సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పార్టీలు, అభ్యర్థులంతా ప్రలోభాలకు తెరలేపారు. ఎన్నికలు పూర్తయ్యే 7వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్ కానుండడంతో ప్రధాన పార్టీల్లోని అభ్యర్థులంతా భారీఎత్తున మద్యం నిల్వచేసి పెట్టుకున్నారు. ఇప్పటివరకు చేసిన ఖర్చు ఒక ఎత్తు కాగా, బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు చేసే ఖర్చు మరో ఎత్తుగా భావించవచ్చు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో పాటు ఓటర్ల కోసం మద్యం, నగదు పంపిణీకి పార్టీలు, అభ్యర్థులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఓట్ల విలువ కోట్లలోనే..
ఇక ఓటర్లకు ప్రధాన ప్రలోభ అంశమైన డబ్బు పంపిణీపై అభ్యర్థులు భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో రూ.10 కోట్ల నుంచి రూ.15కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లుగా తెలిసింది. ప్రధాన పార్టీల్లో ఉన్న నేతల స్థానాల్లోనూ పోటీ తీవ్రంగా ఉండటంతో వాళ్లు సైతం భారీ మొత్తంలోనే ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, సనత్‌నగర్, ఖైరతాబాద్, ఉప్పల్ నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ రూ.15కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అదే విధంగా జిల్లాల్లో పోటాపోటీగా ఉన్న నియోజకవర్గాల్లోనూ కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, సిర్పూర్, చెన్నూర్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, పరకాల, భూపాలపల్లి, వరంగల్ వెస్ట్, ఈస్ట్, పాలకుర్తి, ఖమ్మం, పాలేరు, మధిర, సూర్యాపేట్, నల్లగొండ, ఆలేరు, కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్, మహబూబ్‌నగర్, గద్వాల్, నారాయణ్‌పేట్, కొడంగల్, తాండూర్, చేవెళ్ల తదితర నియోజకవర్గాల్లో రూ.10కోట్ల మేర ఓటర్లకు పంచేందుకు అవకాశం ఉన్నట్టు ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందినట్టు తెలుస్తోంది. ప్రచారపర్వం చివరిదశలో ఉన్న ఈ మూడు రోజుల్లోనే రూ.20కోట్ల మేర నగదు పట్టుబడటం ఇందుకు నిదర్శనమని పోలీస్ శాఖ చెప్తోంది. అయితే ఇప్పటివరకు రూ.90కోట్ల మేర నగదు పట్టుబడటం ఎన్నికల కమిషన్‌ను ఆందోళనకు గురిచేస్తుంది.
చెక్‌పోస్టుల పెంపు...
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో 500లకు పైగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లాల మధ్య సైతం 700లకు పైగా చెక్‌పోస్టులున్నాయి. జిల్లాల మధ్య ఉన్న చెక్‌పోస్టులను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ రెవెన్యూ, పోలీస్ శాఖకు సూచించినట్టు తెలుస్తోంది. గురువారం తనిఖీలు, సోదాలు ముమ్మరం చేయాలని, ప్రతి వాహనం తనిఖీ చేసేందుకు బృందాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని పోలీస్ అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. మద్యం నిల్వఉన్న ప్రాంతాలు గుర్తించి ఎక్కడికక్కడ నిలువరించాలని సూచనలు జారీచేసినట్టు తెలుస్తోంది.
ఒక్కో అభ్యర్థి వద్ద 20 లక్షల రూపాయల మద్యం...
ఓటర్ల ప్రలోభానికి కోట్లలో డబ్బు వెచ్చించే అభ్యర్థులు, మద్యం ప్రియులకోసం లక్షల రూపాయల విలువైన మద్యాన్ని దాచి ఉంచారు. ప్రధాన పార్టీల్లోని అభ్యర్థులు ఆయా గ్రామాల్లో తమకు అనుకూలంగా ఉన్న వారి ఇళ్లలో మద్యం నిల్వచేసినట్టు తెలిసింది. ఇలా ప్రతి అభ్యర్థి సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల విలువైన మద్యం పంపిణీకి సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మద్యం పంపిణీకి కొన్నిచోట్ల కూపన్ల వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. పార్టీ నేతలు ఓటర్లకు కూపన్లు ఇస్తారు, ఆ కూపన్‌తో నేతలు చెప్పే అడ్రస్ నుంచి మద్యం తెచ్చుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి కూపన్‌కు క్వార్టర్ బాటిల్ నుంచి ఆఫ్ బాటిల్ వరకు ఇచ్చేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు వ్యూహాత్మకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.12కోట్ల విలువైన మద్యం సీజ్ చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment