సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘రాజు వరమిచ్చినా.. మంత్రి అడ్డుకున్నట్లు’గా ఉంది మందుబాబుల పరిస్థితి. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినట్లు ప్రకటించి మూడురోజులు గడుస్తున్నా.. సరుకుపై ధరలు తగ్గించకపోవడంపై మందుబాబులు మండిపడుతున్నారు. దీనిపై వైన్‌షాపుల యజమానులు మాత్రం తమకు కొత్త స్టాకు వచ్చేంత వరకు పాతధరలే కొనసాగుతాయని చెబుతున్నారు. ఈనెల 5 నుంచి మద్యంపై ధరలను ప్రభుత్వం సవరించింది. ఫుల్‌బాటిల్‌పై రూ.40, హాఫ్ బాటిల్‌పై రూ.20, క్వార్టర్‌పై రూ.10 చొప్పున తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని కూడా చెప్పింది. అయితే దీన్ని క్షేత్రస్థాయిలో మందుబాబులు తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో శని, ఆది, సోమ వారాల్లో మద్యం ధరలు తగ్గాయి కదా? అంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. వారికి సర్ది చెప్పడం ఎలాగో తెలియక వైన్‌షాపుల నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు.
దాదాపు పూర్తయిన లేబులింగ్..
ప్రభుత్వం మద్యం ధరలను సవరించిన ప్రతీసారి ప్రభుత్వం కొత్త లేబులింగ్‌తో మద్యం సీసాలు విక్రయిస్తుంది. ఆదేశాలు వెలువడిన అనంతరం తక్షణమే అమలు కావాలి. కానీ అప్పటికే మద్యంషాపులు కొని తెచ్చుకున్న స్టాకు అలాగే ఉండిపోయింది. చాలాషాపుల్లో స్టాకు వారం పది రోజులకు ఒకసారి మారుస్తారు. పాత ధరలకు కొన్న రేట్లకే ఆ మద్యాన్ని అమ్ముకునే వీలుంది. ఎక్కువకు కొని తక్కువకు ఎవరూ విక్రయించరు కదా! ఈ మేరకు ఎకై ్సజ్‌శాఖ కూడా వీరికి పాత స్టాకును, పాత ధరలకు విక్రయించుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఈలోపు ఐఎంల్ గోదాముల్లో ఉన్న లిక్కర్ స్టాకు లేబులింగ్ మార్చాల్సి వచ్చింది. పాత ధరలతో ఉన్న స్టాకుపై కొత్తగా సవరించిన ధరలను ముద్రించిన లేబుళ్లను వేస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌లోని వైన్‌షాపులకు వెళ్లే స్టాకుపై కొత్తగా ముద్రించిన లేబులింగ్ ప్రకారం మద్యం సీసాలు విక్రయించనున్నారు. ఈ వ్యవహారం తెలియని మందుబాబులు మాత్రం పాత ధరలకే మద్యం విక్రయిస్తున్నారంటూ యజమానులతో గొడవకు దిగుతున్నారు.
పాత ధరలకు విక్రయిస్తే చర్యలు
ధరల విషయంలో ఇప్పటికే పలువురు ఎకై ్సజ్ అధికారులకు పలువురు మద్యం ప్రియులు ఫిర్యాదులు చేస్తున్నారు. పాత లేబుల్ ఉన్నవాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని పాత స్టాకు ఉన్నంత వరకు పాత ధరలు అమలవుతాయని, కొత్త లేబులింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత పాత ధరలతో విక్రయిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నిమిషానికి 78 బీర్లు..!
వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో బీర్లకు డిమాండ్ పెరిగింది. మే మొదలైనప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని మందుబాబులు బీర్లను తెగతాగేశారు. మే 1 నుంచి 7వ తేదీల్లో రూ.23.17 కోట్ల విలువైన 65,961 కాటన్ల బీర్లు అమ్ముడుపోయాయి. కాటన్‌కు 12 బీర్లు చొప్పున మొత్తం 7,91,532 బీర్లు విక్రయించారు. ఈ లెక్కన రోజుకు 1,13,076 బీర్లు, ప్రతీ గంటకు 4,711, నిమిషానికి 78 చొప్పున బీర్లు తాగేశారు. వేసవి తాపానికి మద్యంప్రియులు అంతా బీర్లకు మారుతున్నారు. లిక్కర్ ధరలో మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం బీర్ల ధరల్లో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అయినా మందుబాబులు మాత్రం చల్లగా బీర్లను పీల్చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment