CM Jagan Guidelines In Review With Excise And SEB Departments - Sakshi
Sakshi News home page

‘మత్తు’ వదిలిద్దాం

Published Tue, Dec 20 2022 3:32 AM | Last Updated on Tue, Dec 20 2022 8:43 AM

CM Jagan guidelines in review with Excise and SEB departments - Sakshi

మరింత సమర్థంగా ఎస్‌ఈబీ
అక్రమ మద్యం, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ఇసుక అధిక ధరలకు విక్రయించడం లాంటి ఫిర్యాదులపై ఎస్‌ఈబీ అధికారులు సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఎస్‌ఈబీ మరింత సమర్థంగా పని చేయాలి. కేవలం అక్రమ మద్యం అరికట్టేందుకే పరిమితం కాకుండా మాదక ద్రవ్యాలు, గంజాయి, గుట్కాలు లాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలి. అందుకోసం స్థానిక ఇంటెలిజెన్స్‌ (నిఘా) వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఎక్సైజ్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ), పోలీసు శాఖలు మరింత సమ­న్వయంతో పనిచేసి రాష్ట్రాన్ని సంపూర్ణంగా మాదక ద్రవ్యాలు, అక్రమ మద్య రహిత ప్రాంతంగా తీర్చి­దిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యా­న్ని పూర్తిగా అరికట్టడం, సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థ బలోపేతం, కట్టుదిట్టంగా దిశ వ్యవస్థను అమలు చేయడం అత్యంత ప్రాధాన్యత అంశాలని అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.

ఈ నాలుగు అంశాలపై పోలీసు శాఖ, ఎస్‌­ఈబీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. అక్రమ మద్యం, గంజాయి నిర్మూలన చర్యలు, కేసుల నమోదు తదితర అంశాలపై సోమ­వారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీ­క్షించారు. దిశ యాప్‌ వినియోగం, కాల్స్‌పై తక్షణ స్పందన కోసం అన్ని చోట్లా మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని సూచించారు. సీఎం సమీక్షలోముఖ్యాంశాలు ఇవీ..
సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

వారంలో రెండు సమావేశాలు
మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం నిర్మూలనపై ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించాలి. అక్రమ మద్యం, గంజాయి సాగును అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ఎక్సైజ్, ఎస్‌ఈబీ శాఖలు సమీక్షించాలి. ఆ తరువాత ప్రతి గురువారం పోలీసు ఉన్నతాధికారులు సమావేశం కావాలి. జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యాన్ని అరికట్టడం, సచివాలయాల్లో మహిళా పోలీసులతో సమన్వయం, సమర్థంగా దిశ వ్యవస్థ వినియోగం తదితర అంశాలపై సమీక్షించాలి. ఇక నుంచి ఇవన్నీ క్రమ తప్పకుండా పాటించాలి.

14500 టోల్‌ఫ్రీ నంబర్‌తో హోర్డింగ్‌లు
మాదక ద్రవ్యాల దుష్ఫ్రభావాలపై ప్రచారం చేపట్టి కాలేజీలు, యూనివర్సిటీల్లో విస్లృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 14500పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతోపాటు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలను వివరిస్తూ కాలేజీలు, యూనివర్సిటీల వద్ద భారీ హోర్డింగులు ఏర్పాటు చేయాలి. ఎక్కడా, ఏ విద్యార్థీ మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాలి.

రాష్ట్రాన్ని వచ్చే మూడు నాలుగు నెలల్లో సంపూర్ణ మాదక ద్రవ్యాల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు సమన్వయంతో పని చేయాలి. మన కాలేజీలు, యూనివర్సిటీలు మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అందుకోసం అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద నెలరోజుల్లో హోర్డింగుల ఏర్పాటు పూర్తి చేయాలి. 

పటిష్టంగా మహిళా పోలీసు వ్యవస్థ
మహిళా పోలీసులు, దిశ వ్యవస్థ, యాప్‌ను ఇంకా పటిష్టం చేయాలి. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది మహిళా పోలీసులు ఉన్నారు. వీరి సేవలను వినియోగించుకుంటూ దిశ వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి. దిశ యాప్‌ డౌన్‌లోడ్స్‌ పెరగాలి.

ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు 
గంజాయి సాగు విడనాడిన వారికి వ్యవసాయం, ఇతర ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడే వారికి శాశ్వత ఉపాధి కల్పించినట్లు అవుతుంది. గంజాయి సాగుదార్లల్లో మార్పు తెచ్చేందుకు ఆపరేషన్‌ పరివర్తన్‌ పటిష్టంగా నిర్వహించాలి. 

అంతా మనవైపు చూసేలా..
మనం చేసే మంచి పనులకు అవార్డులు రావాలి. మన మాదిరిగా సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. కాబట్టి మహిళా పోలీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. దానివల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చు. దేశమంతా మనవైపు చూసే స్థాయిలో పనితీరు చూపాలి. 

2.82 లక్షల ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టా భూములు
రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు దాదాపు 2.82 లక్షల ఎకరాల ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చాం. ఆ భూముల అభివృద్ధికి తీసుకున్న చర్యలపై అధికారులు నివేదిక ఇవ్వాలి. 

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు..
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, ఎస్‌ఈబీ డైరెక్టర్‌ రమేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement