అమరావతి, గన్నవరం: ప్రస్తుతం చంద్రబాబునాయుడు చేస్తున్న ర్యాలీలు, ధర్మపోరాటం పేరుతో ఏసీ దీక్షలు అన్ని కూడా ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకేనని వైఎస్సార్ సీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు. జైలుపాలు కావాల్సి ఉంటుందని ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు ప్రజల్లో సానుభూతి కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, మహిళలు, ఆడపిల్లల రక్షణ గురించి ఏరోజు పట్టించుకోని ఆయన ఇటీవల ప్రజలు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు కొత్త నాటకానికి తెరతీశారని విరుచుకుపడ్డారు. గతేడాది అంతర్జాతీయ మహిళా సదస్సుకు వచ్చిన ఆమెను ఎయిర్‌పోర్టులో పోలీసులు అక్రమంగా నిర్భంధించడంపై గన్నవరంలోని కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు నిమిత్తం బుధవారం ఇక్కడికి వచ్చారు.
ఎయిర్‌పోర్టులో, కోర్టు బయట మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏసీబీ మీటింగ్ పెడితే ఇక్కడ చంద్రబాబు ఎలా వణుకుతున్నారో అందరూ గమనిస్తున్నారని చెప్పారు. గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లు మంత్రి సోమిరెడ్డి, కంభంపాటి, వర్ల రామయ్య మాట్లడడం చూస్తుంటేనే ఆ పార్టీకి ఓటుకు నోటు కేసు భయం పట్టుకుందని అర్థమవుతుందన్నారు. ఓటుకు నోటు కేసు అసలు కేసే కాదన్న వాళ్లు ఈ రోజు బీజేపీతో కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుట్రపన్నారని చెప్పడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ను తన ఇంటికి పిలిచి 36 రకాల వంటకాలతో విందు ఇచ్చి ఆయనతో లాలూచీ పడిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు.
ఫోరెన్సిక్ నివేదికలోనే తేలింది
తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణలో బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ చంద్రబాబుదేనని చంఢీగఢ్ ఫోరెన్సిక్ నివేదికలో తేల్చిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment