సాక్షి, వెల్దండ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు పంపిణీని అరికట్టేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. జిల్లా ముఖధ్వారం కావడంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, తదితర ప్రాంతాలను నుంచి డబ్బు, మద్యం చేరవేయకుండా పోలీస్ అధికారులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ముఖద్వారం కావడంతో వెల్దండ మండలంలోని రాఘయపల్లి వద్ద పోలీస్ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఇక్కడ రాత్రీ, పగలు తేడా లేకుండా అనుమానం వచ్చిన వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వెల్దండ, కల్వకుర్తి సర్కిల్ పరిధిలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందితో విడతల వారీగా విధులు నిర్వహించి ద్విచక్ర, లారీలు, ఆటోలు, ఎన్నికల ప్రచార వాహనాలు, కారు ఏ వాహనాన్ని వదల కుండా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు
ఎన్నికల కమిషన్ నిబంధనలను అధికారులు, పోలీసులు ప్రణాళికా ప్రకారం అమలు చేస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడిన నగదును ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందానికి అప్పగిస్తున్నారు. తనిఖీలో పట్టుబడిన డబ్బుకు సంబంధించిన ధ్రువపత్రాలు సక్రమంగా ఉంటే జిల్లా రిటర్నింగ్ అధికారుల ద్వారా ఆ డబ్బును బాధితులకు అందజేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ఆందోళన చెందుతున్న వ్యాపారులు
వాహనాలను తనిఖీ చేస్తుండడంతో వ్యాపారులు, సామాన్య ప్రజలు అందోళన చెందుతున్నారు. కల్వకుర్తి, అచ్చంపేట, వెల్దండ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు సరుకులు తీసుకెళ్లాడానికి హైదరాబాద్ వెళ్తుంటారు. వ్యాపారం కోసం అధిక మొత్తంలో డబ్బు తీసుకెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రూ.7.19లక్షల నగదు పట్టివేత
వెల్దండ మండలంలోని రాఘయపల్లి వద్ద చెక్‌పోస్టును అక్టోబర్ 21న ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కల్వకుర్తి, వెల్దండ సర్కిల్ పరిధిలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందితో ప్రతిరోజు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం రూ.7.19లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బృందానికి అప్పగించారు. లబ్ధిదారులు సరైన పత్రాలు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో చూపి నగదు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో..
ఎన్నికలు సమీపిస్తుండడంతో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశాం. రెండు బృందాలను చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాం. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఒక వ్యక్తి వద్ద రూ.50వేల కంటే ఎక్కువగా ఉండకూడదనే నిబందన ఉంది. ఇది గమనించి ప్రజలు వారి అవసరాల దృష్ట్యా రూ.50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్ల వద్దు. ప్రయాణిస్తు వాహనంలో ఎక్కువ నగదు ఉంటే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని వాటికి సంబంధించిన పూర్తి పత్రాలను చూపిస్తే వారంలోగా అధికారులు లబ్ధిదారులకు అందజేస్తారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో బెల్టుషాపులను మూసివేయించాం. అక్రమంగా మద్యం విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
– వీరబాబు, ఎస్‌ఐ వెల్దండ
జిల్లా అధికారులకు అప్పగిస్తాం
ఎన్నికలు రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో వాహనాల తనిఖీలో లభ్యమైన నగదును రంగారెడ్డి డీటీఓ జిల్లా అధికారులకు అప్పగిస్తాం. డబ్బుకు సంబంధించి పత్రాలు అక్కడ చూయించి నగదును పొందవచ్చు.
– వెంకటరమణ, ఫ్టైయింగ్‌స్క్వాడ్, వెల్దండ
Comments
Please login to add a commentAdd a comment