లక్ష మందితో భద్రత  | Security with one lakh people for Telangana Elections | Sakshi
Sakshi News home page

లక్ష మందితో భద్రత 

Published Thu, Dec 6 2018 2:10 AM | Last Updated on Thu, Dec 6 2018 2:10 AM

Security with one lakh people for Telangana Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలీస్‌ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బందోబస్తుకు రాష్ట్ర పోలీస్‌ సిబ్బందితోపాటు 6 రాష్ట్రాలు, పలు కేంద్ర బలగాల నుంచి భారీగా సిబ్బందిని రంగంలోకి దించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ విస్తృ తం చేస్తూనే అక్కడి ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శాంతి భద్రతల విభాగం ఏడీజీ జితేందర్‌ వెల్లడించారు. అన్ని జిల్లాలు, కమిషనరేట్‌లో పరిస్థితులను సమీక్షించేందుకు ప్రభుత్వ విభాగాలు, కేంద్ర సంస్థలు, సరిహద్దు రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. తీవ్రవాదుల కదలికలు, మత ఘర్షణల ప్రభావం వంటి అంశాలను సమీక్షించుకుంటూ, పోలీస్‌ విభాగం అవసరాలకు తగ్గట్లు వ్యూహరచన చేసినట్లు చెప్పారు. 414 మంది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 404 స్పెషల్‌ స్క్వాడ్స్, 3,385 సంచార బృందాలు పనిచేస్తున్నాయన్నారు. 4 వేల సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని, అందులో నల్ల గొండ, సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్‌ (కొడంగల్‌), కరీంనగర్‌ జిల్లాలున్నాయని పేర్కొన్నారు. ప్రజల్లో భద్రత పట్ల భరోసా కల్పించేందుకు 276 కేంద్ర బలగాలు (50వేల మంది), రాష్ట్ర పోలీసులు 30 వేల మంది, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, ఒడిశా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 20వేలమందిని రంగంలోకి దించినట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢఖ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

రూ.86.59 కోట్లు స్వాధీనం 
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో 11,853 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు అమలు చేసినట్లు జితేందర్‌ వెల్లడించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 1,314 కేసులు నమోదు చేశామని తెలిపారు. బుధవారానికి రాష్ట్ర పోలీసువిభాగం రూ.86,59,84,575 నగదు, రూ.2,03, 93,582 విలువగల 47,069.62 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.6,70,08,873 విలువ చేసే 146.6 గ్రాముల ప్లాటినం, 689 గ్రాముల వజ్రాలు, 17.56 కిలోల బంగారం, 106.32 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూ.60,01,677 విలువ చేసే 266.59 కిలోల గంజాయి తదితర మత్తు పదార్థాలు, రు.1,62,43,375 విలువ చేసే బహుమతులూ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తనిఖీల సందర్భంగా 17,841 సెక్యూరిటీ కేసులను నమోదు చేయగా 90,128 మందిని బైండోవర్‌ చేయడం, 8,481 లైసెన్సుడు ఆయుధాలను డిపాజిట్‌ చేసుకోవడం, 11 అక్రమ ఆయుధాలు స్వాధీ నం చేసుకున్నామన్నారు. 39 ఆయుధాల లైసెన్సులను రద్దు చేశామని తెలిపారు. 

పలు జిల్లాలకు ఇన్‌చార్జి అధికారులు.. 
ఎన్నికల నేపథ్యంలో పలువురు అధికారులను జిల్లాలకు ఇన్‌చార్జి అధికారులుగా నియమించారు. వీరిలో హైదరాబాద్‌ జిల్లాకు ఐజీ మల్లారెడ్డి, శశిధర్‌రెడ్డి, వికారాబాద్‌కు శ్రీనివాసరావు, సిద్దిపేటకు స్వాతిలక్రా, సూర్యాపేటకు షానవాజ్‌ ఖాసీం, రంగారెడ్డి జిల్లాకు పరిమళ హనానూతన్, షాద్‌నగర్‌ జానకీ షర్మిల, మేడ్చల్‌కు విజయ్‌కుమార్‌ను నియమించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ఎన్నికల రోజు అదనపు డీజీపీలు, ఇతర ఐజీలు హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులోఉండాలని, పోలీస్‌ శాఖ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement