
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాధికారులు, పోలీసులు ఎన్నికల విధుల నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అధికారులు, పోలీసులు ఏ పార్టీ జెండా మోయడానికి వీల్లేదని పేర్కొంది. అటువంటి వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తన అధికారాలను ఉపయోగించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. అధికారులు, పోలీసులు ఏ రాజకీయ పార్టీకీ కొమ్ముకాయకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామంటూ ఈసీ ఇచ్చిన హామీని హైకోర్టు నమోదు చేసుకుంది. తనకు ఎంఐఎం నుంచి ప్రాణహాని ఉందని నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫెరోజ్‌ఖాన్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, భద్రతæ కోసం ఆయన పెట్టుకునే దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలింగ్ రోజు అభ్యర్థులు, వారి ఏజెంట్లను మినహా, మరెవరినీ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించకుండా ఈసీని ఆదేశించాలని కోరుతూ మజ్లీస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధ్యక్షుడు మజీదుల్లాఖాన్, నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫెరోజ్‌ఖాన్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే తమకున్న స్వతంత్ర అధికారులను పూర్తిస్థాయిలో ఉపయోగించామని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ ధర్మాసనానికి వాదనలు వినిపించారు. ఆ వాదనలపై «సంతృప్తిని వ్యక్తం చేసిన దర్మాసనం సీఈసీ నుంచి హామీని నమోదు చేసుకుంది. అనంతరం ఫెరోజ్‌ఖాన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటినర్‌పై ఎన్నికల సమయంలో హత్యాయత్నం జరిగిందని, ఇప్పటికీ ఓ బుల్లెట్ ఆయన శరీరంలో ఉండిపోయిందని తెలిపారు. అందుకు సంబంధించిన ఎక్స్‌రేను కోర్టు ముందుంచి పిటిషనర్‌కు భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఎక్స్‌రేను పరిశీలించిన ధర్మాసనం భద్రత కోసం పిటిషనర్ దరఖాస్తు చేసుకుంటే దానిని పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment