జిల్లాలకు ఫోరెన్సిక్ ఫోర్స్..
సైబర్ ఫోరెన్సిక్ సెల్ ఏర్పాటుకు పోలీస్ శాఖ యోచన
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా సైబర్‌నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేరాల నియంత్రణకు సైబర్ ఫోరెన్సిక్ సెల్‌లు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా దక్షిణాసియా మొత్తం లో హైదరాబాద్‌లోనే అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్(సీఎఫ్‌ఎల్) ఉంది. ప్రస్తుతం ఈ–మార్కెట్ ఊపందుకుంటోంది. అదే స్థాయిలో సైబర్ నేరాలుకూడా పెరిగే ప్రమాదం ఉండటంతో వాటి నియం త్రణకు ప్రతి జిల్లాకూ ఒక సైబర్ ఫోరెన్సిక్ సెల్ ఏర్పాటు చేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ భావిస్తున్నారు.
ఒక్కో జిల్లాకు రూ.65లక్షలు..
ప్రతీ జిల్లాలో పూర్తి స్థాయి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.65లక్షలు ఖర్చవుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు మంజూరు అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏటా రాష్ట్ర పోలీస్ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆధునీకరణ (ఎంఓపీఎఫ్) నిధులను ఈ సారి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ఉపయోగించుకోవాలని భావి స్తోంది. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ప్రస్తుతం సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ అందుబాటులో ఉంది. మిగిలిన ఎనిమిది కమిషనరేట్లతో పాటు జిల్లా పోలీస్ విభాగాలకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలంటే రూ.15కోట్ల వరకు నిధులు అవసరం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నిధుల్లో 60 శాతం కేంద్రం, 40శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు.
హైదరాబాద్‌లో శిక్షణ..
జిల్లాలు/కమిషనరేట్‌ల పరిధిలో ఏర్పాటు చేయబోయే సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లో ఎస్‌ఐ నేతృత్వంలో ఆరుగురు సిబ్బంది పనిచేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీపై పట్టు ఉండి, సైబర్ నేరాల నియంత్రణకు ఆసక్తి కనబరిచే అధికారులు, సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ భావిస్తున్నారు. ఈ బృందాలకు హైదరాబాద్ కమిషనరేట్‌లోని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శిక్షణ ఇప్పించి జిల్లాల్లో ఫోరెన్సిక్ సెల్‌లను నిర్వహించాలని యోచిస్తున్నారు.