సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతం గా నిర్వహించడానికి పలు రాష్ట్రాల నుంచి సీనియర్ ఐపీఎస్‌లు అబ్జర్వర్లుగా రాష్ట్రానికి రాబోతున్నారు. 19 నుంచి అబ్జర్వర్లు రాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉండే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం 10 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు వహిస్తారని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.
థర్డ్ పార్టీ ద్వారా సమాచారం..
ఎన్నికల ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరుపై అబ్జర్వర్లు నిఘా పెట్టనున్నారు. అలాగే ఎన్నికల్లో ఏ పార్టీ కి కొమ్ముకాయకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రతీ అధికారిపై థర్డ్ పార్టీ ద్వారా సమాచారం సేకరించడం, క్షేత్రస్థాయిలో వ్యవహరిస్తున్న తీరును పరిశీలించనున్నారు. ముందుగా పోలింగ్ కేంద్రాలు, ఆ కేంద్రాల వద్ద ఏర్పాటుచేసే భద్రతా వివరాలు, పోటీచేస్తున్న అభ్యర్థుల చరిత్ర, నియోజకవర్గాల్లోని గత ఎన్నికల తీరు తదితర అంశాలన్నింటిపై అబ్జర్వర్లకు ఈసీ బ్రీఫ్ నోట్ అందించనుంది. దీని ద్వారా ఆయా నియోజకవర్గాలు, జిల్లాల్లో ఎన్నికలు జరగబోయే తీరుపై ముందస్తు అంచనా వేసుకునేలా నోట్ రూపొందించి అందించనున్నట్టు రాష్ట్ర పోలీస్ అధికారులు తెలిపారు. ఒకవేళ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని తక్షణం తొలగించేలా ఎన్నికల కమిషన్‌కు అబ్జర్వర్లు నివేదిక అందిస్తారు.
అన్ని బృందాలతో సమన్వయం..
మద్యం, నగదు సరఫరాలను నియంత్రించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో అబ్జర్వర్లు రంగంలోకి దిగనున్నారు. అబ్జర్వర్లకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించడం, ఓటర్లతో మాట్లాడటం, నెట్‌వర్క్ ఏర్పాటుచేసుకొని జరుగుతున్న పరిణామాలపై ఎన్నికల కమిషన్‌కు నివేదికలివ్వడం చేయనున్నారు. పోలీస్ బృందాలు, రెవెన్యూ బృందాలతో మానిటరింగ్ చేస్తూ మద్యం, నగదును నియంత్రించాల్సి ఉంటుంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేం ద్రాల్లో పర్యటించి అక్కడి భద్రతా వివరాలను ఎప్పటికప్పుడు ఈసీకి తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆయా జిల్లాల్లో, ఆయా నియోజకవర్గాల్లో బైండోవర్లు చేసిన కేసులు, స్వాధీనపరుచుకున్న మద్యం, నగదు, ఆయుధాల వివరాలపై సమీక్షించడం, ఆయుధాల డిపాజిట్ పెండింగ్ ఉంటే వెంటనే వాటిపై అబ్జర్వర్లు చర్యలకు ఆదేశించవచ్చు.
ఎన్నికల కమిషన్‌కు నివేదిక: నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉన్నవారిని ఎంతమందిని కోర్టులో హాజరుపరిచారు? చేయని వారి సంగతేంటన్న అంశాలపై నివేదిక అందిస్తారు. విధుల్లో పాల్గొనే సెంట్రల్ పారామిలిటరీ, రాష్ట్ర పోలీస్ సిబ్బంది ఎన్నికల నిర్వహణ పై అవగాహన కల్పిస్తారు. చెక్‌పోస్టులు, పెట్రోలింగ్, ప్రీపో ల్ డ్యూటీలపై సంబంధిత పోలీస్ అధికారుల, ఆర్‌వోలతో సమీక్షిస్తారు. స్క్రూటినీ తర్వాత నుంచి ఎన్నికలు జరిగే వరకు ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మృతిచెందారు అంశాలపై నివేదిక ఇస్తారు. ఎందుకు అల్లర్లు జరిగాయి? అందులో రాష్ట్ర భద్రత, నిఘా వైఫల్యం ఉందా? లేదా కేంద్ర బలగాలను మోహరించడంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా అన్న అంశాలపై ఈసీకి రిపోర్టు ఇవ్వనున్నారు.
అబ్జర్వర్లు చేయకూడనివి..
- నియోజకవర్గాల్లో కుటుంబంతో కలసి పర్యటించకూడదు.
- ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడకూడదు.
- స్వతహాగా రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించరాదు.
- సదుపాయాలు, సౌకర్యాల విషయంలో అసాధారణ డిమాండ్లు చేయకూడదు.
- అబ్జర్వర్‌గా విధుల్లో చేరగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చే లోకల్ మొబైల్ నంబర్లు వాడాల్సి ఉంటంది. అదే విధంగా బ్యాంక్ డీటైల్స్‌ను ఈసీకి అందించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment