సాక్షి, హైదరాబాద్: ‘‘నాకు జన్మనిచ్చింది రాజస్తాన్. కానీ జీవితాన్నిచ్చింది హైదరాబాద్. దానికి తోడు నా భార్య హైదరాబాదీయే. 60 ఏళ్లలో 25 ఏళ్లు మాత్రమే çస్వస్థలంలో ఉన్నా. మిగతా జీవితమంతా హైదరాబాదే. భార్య, పిల్లలు, చుట్టాలు, స్నేహితులు.. అంతా ఇక్కడే. హైదరాబాద్‌కు హాట్ సిటీ లాంటిది పాతబస్తీ.. కీలక సమయంలో ఆ ప్రాంతానికి డీసీపీగా పనిచేయడం జీవితంలో ఎనలేని సంతృప్తినిచ్చింది’’ అని డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..
కీలకమైన గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్‌లలో చాలా కాలం పనిచేశారు, ఆ అనుభవం ఎలాంటిది?
- ఇప్పుడున్నంత ప్రశాంత వాతావరణం అప్పుడు లేదు. 2007 వరకు ఉద్రిక్తమైన వాతావరణం ఉండేది. గ్రేహౌండ్స్‌లో గ్రూప్ కమాండర్‌గా పనిచేసిన సందర్భంలో ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటామో? అసలు వస్తామో లేదో కూడా నమ్మకం ఉండేది కాదు. ఉగ్రవాదుల హెచ్చరికలు, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, అనుమానితులను ప్రశ్నించడం.. అదంతా సెపరేట్ పోలీసింగ్. నా సక్సెస్‌లో ఆ పోస్టింగ్స్ కూడా కీలకం.
ఇప్పటివరకు ఎన్ని ఎన్‌కౌంటర్లు చూశారు, మీ నేతృత్వంలో ఎన్ని జరిగాయి?
- ప్రతీదీ ఎన్‌కౌంటర్ అనడం కరెక్ట్ కాదేమో. కొన్నిసార్లు ఎదుటి వారు ముందు కాల్పులు జరపడం మొదలుపెడితే.. ఇరువైపులా పరిస్థితి ఎవరి చేతుల్లో ఉండదు. అలా లెక్కలేనన్ని ఎన్‌కౌంటర్లు చూశాను. ఎన్ని అన్నది లెక్కపెట్టుకోలేదు. లెక్క ఉన్నా చెప్పడం మంచిది కాదు.
చాలాసార్లు ఎన్‌కౌంటర్లలో యువత చనిపోయారు కదా.. అలాంటి సందర్భాల్లో బాధ అనిపించలేదా?
- ప్రాణం చాలా విలువైంది. కాల్పులు శత్రువు వైపు నుంచి ప్రారంభమయ్యాక ఆపడం గానీ, నిలువరించడం గానీ మన చేతుల్లో ఉండదు. చాలా మంది తెలిసీ తెలియని వయసులో మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలా యువతీ యువకులు మృతిచెందిన సమయంలో బాధనిపించినా.. బయటపడలేం. వృత్తి అలాంటిది. అలాగని మేం కర్కశులం కాదు.
మీ 35 ఏళ్ల సర్వీసులో గర్వంగా అనిపించిన పోస్టింగ్ ఏది?
- చెప్పాలంటే డీజీపీ పోస్టు కన్నా.. గ్రేట్‌గా ఫీలయ్యేది గతంలో చేసిన హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీ పోస్టు. నిప్పు మీద వేలాడుతున్నట్టుగా ఉండే పోస్టింగ్‌లో మూడున్నరేళ్లపాటు చేశాను. ఇప్పటివరకు నా రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో, తర్వాత ముంబై పేలుళ్ల సమయంలో.. ఇలా ఒకదానిపై ఒకటి టెన్షన్ పెంచిన సమయంలోనూ.. అక్కడి యువత, ప్రజల సహకారంతో దుర్ఘటనలేమీ జరగకుండా పనిచేసి విజయం సాధించాను.
ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏమిటి, మళ్లీ పుంజుకుంటోందా?
- అందుకు అవకాశమే లేదు. పేరుకు మావోయిస్టు తెలంగాణ కమిటీ ఉన్నా.. పూర్తిగా ఛత్తీస్‌గఢ్ నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. గిరిజన యువతను రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న విద్య, ఉపాధి అవకాశాలతో యువత అభివృద్ధి వైపు చూస్తోంది. మావోయిస్టు పార్టీలో చేరి ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితిని యువత వద్దనుకుంటోంది. భవిష్యత్‌లో మావోయిస్టు పార్టీ పుంజుకునే పరిస్థితులు లేవు.
శాఖలో అధునాతన సాంకేతికత వినియోగం పరిస్థితి ఏమిటి?
- గత పదేళ్లలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఏ సమాచారమైనా క్షణాల్లో కేంద్ర కార్యాలయాలకు చేరిపోతోంది. దాంతో ఉగ్రవాద కార్యకలాపాలు, మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంలో రాష్ట్ర పోలీసు శాఖ విజయవంతమైంది. అధికారులు, సిబ్బంది కూడా టెక్నాలజీపై ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్నారు. నిందితుల లొకేషన్లు, కాల్‌డేటా, ఇతరత్రా వ్యవహారాలు మొత్తం వేగంగా తెలుసుకోగలుగుతున్నాం. నేరస్తులకు శిక్ష పడేలా సాంకేతిక ఆధారాలు తోడ్పడుతున్నాయి.
నయీమ్ కేసులో రాజకీయ నేతలపై కేసులు పెట్టలేకపోయారన్న ఆరోపణలపై మీ వివరణ?
- నయీమ్‌తో కలసి తిరిగిన కొందరు అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. రాజకీయ నేతల విషయానికొస్తే పెద్దగా ఆధారాల్లేవు. ఆధారాలున్న అంశాల్లో చర్య లు తీసుకున్నాం. సిట్ కేసులు నమోదు చేసి చార్జిషీట్లు వేస్తోంది. రాజకీయంగా నయీమ్ కేసులో కొంత ఒత్తిడి వచ్చినా అది ఆధారాలను బట్టి చూడాల్సి ఉంటుంది. పక్కాగా ఆధారాలుంటే ఎవరినీ వదలే ప్రసక్తి లేదు.
మీ తర్వాత వచ్చే డీజీపీకి మీరిచ్చే సూచనలు, శాఖాపరంగా ఉన్న సమస్యలు?
- నా తర్వాత డీజీపీగా వచ్చే అధికారి చాలా సమర్థవంతుడే. పోలీస్ శాఖకు ఉన్న సమ స్య అధికారుల విభజన పూర్తికాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, స్టేషన్ల నిర్మాణం, టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో మాదిరి రాష్ట్రవ్యాప్తంగా విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర పోలీసు శాఖ మూడున్నరేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని సాధించింది. దీన్ని కొనసాగిస్తూ మరింత ఆధునీకరణ సాధిస్తే దేశంలోనే టాప్‌గా నిలుస్తాం.
ఎన్ని ఎన్‌కౌంటర్లన్నది చెప్పలేం
Published Wed, Nov 8 2017 2:54 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment