సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న పట్టాలెక్కనున్న మెట్రో రైలు వ్యవస్థకు 2 వేల మందితో భద్రతా ఏర్పాటు చేయాలని హెచ్‌ఎంఆర్ ఉన్నతాధికారులు డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆధ్వర్యంలో మెట్రో రైలు ప్రారంభోత్సవ ఏర్పాట్లు, భద్రత చర్యలకు సంబంధించి సమీక్ష జరిగింది. మెట్రో రైలు భద్రతకు మొత్తం 2 వేల మంది సిబ్బంది అవసరమవుతారని, ప్రారంభోత్సవం సందర్భంగా 24 స్టేషన్లలో 546 మంది పోలీస్ సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంఆర్ ఉన్నతాధికారులు డీజీపీని కోరారు. ప్రారంభోత్సవం అనంతరం పూర్తి స్థాయిలో మరోసారి సమీక్ష నిర్వహించి పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. హెచ్‌ఎంఆర్ విజ్ఞప్తి మేరకు ముందుగా 546 మంది అధికారులు, సిబ్బందిని మెట్రో పోలీస్ ఫోర్స్‌కోసం కేటాయించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు పోలీస్ శాఖ వర్గాలు తెలిపాయి.
హై సెక్యూరిటీ ఇలా..
- మెట్రో భద్రతకు డీసీపీ స్థాయి అధికారితో పాటు.. అడిషనల్ డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్‌స్పెక్టర్లను నియమించనున్నారు.
- రసూల్‌పురాలోని మెట్రో భవన్‌లో మెట్రో సెక్యూరిటీ కార్యాలయం ఏర్పాటు.
- పరేడ్‌గ్రౌండ్స్, అమీర్‌పేట్ ఇంటర్‌చేంజ్ మెట్రో స్టేషన్ల వద్ద మెట్రో రైలు పోలీస్ స్టేషన్ల ఏర్పాటు.
- ప్రతిస్టేషన్‌లో ఒక ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్స్‌తో పాటు ముగ్గురు మఫ్టీ పోలీసులు, హెచ్‌ఎంఆర్‌ఎల్ సంస్థకు చెందిన భద్రతా సిబ్బంది, ఎల్‌అండ్ టీఎంఆర్‌హెచ్‌ఎల్ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది పహారా.
- మరో ఏడాదిలో మెట్రో సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు.
- స్టేషన్లలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించే కృషిలో హెచ్‌ఎంఆర్‌ఎల్ భద్రతా బృందాలకు పోలీసులు సహకరిస్తారు.
- క్రైమ్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ, క్విక్ రెస్పాన్స్ బృందాలు, సీఎస్జీ, షీ టీమ్ బృందాలు మెట్రో స్టేషన్లకు రక్షణ కవచంలా నిలుస్తాయి.
అత్యాధునిక భద్రతా ఉపకరణాలివే..
- అన్నిమెట్రో స్టేషన్ల వద్ద 360 డిగ్రీల కోణంలో తిరిగే సీసీటీవీల ఏర్పాటు.
- ప్రతీ స్టేషన్‌లో బ్యాగేజి స్కానర్లు.
- స్టేషన్‌లోకి ప్రవేశించే చోట డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు.
- సీసీటీవీల ఫుటేజీని నిరంతరం పరిశీలించేందుకు ప్రత్యేక సిబ్బంది.
- మెట్రో స్టేషన్ ఆస్తులు, డిపో సెక్యూరిటీ, సిగ్నల్ టవర్ సెక్యూరిటీ, ట్రాక్‌పై పేలుడు పదార్థాలు అమర్చకుండా ప్రత్యేక భద్రతా చర్యలు.
2,000 మంది పోలీసులు అవసరం
Published Wed, Nov 22 2017 1:54 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment