సాక్షి, హైదరాబాద్: త్వరలో పట్టాలెక్కబోతున్న మెట్రో రైలు వ్యవస్థకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేయబోతోంది. మెట్రో రైలు ఉన్న రాష్ట్రాల్లో భద్రతపై అధ్యయనం చేసిన పోలీసు శాఖ అక్కడి కంటే పకడ్బందీగా ఏర్పాట్లు చేయనుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసేలా మెట్రో పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్‌కు బుధవారం చేరింది.
రెండు పోలీసు స్టేషన్లు, 24 ఔట్‌పోస్టులు...
నవంబర్ 28న మెట్రో ప్రారంభం కానుంది. ప్రస్తు తం 30 కి.మీ. వరకే మెట్రోను నడపనున్నారు. రెండు మెట్రో పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎంఆర్, పోలీస్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇంటర్ చేంజ్ జంక్షన్లు పరేడ్ గ్రౌండ్ (సికింద్రాబాద్), అమీర్‌పేటలో ఒక్కో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రైలు ఆగే 24 స్టేషన్లలో ఒక్కో ఔట్‌పోస్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
చీమచిటుక్కుమన్నా దొరికిపోయేలా..
మెట్రో కారిడార్ మొత్తం సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నారు. 24స్టేషన్లలో 360 డిగ్రీ కవర్ చేసేలా ఒక్కో స్టాప్‌లో 80కిపైగా కెమెరాలు అమర్చనున్నారు. ప్రతీ స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్‌సెంటర్ ఏర్పాటుచేసి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చర్యలు చేపట్టబోతున్నారు. సిటీ కమిషనరేట్ పరిధిలోని కమాండ్ సెంటర్‌కు ఈ సీసీటీవీలను అనుసంధానం చేయనున్నారు. ఆర్మ్‌డ్(సాయుధ) పోలీసులను బందోబస్తులో నిమగ్నం చేయబోతున్నారు. 4 జాగీలాల బృందాలు పనిచేయబోతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ కల్గిన అక్సెస్‌కంట్రోల్, మెటల్ డిటెక్టర్, ఇతరత్రా ఎక్విప్‌మెంట్‌ను తెప్పించనున్నట్టు సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. మెట్రో భద్రతకు సిటీ పోలీస్ విభాగంలో సీనియర్ ఐపీఎస్ ఎప్పటికప్పుడు భద్రత పర్యవేక్షించే ఏర్పాట్లు సైతం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
నేర నియంత్రణకు సైతం..
మెట్రో రైల్వే స్టేషన్లు, బోగీల్లో ప్రయాణసమయంలో జేబు దొంగలకు, నేరాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. షీటీమ్స్‌నూ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. మఫ్టీలో ఉండేలా ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయను న్నారని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.
సిటీ పోలీస్ చేతికి మెట్రో భద్రత
Published Thu, Nov 16 2017 1:11 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment