజెండాలోనే చేర్చకపోవడంతో ఆ విభాగం అధికారుల్లో ఆందోళన నెలకొంది. సిబ్బంది కొరత కారణంగా ఇప్పటికే రెండు లక్షలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు వివిధ శాస్త్రీయ పరీక్షలకు వాడే యంత్ర పరికరాల విభజనపైనా ఇరు రాష్ట్రాల డీజీపీలు ఇంకా ఓ అంగీకారానికి రాలేదని తెలిసింది. ఇంతటి ప్రాధాన్యతగల సంస్థను రెండు రాష్ట్రాల ప్రభుత్వా లు పట్టించుకోకపోవడంతో అయోమయం నెలకొంది. ఖాళీగా 89 పోస్టులు... ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ పదవీ విరమణ చేసి ఏడాది కావస్తుండగా ఇన్చార్జి డైరెక్టర్‌తోనే కాలం నెట్టుకొస్తున్నా రు. మొత్తం 202 మంజూరు పోస్టుల్లో 113 మంది పనిచేస్తుండగా, మిగతా 89 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్లోని కీలకమైన విభాగాలను పర్యవేక్షించాల్సిన నాలుగు జాయింట్ డైరెక్టర్ పోస్టుల్లో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
'వారు తలుపువద్దే ఎందుకు పడి ఉన్నారు?'
-
'వారు తలుపువద్దే ఎందుకు పడి ఉన్నారు?'
హైదరాబాద్: మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక అనుమానాస్పద మృతి విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయని ప్రముఖ ఫొరెన్సిక్ నిపుణుడు నారాయణ రెడ్డి అన్నారు. ఆమెది హత్యా ఆత్మహత్యా అనే విషయంలో నివృత్తి చేయాల్సిన కోణాలు చాలా ఉన్నాయని చెప్పారు. సాధారణంగా ఏదైనా కాలినప్పుడు రెండు రకాల పొగలు వస్తాయని అందులో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతాయని, మోనాక్సైడ్ ఉంటే కాలిన దేహం బ్రైట్ రెడ్ గా మారిపోతుందని దీనిద్వారా కాలిన గాయాలతోనే చనిపోయినట్లు స్పష్టమవుంతుందని అన్నారు. అలా లేకపోతే ముందే చంపి కాల్చివేశారా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఎడమవైపు ఎక్కువ కాలిందని చెబుతున్నారని అలా ఎందుకు జరిగిందో తెలియాల్సి ఉందన్నారు. అసలు ఘటన జరిగిన తర్వాత తలుపులు ఎవరు తెరిచారన్నది కూడా ముఖ్యమని పేర్కొన్నారు. క్లూజ్ టీంతోపాటు ఫొరెన్సిక్ డాక్టర్లను కూడా ఘటన స్థలానికి తీసుకెళ్తే బాగుండేదని పక్కా సమాచారం తెలిసేదని అన్నారు. తెల్లవారుజామున చనిపోతే.. సాయంత్రం వరకు నేరస్థలంలోనే మృతదేహాలు ఉన్నాయని ముందుగానే అక్కడికి వైద్యులను తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. పెద్దకుమారుడు, తల్లి డోర్ దగ్గరే మరణించారంటే, తలుపులు బయటి నుంచి గడియ వేస్తే తెరవడానికి వెళ్లారా అనే కోణంలో కూడా ఆలోచించాలనన్నారు. కనీసం మంటలు అంటుకునే ముందు పిల్లలు అటూ ఇటూ పరుగెత్తాలని కానీ ఇద్దరు బెడ్‌పై అలాగే పడి ఉండి చనిపోవడం అనుమానం కలిగిస్తోందన్నారు. రెండు సిలిండర్లు తీసుకెళ్లి, ఒకదాన్నే తెరిచారని, ఒకదాన్ని అలాగే వదిలేశారని చెబుతున్నారు కానీ దీనిపై అనుమానమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఏసీబీ కోర్టుకు రేవంత్
సండ్ర, రేవంత్‌ల వాయిస్ శాంపిళ్లను ఫోరెన్సిక్‌కు పంపేందుకు కోర్టు అనుమతి సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతోపాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్‌సింహ కూడా హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్ కోర్టు పరిశీలనలో ఉందని, త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని ఏసీబీ పేర్కొన్న నేపథ్యంలో.... ఆ రెండు చార్జిషీట్లను పరిశీలించిన తరువాత నిందితులకు సమన్లు జారీచేస్తామని న్యాయమూర్తి లక్ష్మీపతి స్పష్టం చేశారు. సమన్లు అందిన తరువాత విచారణకు రావాలని ఆదేశించారు. కాగా అసెంబ్లీ అధికారులు సమర్పించిన రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యల వాయిస్ శాంపిళ్లను విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. అరెస్టు సమయంలో ఏసీబీ అధికారులు తమ వాహనాలను సీజ్ చేశారని, వాటిని ఇప్పించాలని కోరుతూ సెబాస్టియన్, ఉదయ్‌సింహ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... వాటిపై విచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. కేసీఆర్‌ను గద్దె దించుతా : రేవంత్ కేసీఆర్ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా వ్యవహరించిందని, కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి గద్దె దించేందుకు ప్రజలను సమీకరిస్తానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. చివరి వరకు తాను టీడీపీలోనే కొనసాగుతానన్నారు. కోర్టు షర తు మేరకు నియోజకవర్గంలోనే ఉండటంతో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం లభించిందని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారం టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. -
ఫోరెన్సిక్ చేతికి బాబు టేపులు
- రేవంత్ సహా నిందితుల సెల్ఫోన్లు, ఆడియో, వీడియో టేపులు కూడా - ఏసీబీ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు - బాబు సంభాషణపై నిగ్గుతేల్చనున్న ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు - 2, 3 రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కుంభకోణంలో సూత్రధారిగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు బాగోతం రెండు, మూడు రోజుల్లో బట్టబయలుకానుంది! ఈ కేసులో ఏసీబీ అధికారులు రికార్డు చేసిన ఆడియో, వీడియో సీడీలతోపాటు నిందితులైన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, సీసీటీవీ రికార్డులు, కంప్యూటర్ పరికరాలను విశ్లేషణ కోసం ప్రత్యేక కోర్టు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపింది. ఏసీబీ విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎఫ్ఎస్ఎల్కు పంపిన వాటిలో రాజకీయ ప్రముఖులు మాట్లాడినవిగా చెబుతున్న 14 ఆడియో టేపులు ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా స్టీఫెన్సన్ సోదరుడి ఇంట్లో నడిచిన రూ. 5 కోట్ల డీల్ తతంగం, రూ. 50 లక్షల అడ్వాన్స్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీలు, రేవంత్‌రెడ్డితోపాటు మిగతా ఇద్దరు నిందితుల ఇళ్ల నుంచి సేకరించిన సీసీ కెమెరా ఫుటేజీలను కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపారు. నిందితులతో ఫిర్యాదుదారుడైన స్టీఫెన్సన్ వివిధ సందర్భాల్లో మాట్లాడేందుకు వాడిన మొబైల్‌ఫోన్ సహా 21 ఫోన్లు, 3 సోనీ డిజిటల్ రికార్డర్లు, సీపీయూ, హార్డ్‌డిస్క్‌లను పరీక్షల కోసం పంపించారు. దీంతో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన మాటలపై చంద్రబాబు అండ్ కో చెపుతున్నట్టుగా ‘ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలను తెచ్చి అతికించారా... చంద్రబాబే మాట్లాడారా ...’ అనే విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చనున్నారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి, చినబాబు లోకేశ్, ఎంపీలు, తెలుగుదేశం పోషకులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు మాట్లాడిన రికార్డుల నాణ్యతను కూడా ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి వాస్తవ నివేదిక ఇవ్వనున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వ చ్చాక కూడా రికార్డుల్లో ఉన్న మాటలు తమవి కావంటే సంబంధిత వ్యక్తుల మాటలను మరోసారి రికార్డు చేసి నిజాలను బహిర్గతం చేస్తారు. సోమవారం నాటికి వీటికి సంబంధించిన నివేదిక రావచ్చని ఓ అధికారి తెలిపారు. స్టీఫెన్సన్ స్టేట్మెంట్ సేకరించే పనిలో.. చంద్రబాబు ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి అండ్ కో తనను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాతపూర్వకంగా ఏసీబీని ఆశ్రయించి ఓటుకు కోట్ల కేసును తెరపైకి తెచ్చిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ స్టేట్మెంట్ను రికార్డు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. సోమవారం రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసు తీవ్రతను కోర్టు ముందు ఉంచేందుకు తమ వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ న్యాయమూర్తికి సమర్పించాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా శని, ఆదివారాల్లో స్టీఫెన్సన్ స్టేట్మెంట్ను రికార్డు చే సి సోమవారం కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది. పసుపు శిబిరంలో ఆందోళన... ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలు ఇవ్వజూపుతూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో ఆయన జైలుపాలైన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్ రూ. 50 లక్షలు తీసుకెళ్లారని స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన ఫోన్ రికార్డులతో తేటతెల్లమైంది. ఫోన్ రికార్డులు బయటపడ్డప్పటి నుంచి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పొంతన లేకుండా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దల చుట్టూ చెక్కర్లు కొడుతున్నా పసుపు శిబిరంలో ఆందోళన మాత్రం తగ్గలేదు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన రికార్డింగ్‌లతోపాటు ఆయన తనయుడు లోకేశ్ నాలుగో నిందితుడుగా ఉన్న మత్తయ్యతో మాట్లాడిన రికార్డులు కూడా ఏసీబీ వద్ద ఉన్నట్లు తేలడంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
కూలీల ఎన్కౌంటర్ బూటకమే
స్పష్టం చేసిన ఫోరెన్సిక్ నిపుణులు డా. చంద్రశేఖరన్ ⇒అదుపులోకి తీసుకుని, అత్యంత పాశవికంగా చంపారు ⇒చనిపోయాక కూడా కాల్చారు ⇒ఎక్కడో చంపి ఎన్కౌంటర్ ప్రాంతంలో శవాలను పడేశారు ⇒అక్కడ దొరికిన దుంగల తీరుపై కూడా అనుమానాలు హైదరాబాద్: శేషాచలం కొండల్లో కూలీల ఎన్‌కౌంటర్‌పై అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు చెబుతున్నవన్నీ కట్టుకథలేనని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎన్కౌంటర్లో అసువులు బాసిన వారి మృతదేహాల ఫొటోలను విశ్లేషించినఆ నిపుణులు.. కూలీలను పాశవికంగా చంపారని చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని ప్రఖ్యాత ఫోరెన్సిక్ నిపుణులు, తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మాజీ డెరైక్టర్ డాక్టర్ చంద్రశేఖరన్ తేల్చారు. ‘కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. చిత్రహింసలకు గురిచేసి, అత్యంత కిరాతకంగా చంపారు’ అని ఆయన చెప్పారు. పోలీసులు ఏ ఒక్క స్మగ్లర్‌నూ ప్రాణాలతో పట్టుకోలేకపోవడం, సంఘటనా స్థలంలో స్మగ్లర్ల వద్ద ఆయుధాల ఆనవాళ్లు లేకపోవడం, స్మగ్లర్లు మోసుకెళ్తున్నారని చెబుతోన్న దుంగలపై తెల్ల రంగు మరకలు ఉండటాన్ని పరిశీలించాక శేషాచలం ఎన్కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటరేనని ఆయన నిర్ధారణకు వచ్చారు. ఎన్కౌంటర్ బూటకమేనని ప్రఖ్యాత జాతీయ పత్రిక ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పరిశోధనాత్మక కథనాలు కూడా ప్రచురించింది. పాశవిక దాడి గుర్తులు.. ఎన్కౌంటర్ ఆరు గంటల తర్వాత వివిధ కోణాల్లో సేకరించిన మృతదేహాల ఫోటోలు, సంఘటనా స్థలి ఫోటోలను ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ చంద్రశేఖరన్ పరిశీలించి, విశ్లేషించారు. ‘చనిపోయిన తర్వాత కూడా శరీరాలపై తుపాకులతో పాశవికంగా దాడి చేసిన గుర్తులు ఉన్నాయి’ అని ఆయన తేల్చారు. ఎన్కౌంటర్ జరిగిన చీకటీగల కోన, సచ్చినోడి బండ ప్రాంతాల్లో నేలపై ఎలాంటి రక్తం మరకలు లేకపోవడంపై చంద్రశేఖరన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కూలీలను మరోచోట చంపి అక్కడకు తీసుకువచ్చి పడేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాల వద్ద ఉన్న ఎర్రచందనం దుంగలకు రంగులు వేసి ఉండటం, అవి అంతకుముందే స్వాధీనం చేసుకున్న దుంగల్లా ఉండటం అనుమానాలకు బలమిస్తోంది. డీఐజీ ముందస్తు ప్రకటన ఉద్దేశమదేనా.. ఎన్‌కౌంటర్‌కు నాలుగు రోజుల ముందు రెడ్ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే స్మగ్లర్లపై కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయన ముందస్తుగా చేసిన ప్రకటన ఉద్దేశాన్ని పరిశీలిస్తే.. శేషాచలం ఎన్కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటరేనని స్పష్టమవుతోందని చంద్రశేఖరన్ అన్నారు. ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తే అధికారుల చెప్పిన వివరాల్లో అసలు పొంతనే లేదన్నారు. మరికొన్ని సాక్ష్యాలు.. తలపై బండరాళ్లు, ఇనుపరాడ్లతో మోదడం వల్ల నలుగురు కూలీలు చనిపోయారు. పోలీసులు తీవ్రంగా హింసించడం వల్ల ఒకరి ప్యాంట్ చిరిగిపోతే దాన్ని దాచిపెట్టేందుకు ఆ కూలీకి ఆదరాబాదరాగా మరోప్యాంట్ తొడిగారు. ఒక కూలీ ఎడమ చేతిపై బండరాతితో గానీ.. ఇనుపరాడ్డుతోగానీ మోదినట్లు గుర్తులు ఉన్నాయి. పోలీసుల దాడి నుంచి ఆ కూలీ తప్పించుకునే యత్నం చేసినప్పుడు ఈ గాయం అయి ఉంటుంది. కొందరు కూలీల మొహాలు గుర్తుపట్టలేని రీతిలో చెక్కేసినట్లున్నాయి. ఎముకలు విరిగిపోవడం, చర్మం కమిలిపోవడాన్ని బట్టి చూస్తే.. వారిని అదుపులోకి తీసుకుని విచారించే సమయంలోనే చిత్ర హింసలకు గురిచేసినట్టు తెలుస్తోంది. -
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సునంద వస్తువులు
అహ్మదాబాద్: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ హత్య కేసును ఢిల్లీ పోలీసులు వేగవంతంగా విచారణ చేస్తున్నారు. సునంద వాడిన ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని గుజరాత్‌లోని గాంధీనగర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్‌కు పంపారు. ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలోని డాటా కేసు విచారణకు ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. సునంద హత్య కేసులో ఢిల్లీ పోలీసులు థరూర్‌తో పాటు పలువురు వ్యక్తులను విచారించారు. గతేడాది జనవరిలో ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.