ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌పై‘రెవెన్యూ’లో గుబులు | TS Govt to conduct forensic audit of Dharani transactions: NIC seizes records in Telangana | Sakshi
Sakshi News home page

ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌పై‘రెవెన్యూ’లో గుబులు

Published Sat, Dec 28 2024 4:31 AM | Last Updated on Sat, Dec 28 2024 10:53 AM

TS Govt to conduct forensic audit of Dharani transactions: NIC seizes records in Telangana

డిజిటల్‌ ఫుట్‌ప్రింట్స్‌తో తేలనున్నధరణి రికార్డుల తారుమారు గుట్టు

నిషేధిత జాబితాలోని భూములే 

టార్గెట్‌గా అక్రమాలు?... రికార్డులు స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐసీ 

ఎన్‌ఐసీ చేతికి పోర్టల్‌ నిర్వహణ వచ్చాక ఆడిటింగ్‌పై విధాన ప్రకటన!

తహసీల్దార్ల గుండెల్లో రైళ్లు

సాక్షి, హైదరాబాద్‌: ‘ధరణి పోర్టల్‌ పేరుతో గత ప్రభుత్వంలోని పెద్దలు అక్రమాలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి భూముల రికార్డులు మార్చేశారు. ఇదో పెద్ద ఆర్థిక నేరం. ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ధరణి పోర్టల్‌ లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ జరుపుతాం..’ ఇది ఇటీవల ముగిసిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. ఈ ప్రకటన రెవెన్యూ శాఖలో గుబులు రేపుతోంది. ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ ఎలా ఉంటుంది? ఏఏ లావాదేవీలపై ఆడిటింగ్‌ చేస్తారు? ఎవరిని బాధ్యులుగా తేలుస్తారు? 

ఎప్పుడు ఏం జరుగుతుంది? అనే అంశాలు ఇప్పుడు రెవెన్యూ శాఖ పరిధిలో హాట్‌టాపిక్‌గా మారాయి.  
అసలేంటీ... ఆడిటింగ్‌?: ఆన్‌లైన్‌తో ముడిపడి ఉన్న ప్రతి వ్యవస్థలో జరిగే లావాదేవీలను డిజిటల్‌ ఫుట్‌ప్రింట్స్‌ ఆధారంగా సరి పోల్చడాన్ని ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ కింద పరిగణించవచ్చు. ఇందుకోసం ట్రాన్సాక్షన్‌ హిస్టరీ (లావాదేవీ జరిగిన తీరు)ని పరిగణనలోకి తీసుకుంటారు. లావాదేవీ ఎక్కడ, ఎలా జరిగింది? ఏ రికార్డుల ఆధారంగా నిర్వహించారు? ఎవరెవరు ఏ సమయంలో జరిపారు? ఆ కంప్యూటర్‌ ఐపీ అడ్రస్‌ ఏంటి?... ఇలా సదరు లావాదేవీ జరిగిన తీరును కూలంకశంగా పరిశీలించి నిబంధనల మేరకు జరిగిందా లేక నిబంధనలు ఉల్లంఘించారా అన్నది నిగ్గు తేల్చడమే ఈ ఆడిటింగ్‌ ప్రధాన ఉద్దేశమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

 ప్రభుత్వం ప్రకటించిన దాన్ని బట్టి ఇప్పుడు ధరణి పోర్టల్‌ లావాదేవీలను కూడా డిజిటల్‌ ఫుట్‌ప్రింట్స్‌ లేదా ట్రాన్సాక్షన్‌ హిస్టరీ ద్వారా మదింపు చేయనున్నారు. ఆ లావాదేవీల్లో ఎవరెవరు భాగస్వాములయ్యారనే దాన్ని ఈ ఆడిటింగ్‌ కీలకంగా పరిగణించనుంది. క్రయ, విక్రయదారుల నుంచి ధరణి ఆపరేటర్, తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్‌ఏ వరకు ఎవరి పాత్ర ఏంటన్న దానిపై ఫోకస్‌ చేస్తారని తెలుస్తోంది.

పాత రికార్డులు... కొత్త లావాదేవీలు 
ధరణి పోర్టల్‌ వేదికగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో అక్రమ లావాదేవీలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. రాత్రికిరాత్రి నిషేధిత జాబితాను అన్‌లాక్‌ చేసి వారికి కావాల్సిన సర్వే నంబర్‌ను తొలగించి మళ్లీ ఆ జాబితాను లాక్‌ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా భూములే టార్గెట్‌గా ఈ ఆడిటింగ్‌ జరగొచ్చనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన నాటికి ఉన్న రికార్డుల వివరాలు, పోర్టల్‌లో నమోదు చేసిన వివరాలు, ఈ రికార్డుల ఆధారంగా జరిపిన లావాదేవీలు ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌లో కీలకమవుతాయని రెవెన్యూ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ‘పోర్టల్‌ అమల్లోకి వచ్చిన నాటికి నిషేధిత జాబితా కింద ఉన్న భూముల రికార్డులు తీసుకుంటారు. ఆ తర్వాత ధరణి పోర్టల్‌లో నమోదైన వివరాలను సరిచూస్తారు. ఈ క్రమంలో సందేహాస్పదంగా ఉన్న లావాదేవీలను మరింత లోతుగా పరిశీలించి నిగ్గు తేలుస్తారు’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు. 

ట్రాన్సిట్‌ పీరియడ్‌ పూర్తి కాగానే...! 
ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ను రెవెన్యూ శాఖ ముఖ్యఅధికారులతో చేయిస్తారా? లేక ఇతర శాఖల్లోని ముఖ్య అధికారులతో కలిపి చేయిస్తారా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై వచ్చే నెలలో విధాన ప్రకటన చేసే అవకాశం ఉంది. వాస్తవానికి, ధరణి పోర్టల్‌ నిర్వహణను ప్రస్తుత ప్రభుత్వం నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)కి అప్పగించింది. గతంలో ఈ పోర్టల్‌ నిర్వహించిన టెర్రాసిస్‌ నుంచి ఎన్‌ఐసీ ఈ బాధ్యతలు తీసుకుంటోంది.

ఈ క్రమంలో టెర్రాసిస్‌ నుంచి పోర్టల్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఎన్‌ఐసీ తీసుకుంటోంది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ఈ వివరాల పంపిణీ (ట్రాన్సిట్‌) కోసం ప్రభుత్వం ఇచ్చిన రెండు నెలల గడువు.. డిసెంబర్‌ 31తో ముగియనుంది. అంటే జనవరి 1 నుంచి భూభారతి (ధరణి స్థానంలో) పోర్టల్‌ను ఎన్‌ఐసీ నిర్వహించనుంది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వచ్చిన సమాచారం ఆధారంగా ‘సిట్‌’ను ఏర్పాటు చేయొచ్చని, తద్వారా ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారన్న అంశాలను తేలుస్తారని చెబుతున్నారు.  

తహశీల్దార్ల డిజిటల్‌ సంతకాలు  
ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన తర్వాత భూ సమస్యల పరిష్కార బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించారు. కానీ సదరు పరిష్కారాలను ధ్రువీకరిస్తూ సవరించే రికార్డులపై తహశీల్దార్ల డిజిటల్‌ సంతకాలే నమోదు చేశారు. ఈ విషయంలో పలుమార్లు తహశీల్దార్‌ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కనీసం తమ ప్రమేయం లేకుండా తీసుకునే నిర్ణయాలను తమ డిజిటల్‌ సంతకాలతో ధ్రువీకరించడమేంటని, వెంటనే తమ సంతకాలు తొలగించాలని కూడా డిమాండ్‌ చేశాయి. కానీ, అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ డిజిటల్‌ సంతకాలేం చేస్తాయోననే గుబులు తహశీల్దార్లలో మొదలైంది.

ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో పనిచేసిన తహశీల్దార్లు ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనతో ఉన్నారు. ఇదిలాఉంటే.. అసలు తహశీల్దార్ల డిజిటల్‌ సంతకాలు కూడా లేకుండా రాత్రికిరాత్రే డాక్యుమెంట్లు మారిపోయాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో.. ఏం తేలుస్తుందో.. ఎవరిని బాధ్యులను చేస్తుందో... అనే అంశాలు ఇప్పుడు రెవెన్యూ శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement