అడ్డాకుల స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు, నిందితురాలితో పోలీసులు
సాక్షి, అడ్డాకుల (దేవరకద్ర): రానున్న ఎన్నికల సందర్భంగా పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో పలువురు అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీస్తున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు పలు ప్రాంతాల్లో ఇప్పటికే మద్యం నిల్వలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఫిర్యాదులు అందుతుండడంతో ఎక్సైజ్, సివిల్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా అడ్డాకుల మండల కేంద్రంలోని బెల్టు షాపుల్లో మంగళవారం ఎక్సైజ్, సివిల్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్‌ఐ బధ్యానాయక్, సివిల్ ఏఎస్‌ఐ జీఆర్.సుధీర్‌తో కలిసి ఓ మహిళ ఇంట్లో సోదాలు చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 24 బీరు సీసాలు, 48 క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ధన్వాడలో...
ధన్వాడ (నారాయణపేట) : ధన్వాడలోని బురుజుగడ్డలో పోలీసులు మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ధన్వాడ వైన్స్ నుంచి ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యం తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీ చేయగా ఆటోలో తరలిస్తున్న 25 మద్యం సీసాల కాటన్లు పట్టుబడ్డాయి. ఇక సోమవారం రాత్రి 240 మద్యం సీసాలు స్వా ధీనం చేసుకున్నామని.. ఎక్సైజ్ అధికారులకు అప్పగించనున్నామని ఎస్‌ఐ రవి తెలిపారు.
మరికల్‌లో..
మరికల్ (నారాయణపేట): మరికల్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి 128 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ జానకీరాంరెడ్డి తెలిపారు. మరికల్ నుంచి బైక్‌పై మద్యం తీసుకువెళ్తుండగా వెంబడించి పట్టుకున్నామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment