సాక్షి, హైదరాబాద్: పోలీసులు మళ్లీ దర్యాప్తుబాట పట్టారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వీరికి కొంచెం వెసులు బాటు లభించిందో, లేదో.. అప్పుడే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కావడానికి రాష్ట్ర పోలీసు శాఖ సమాయత్తమ వుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందస్తు, బందోబస్తు ఏర్పాట్లలో రెండు నెలలపాటు బిజీబిజీగా గడిపిన పోలీసు శాఖ ఇక పెండింగ్ కేసులపై దృష్టి పెట్టింది. షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి పోలీస్‌శాఖ మొత్తం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో సాధారణ నేరాలు, దొంగతనాలు, ఇతర మామూలు కేసులు భారీసంఖ్యలోనే నమోదయ్యా యి. ఎన్నికల హడావుడిలో ఉన్న పోలీస్ యం త్రాంగం వీటిపై పెద్దగా దృష్టి సారించలేకపోయింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తికావడంతో పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
పాత కేసులు కొలిక్కి...
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 14 వేల నాన్‌బెయిలబుల్ వారెంట్లపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్‌శాఖ రెండు నెలలపాటు చర్యలు చేపట్టింది. పదిహేను రోజుల్లోనే 11,862 నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది. దీంతో కొన్ని నేరాల్లో పెండింగ్ కేసులు పూర్తి అయినట్టేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తప్పించుకొని తిరుగుతున్న పాతనేరస్తులను బైండోవర్ చేయడంతో పెండింగ్‌లో కేసుల్లో వారిని కస్టడీలోకి తీసుకొని చార్జిషీట్ సైతం వేసేందుకు అవకాశం కలిసి వచ్చినట్టు పోలీస్ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 అక్రమ ఆయుధాల కేసులు నమోదవడం, లైసెన్స్‌డ్ ఆయుధాల డిపాజిట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం పోలీస్‌శాఖను పెద్ద ముప్పు నుంచి ఊపిరి పీల్చుకునేలా చేసింది.
నెల రోజుల్లో పూర్తి చేయాలి...
అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయని ఊపిరిపీల్చుకున్న పోలీస్‌శాఖ మరో నెలరోజుల్లో రెండు సవాళ్లను ఎదుర్కోబోతోంది. సర్పంచ్ ఎన్నికలు, ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలుండటంతో మళ్లీ భద్రత, ముందస్తు చర్యలకు రంగం సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైంది. దీంతో ఈ రెండు నెలల్లో నమోదై, పెండింగ్‌లో ఉన్న కేసులను సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పూర్తి చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు కార్యాచరణ నిర్దేశించారు. దీంతో మళ్లీ అధికారులంతా దర్యాప్తుబాట పట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ కేసులు ఓ కొలిక్కి వస్తే పనిభారం లేకుండా ఉంటుందని, దానికి తగ్గట్టు ఎస్పీలు, కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment