సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన కేసులపై రాష్ట్ర పోలీసు శాఖ దృష్టి సారించింది. ఈసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,527 నమోదయినట్లు పోలీసు శాఖ స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘన కేసులతో పాటుగా ఎమ్మెల్యే, ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తూ ఇటీవల అన్ని రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేసిన దృష్ట్యా ఈ కేసుల విచారణ ఇకనుంచి వేగవంతం కానుంది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ ఏయే నేతపై ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్న అంశంపై త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించే యోచనలో పోలీస్ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 2014నాటి 99 క్రిమినల్ కేసులతో పాటుగా ఈసారి నమోదైన కేసులపై వెంటనే చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసు శాఖ సిద్ధమవుతోంది.
స్థానిక కోర్టుల్లోనే విచారణ
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి ఫలితాలు వచ్చే వరకు కోడ్ కండక్ట్ ఉల్లంఘన కింద పలు పార్టీల అభ్యర్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై ఆధారాలు సేకరించడంతోపాటు దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసుల విచారణ స్థానిక కోర్టు పరిధిలోనే జరుగుతుందని, వీటిపై చార్జిషీట్లు సైతం 90 రోజుల్లోపే వేసి ట్రయల్స్ ప్రక్రియపై పూర్తి దృష్టి పెడతామని అధికారులు స్పష్టం చేశారు. ఎక్కువ తీవ్రత ఉన్న వాటిలో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, ఆధారాలను బట్టి ఆయా కేసుల పురోగతి ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘన సమయంలో కొన్ని చోట్ల సాధారణ ఘర్షణలు జరిగాయని, ఇలాంటి కేసులు రాష్ట్రమొత్తంగా 100 కేసులుంటాయని ఎన్నికల కమిషన్‌కు పోలీస్ శాఖ నోడల్ అధికారులు నివేదికిచ్చారు. వీటిపై దర్యాప్తు లోతుగా ఉంటుందని, కుట్రపూరితంగా వ్యవహరించినట్టు తేలితే వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
ఎన్నికల కేసులపై పోలీస్‌శాఖ నజర్
Published Mon, Dec 17 2018 1:25 AM | Last Updated on Mon, Dec 17 2018 1:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment