సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల పరిస్థితులు కనిపిస్తుండటంతో పోలీస్ శాఖ ఆ మేరకు ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ఎన్నికల సమయంలో కీలకంగా పనిచేసే సబ్‌ఇన్‌స్పెక్టర్ల దగ్గరి నుంచి ఎస్పీలు, కమిషనర్ల వరకు అందరినీ బదిలీ చేసే కార్యాచరణ సిద్ధం చేసింది. ఏయే జిల్లాలో ఏయే అధికారి మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు? అతడి స్థానిక జిల్లా తదితరాల వివరాలతోపాటు ఒకే పోస్టులో ఎక్కువ రోజులుగా పనిచేస్తున్న అధికారుల జాబితాను సిద్ధం చేసుకుంది. ఎస్‌ఐలు, ఇన్‌స్పెక్టర్ల బదిలీలపై రెండు జోన్ల ఐజీలు సోమవారం సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 200 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం ఉంటుందని పోలీస్ శాఖ భావిస్తోంది.
ఎస్పీలు, కమిషనర్లు సైతం..
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రెండేళ్లు, మూడేళ్లు ఎస్పీలు, కమిషనర్లుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. దీంతో బదిలీ జాబితాను పోలీస్ శాఖ రూపొందించింది. ఇందులో 9 జిల్లాల ఎస్పీలు, నలుగురు కమిషనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం కమిషనర్లు ఉన్నారని, హైదరాబాద్, రాచకొండ, సైబరా బాద్‌లో పనిచేస్తున్న పలువురు డీసీపీలు, అదనపు డీసీపీలకు స్థానచలనం ఖాయమన్నట్లు సమాచారం. సంగారెడ్డి, వనపర్తి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ఎస్పీలకు బదిలీ తప్పనిసరిగా ఉంటుందని పోలీసు ఉన్నతాధికార వర్గాలు చెబుతు న్నాయి. హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న సౌత్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీలకు స్థానచలనం జరిగే అవకాశముంది. సైబరాబాద్‌లో శంషాబాద్, బాలానగర్, క్రైమ్ డీసీపీలకు మరోచోటికి బదిలీ ఉండనున్నట్లు తెలుస్తోంది. రాచకొండలోని మల్కాజ్‌గిరి, యాదాద్రి డీసీపీలకూ ట్రాన్స్‌ఫర్ ఉం టుందని సమాచారం. అలాగే రాచకొండ కమిషనర్ మార్పు, నార్త్ జోన్ ఐజీ మార్పు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు అధికారులకు రెండేళ్ల టర్మ్ పూర్తయిందని వీరిద్దరి బదిలీ సాధారణ బదిలీల్లో భాగంగానే ఉంటుందని తెలుస్తోంది.
87 మంది డీఎస్పీల బదిలీ!
రాష్ట్రంలో వివిధ సబ్‌డివిజన్లలో పనిచేస్తున్న డీఎస్పీ/ ఏసీపీలకు స్థానచలనం ఉండబోతోంది. ఎన్నికల కోడ్ తో పాటు రెండేళ్లు పూర్తిచేసుకున్న ప్రతి డీఎస్పీని బదిలీ చేయాల్సిందేనని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం నుంచి గ్రీన్‌సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పదోన్నతి పొందిన 47 మంది డీఎస్పీలతో పాటు మరో 40 మంది డీఎస్పీలను బదిలీ చేసేందుకు ఇప్పటికే డీజీపీ కార్యాలయం కసరత్తు పూర్తిచేసింది.
ఎన్నికల కోడ్ వస్తే ఫిర్యాదులు రాకుండా..
ముందస్తు ఎన్నికలు వస్తే ఎన్నికల కోడ్‌లో భాగంగా సబ్‌ఇన్‌స్పెక్టర్ నుంచి ఐజీ స్థాయి వరకు ఏ అధికారిపై కూడా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లకుండా ఉండా లని ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితాను సీఎం కేసీఆర్ రెండు రోజుల్లో పెట్టబోయే మంత్రి వర్గ సమావేశానికి పంపనున్నట్లు సమాచారం.
పోలీసు శాఖలో ‘ముందస్తు’ బదిలీలు
Published Tue, Aug 28 2018 1:57 AM | Last Updated on Thu, Sep 6 2018 2:53 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment