‘మెట్రో’ భద్రత ఎవరిది? | Whose Security is 'Metro' | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 5 2017 2:01 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Whose Security is 'Metro' - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో రైలు త్వరలో పట్టాలెక్కబోతోంది. మెట్రో తొలి దశను వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం దగ్గర పడుతున్నా మెట్రో రైలు భద్రతపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కీలకమైన మెట్రో రైలు భద్రత ఎవరి చేతికి వెళ్తుంది? పోలీస్‌ శాఖ చేతికి వస్తుందా? లేక ప్రైవేట్‌ ఏజెన్సీల చేతికి వెళ్తుందా? అనే దానిపై హెచ్‌ఎంఆర్, పోలీస్‌ శాఖ మధ్య సందిగ్ధత ఏర్పడింది.

సాయుధ బలగాలతో గస్తీ..
దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే అందు బాటులోకి వచ్చిన మెట్రో రైళ్లు, వాటి భద్రత వ్యవహారాలు మొత్తం సాయుధ బలగాలు, పోలీస్‌ శాఖ చేతిలోనే ఉన్నాయి. ఉగ్రవాద ముప్పు నుంచి ప్రతిక్షణం కాపాడేందుకు ప్రత్యేకమైన భద్రత వ్యవస్థలను అందుబాటు లోకి తీసుకువచ్చారు. హైదరాబాద్‌ మెట్రో రైలు భద్రత కూడా పోలీస్‌ శాఖ చేతిలోనే ఉండాలని గతంలోనే రెండు సార్లు సమావే శమై ఇరు విభాగాల అధికారులు నిర్ణయానికి వచ్చారు. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధమవు తున్నా ఇప్పటివరకు మెట్రో రైలు భద్రత ఎవరి బాధ్యత అన్న దానిపై రెండు విభాగాల్లోని అధికారులకు స్పష్టత లేకుండా పోయింది.

ప్రైవేట్‌ సెక్యూరిటీకి మొగ్గు..
హెచ్‌ఎంఆర్, పోలీస్‌ శాఖ మెట్రో రైలు భద్రతపై సమావేశమైనప్పుడు.. పోలీస్‌ శాఖనే పూర్తి స్థాయిలో భద్రతా వ్యవహారాలు పర్యవేక్షించాలని, ఇందుకు ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని రెండు విభాగాలు నిర్ణయించుకున్నాయి. నాగోల్, మియాపూర్, ఎస్‌ఆర్‌నగర్‌లో మెట్రో పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటుచేసి, మరో ఐదు ఔట్‌పోస్టులను పెట్టుకోవాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నాయి. మూడు పోలీస్‌స్టేషన్లకు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌గా ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ అధికారి ఉండటంతో పాటు ఔట్‌ పోస్టుల్లో ఎస్‌ఐ ర్యాంక్‌ అధికారిని నియమించాలని, కో–ఆర్డినేట్‌ చేసుకోవడానికి డీఎస్పీ లేదా ఎస్పీ స్థాయి అధికారి ఒకరు ఉంటారని భావించాయి. తీరా సమయం దగ్గరపడుతున్న టైమ్‌లో ప్రత్యేక పోలీస్‌స్టేషన్లు అక్కర్లేదని, కొన్ని చోట్ల పోలీస్‌ సిబ్బంది భద్రత, మిగతా అంతా ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంటే సరిపోతుందని మెట్రో ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

జీఆర్‌పీ నేతృత్వంలోనే...
మెట్రో రైలు భద్రత వ్యవహారాలు మొత్తం ప్రస్తుతం ప్రభుత్వ రైల్వే పోలీస్‌(జీఆర్‌పీ) విభాగం కిందే పనిచేస్తోందని ఉన్నతా ధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, ఖాజీపేట, హన్మకొండ ఇలా పలు రైల్వేస్టేషన్లలో రాష్ట్ర పోలీస్‌ కింద పనిచేసే రైల్వే పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. వాటి లాగే మెట్రో రైల్వే స్టేషన్లు కూడా జీఆర్‌పీ కిందే పనిచేసేలా ప్రణాళిక రూపొందించుకుంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. స్టేషన్లతోపాటు బోగీల్లోనూ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బందిని భద్రత వ్యవహారాల్లో నిమగ్నం చేయాలని యోచిస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోం..
పోలీస్‌ స్టేషన్లు, సాయుధ సిబ్బంది లేకుండా మెట్రో రైలు భద్రతను పర్యవేక్షించడం సాధ్యం కాదని పోలీస్‌ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఢిల్లీ మెట్రో రైలు భద్రత మొత్తం సీఐఎస్‌ఎఫ్‌(సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) చేతిలో ఉంటుంది. కోల్‌కత్తా మెట్రో భద్రత ఏకంగా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌) చేతికిచ్చారు. బెంగళూరు మెట్రో భద్రతను ప్రైవేట్‌ సెక్యూరిటీకి ఇచ్చి భంగపడాల్సి వచ్చింది. ఎలాంటి అధికారాలు లేని ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు అసాంఘిక శక్తులను నియంత్రించడం సాధ్యం కాదని తేలడంతో ఆర్‌పీఎఫ్, లేదా సీఐఎస్‌ఎఫ్‌కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మెట్రో నగరాలు ఉగ్రవాద టార్గెట్‌లో ఉంటాయని, అలాంటి ముప్పును ఎదుర్కోవడం, వాటిని నియంత్రించేందుకు సాయుధ బలగాలు, సివిల్‌ పోలీస్‌ సిబ్బంది నేతృత్వంలో భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పోలీస్‌ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలకు భద్రత అప్పగిస్తే విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

త్వరలో సమావేశమవుతాం
మెట్రో రైలు భద్రతకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసు కోవాల్సిన చర్యలపై హైదరాబాద్‌ మెట్రో రైలు ఉన్నతాధికారులతో సమావే శమవుతాం. మెట్రో రైలు భద్రత పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు స్టేషన్లు, సాయుధ సిబ్బంది తప్పనిసరి. గతంలో జరిగిన సమావేశాల్లోనూ ఇదే చెప్పాం. దీనిపై త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందిం చుకుంటాం.
– డీజీపీ అనురాగ్‌ శర్మ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement