సాక్షి, అమరావతి: మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు కలిసి మద్యం వినియోగదారులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఎమ్మార్పీ (గరిష్ట చిల్లర ధర) కన్నా బాగా ఎక్కువ ధరకు అమ్ముతూ వచ్చిన దాన్ని దొంగలూ దొంగలూ ఊళ్లు పంచుకున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కుల దందా నడుస్తోంది. ధరలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులే ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువ పెంచుకోమని మరీ సలహాలిచ్చి దోచుకుంటున్నారు. మామూళ్లు ఎక్కువ దండుకోవడం కోసం ఎమ్మార్పీ ఉల్లంఘనల్ని ఆ శాఖ అధికారులు ఎంచుకున్నారు.
విచ్చల విడిగా ఈవెంట్ పర్మిట్లు
రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో ఎక్సైజ్ అధికారులు విచ్చలవిడిగా ఈవెంట్ పర్మిట్లు మంజూరు చేస్తున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన రేవ్ పార్టీలో ఎక్సైజ్ శాఖ ఈవెంట్ పర్మిట్ వ్యవహారం తీవ్ర దుమారమే రేగింది. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ ఈఎస్ పర్మిట్ మంజూరు చేసిన వైనాన్ని పోలీస్ శాఖ తప్పు పట్టింది. అయితే ఈవెంట్ మంజూరు పర్మిట్‌ను విశాఖ డిప్యూటీ కమిషనర్ సమర్థించుకోవడం ఆ శాఖలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ ఒత్తిడితోనే ఈవెంట్ పర్మిట్ మంజూరు చేశామని ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈవెంట్ పర్మిట్ మంజూరు అంశాన్ని తీవ్రంగా పరిగణించి వేటు వేయాల్సిన ఉన్నతాధికారులు కేవలం విచారణతో సరిపెట్టడం ఆరోపణలకు తావిస్తోంది.
ఒక్కో దుకాణం నుంచి రూ. 20 వేల మామూళ్లు...
ఎన్నికలు ముగియడంతో మద్యం బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా రేట్లు పెంచుకునేందుకు సిండికేట్లకు అధికారులు వెసులుబాటు కల్పించారు. ప్రతిగా ప్రతి మద్యం దుకాణం నుంచి రూ.20 వేల వరకు మామూళ్లు ఇచ్చే విధంగా బేరాలు కుదుర్చుకున్నారు. సాధారణంగా ఎక్సైజ్ మామూళ్ల వ్యవహారమంతా మద్యం ఎమ్మార్పీ చుట్టూ తిరుగుతుంది. మద్యం వ్యాపారులతో కలిసి ఎక్సైజ్ అధికారులే ఎమ్మార్పీ రేట్లు పెంచుకోమని అనధికారిక ఆదేశాలు ఇవ్వడంతో మద్యం వినియోగ దారులు ఘొల్లుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఎక్సైజ్ సూపరిండెంటెంట్ ఈ మామూళ్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయంటే అధికారుల దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. ఎమ్మార్పీ వ్యవహారాలు పెచ్చుమీరడంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్ కమిషనర్ రంగంలోకి దిగారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వేసవిలో బీరుకు డిమాండ్ ఉండటంతో ఒక్కో బీరు బాటిల్‌పై రూ.50 నుంచి రూ.70 వరకు అదనంగా పెంచి వ్యాపారులు అమ్ముతున్నా.. ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.
నెలకు రూ.43 కోట్లు మామూళ్లు
ఎమ్మార్పీ ఉల్లంఘనల ద్వారా నెలకు రూ.43 కోట్లు ఎక్సైజ్ శాఖకు మామూళ్లు అందుతున్నట్లు అంచనా. ఈ మామూళ్ల ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు అందుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 4,380 మద్యం షాపులుంటే, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు గాను నెలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.43 కోట్లు వసూలు అవుతుందని గతంలో ‘కాగ్’ వెల్లడించడం గమనార్హం. ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు, కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాలు సమీక్షించి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు. అయినా మార్పురాలేదు. గుంటూరు, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై కమిషనర్ సీరియస్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment