ఫోరెన్సిక్ చేతికి బాబు టేపులు | all vedio and audio tapes hasbeen sent to forensic lab | Sakshi
Sakshi News home page

ఫోరెన్సిక్ చేతికి బాబు టేపులు

Published Sat, Jun 13 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

ఫోరెన్సిక్ చేతికి బాబు టేపులు

ఫోరెన్సిక్ చేతికి బాబు టేపులు

- రేవంత్ సహా నిందితుల సెల్‌ఫోన్లు, ఆడియో, వీడియో టేపులు కూడా
- ఏసీబీ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు
- బాబు సంభాషణపై నిగ్గుతేల్చనున్న ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు
- 2, 3 రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం
 
సాక్షి, హైదరాబాద్:
ఓటుకు నోటు కుంభకోణంలో సూత్రధారిగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు బాగోతం రెండు, మూడు రోజుల్లో బట్టబయలుకానుంది! ఈ కేసులో ఏసీబీ అధికారులు రికార్డు చేసిన ఆడియో, వీడియో సీడీలతోపాటు నిందితులైన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, సీసీటీవీ రికార్డులు, కంప్యూటర్ పరికరాలను విశ్లేషణ కోసం ప్రత్యేక కోర్టు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపింది. ఏసీబీ విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిన వాటిలో రాజకీయ ప్రముఖులు మాట్లాడినవిగా చెబుతున్న 14 ఆడియో టేపులు ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా స్టీఫెన్‌సన్ సోదరుడి ఇంట్లో నడిచిన రూ. 5 కోట్ల డీల్ తతంగం, రూ. 50 లక్షల అడ్వాన్స్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీలు, రేవంత్‌రెడ్డితోపాటు మిగతా ఇద్దరు నిందితుల ఇళ్ల నుంచి సేకరించిన సీసీ కెమెరా ఫుటేజీలను కూడా ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు.

నిందితులతో ఫిర్యాదుదారుడైన స్టీఫెన్‌సన్ వివిధ సందర్భాల్లో మాట్లాడేందుకు వాడిన మొబైల్‌ఫోన్ సహా 21 ఫోన్లు, 3 సోనీ డిజిటల్ రికార్డర్లు, సీపీయూ, హార్డ్‌డిస్క్‌లను పరీక్షల కోసం పంపించారు. దీంతో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన మాటలపై చంద్రబాబు అండ్ కో చెపుతున్నట్టుగా ‘ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలను తెచ్చి అతికించారా... చంద్రబాబే మాట్లాడారా ...’ అనే విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చనున్నారు.

అదే సమయంలో రేవంత్‌రెడ్డి, చినబాబు లోకేశ్, ఎంపీలు, తెలుగుదేశం పోషకులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు మాట్లాడిన రికార్డుల నాణ్యతను కూడా ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి వాస్తవ నివేదిక ఇవ్వనున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక వ చ్చాక కూడా రికార్డుల్లో ఉన్న మాటలు తమవి కావంటే సంబంధిత వ్యక్తుల మాటలను మరోసారి రికార్డు చేసి నిజాలను బహిర్గతం చేస్తారు. సోమవారం నాటికి వీటికి సంబంధించిన నివేదిక రావచ్చని ఓ అధికారి తెలిపారు.

స్టీఫెన్‌సన్ స్టేట్‌మెంట్ సేకరించే పనిలో..
చంద్రబాబు ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి అండ్ కో తనను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాతపూర్వకంగా ఏసీబీని ఆశ్రయించి ఓటుకు కోట్ల కేసును తెరపైకి తెచ్చిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని ఏసీబీ నిర్ణయించింది.

సోమవారం రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసు తీవ్రతను కోర్టు ముందు ఉంచేందుకు తమ వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ న్యాయమూర్తికి సమర్పించాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా శని, ఆదివారాల్లో స్టీఫెన్‌సన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చే సి సోమవారం కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది.
 
పసుపు శిబిరంలో ఆందోళన...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలు ఇవ్వజూపుతూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో ఆయన జైలుపాలైన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్ రూ. 50 లక్షలు తీసుకెళ్లారని స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన ఫోన్ రికార్డులతో తేటతెల్లమైంది.

ఫోన్ రికార్డులు బయటపడ్డప్పటి నుంచి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పొంతన లేకుండా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దల చుట్టూ చెక్కర్లు కొడుతున్నా పసుపు శిబిరంలో ఆందోళన మాత్రం తగ్గలేదు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన రికార్డింగ్‌లతోపాటు ఆయన తనయుడు లోకేశ్  నాలుగో నిందితుడుగా ఉన్న మత్తయ్యతో మాట్లాడిన రికార్డులు కూడా ఏసీబీ వద్ద ఉన్నట్లు తేలడంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement