తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణాలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 7వ తేదీన జరుగబోయే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి వీలుగా 31 జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అన్ని తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని స్థాయిలలోని అధికారులకు శిక్షణా శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పించామని వెల్లడించింది. శాంతి భద్రతల అదనపు డీజీపీని నోడల్ అధికారిగా నియమించినట్లు వివరించింది. తీవ్రవాదుల కదలికలు, మత ఘర్షణల ప్రభావం, రాజకీయంగా సున్నితమైన నియోజకవర్గాలు వంటి అంశాలను ఏ రోజు కారోజు సమీక్షించుకుంటూ తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి పకడ్బందీ వ్యూహ రచన చేసినట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో 414 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 404 ఎస్‌ఎస్‌టీలు, 3,385 సంచార బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపింది. ప్రజల్లో భద్రత పట్ల భరోసా కల్పించే నిమిత్తం పొరుగు రాష్ట్రాల నుంచి సిబ్బందిని, కేంద్ర దళాలను కూడా రంగంలోకి దింపినట్లు స్పష్టంగా చేసింది. ప్రధాని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులకు ఎస్‌పీజీ,ఎ స్‌ఎస్‌జీ దళాల రక్షణలో ఉన్న ప్రముఖులతో పాటు ప్రమాదం ఎదుర్కొంటున్న అభ్యర్థులకు, బహిరంగ సభల నిర్వహణకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. స్వేచ్ఛగా, నిష్పక్షిపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న కారణంతో అనుమానితులందరినీ చట్టప్రకారం ముందుగా బైండోవర్ చేశారు.
ఎన్నడూ లేనంతంగా 11, 862 మందికి నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు. డిసెంబర్ 6వ తేదీ వరకు రాష్ట్ర పోలీసు విభాగం రూ.93.08 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. అలాగే రూ.2.37 కోట్ల విలువ చేసే 53 వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసింది. 146.6 గ్రాముల ప్లాటినం, 689 గ్రాముల వజ్రాలు, 17.56 కిలోల బంగారం, 121.32 కిలో వెండి, 267.68 కిలోల గంజాయి, రూ.1.6 కోట్ల విలువ చేసే బహుమతులు కూడా సీజ్ చేశారు. మొత్తంగా 17,882 సెక్యూరిటీ కేసులు నమోదు చేశారు. 90,238 మందిని బైండోవర్ చేసినట్లు ప్రకటనలో పోలీసులు తెలిపారు. 8482 లైసెన్స్‌డ్ ఆయుధాలు, 11 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న 39 ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment