
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఐదుగురు అధికారులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖ అనుమతి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అదనపు ఎస్పీ స్థాయి అధికారి సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించిన ఫైలు హోంశాఖకు చేరింది. అలాగే ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లకు సంబంధించిన సస్పెన్షన్ రిలీఫ్ ప్రతిపాదన రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయానికి చేరినట్టు తెలుస్తోంది. సస్పెన్షన్ ఎత్తివేత అనంతరం ఐదుగురు అధికారులకు తిరిగి పోస్టింగ్స్ కల్పించనున్నారు.
అలాగే మైనర్ పనిష్‌మెంట్లకు గురైన 16 మంది అధికారులు కూడా రిలీఫ్ అయినట్టు తెలుస్తోంది. నయీంతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో 16 మంది అధికారులకు డీజీపీ మెమోలు జారీ చేశారు. అయితే విధి నిర్వహణలో భాగంగానే నయీంను కలిశామని కొంతమంది అధికారులు వివరణ ఇవ్వగా.. క్లాస్‌మెట్, బంధుత్వం వల్ల కలవాల్సి వచ్చిందని మరికొందరు పేర్కొన్నారు. మరోవైపు మైనర్ పనిష్‌మెంట్లు పొందిన కొందరు అధికారుల పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది పదోన్నతి పొందాల్సిన వీరు పనిష్‌మెంట్ల వల్ల అవకాశం కోల్పోయారు. ఇప్పుడు వీరికి పదోన్నతుల ప్రతిపాదన ఫైలు కూడా తెరమీదకు రానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.