ఎక్సైజ్‌ శాఖలో ‘డబ్బుల్‌’ ధమాకా! | There is a huge demand for DC posts | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ శాఖలో ‘డబ్బుల్‌’ ధమాకా!

Published Wed, Sep 18 2024 4:28 AM | Last Updated on Wed, Sep 18 2024 4:28 AM

There is a huge demand for DC posts

పోస్టులు కావాలంటే టీడీపీ నేతలు అడిగినంత ముట్టజెప్పాల్సిందే

ఎమ్మెల్యే సిఫార్సు లేఖకో రేటు.. పోస్టింగ్‌కు మరో రేటు

రెండు రకాలుగానూ దండుకుంటున్న పచ్చ నేతలు

గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి డీసీ పోస్టులకు భారీ డిమాండ్‌

ఎమ్మెల్యే లేఖకు రూ.10–15 లక్షలు, పోస్టింగ్‌కు రూ.30 లక్షలు

ఇతర జిల్లాల్లో డీసీ పోస్టుకు రూ.20 లక్షలు, ఈఎస్‌ పోస్టుకు రూ.15 లక్షలు

కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఎస్‌ఐ, సీఐ పోస్టులకూ రేట్లు ఫిక్స్‌.. పోస్టులు కొనలేని వారికి లూప్‌లైన్‌ పోస్టులు

విశాఖపట్నం మొత్తం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి చెప్పిన వారికే..

సాక్షి ప్రతినిధి కర్నూలు/సాక్షి ప్రతినిధి, విశాఖ పట్నం: ఎక్సైజ్‌ శాఖ టీడీపీ నేతలకు కాసుల ఖజానాగా మారింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను కూటమి ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. సెబ్‌లో ఉన్న ఉద్యోగులను తిరిగి ఎక్సైజ్‌ శాఖకు పంపుతోంది. దీంతో కోరుకున్న పోస్టులు దక్కించుకునేందుకు అధికారులు.. వీరి ఆరాటాన్ని ‘క్యాష్‌’ చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ప్రాంతానికి, పోస్టుకో రేటును నిర్ణయించి భారీగా వసూళ్ల పర్వానికి తెరలేపారు. 

ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే పోస్టింగ్‌.. లెటర్‌కు, పోస్టింగ్‌కు వేర్వేరుగా టీడీపీ నేతలు డిమాండ్‌ చేసినంత కప్పం.. అడిగినంత చెల్లించలేకపోతే లూప్‌లైన్‌ పోస్టింగ్‌లు.. ఇలా అమరావతిలో ఎక్సైజ్‌శాఖ ప్రధాన కార్యాలయంలో రెండు రోజులుగా ఇదే దందా నడుస్తోంది. బేరసారాలతో కొందరు ఇప్పటికే తమకు నచ్చిన చోట పోస్టింగులు దక్కించుకోగా ఇంకొన్ని పోస్టింగులకు బేరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్సైజ్‌ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.   

సెబ్‌కు చెల్లుచీటీ ఇచ్చి.. వసూళ్ల పర్వానికి తెరలేపి..  
గత ప్రభుత్వం పల్లెల్లో బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేయడానికి, సారా తయారీని అరికట్టడానికి, గంజాయి నిర్మూలనకు సెబ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ప్రజలకు మద్యం దూరమయ్యేలా చేసేందుకు ప్రభుత్వమే పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలు నిర్వహించింది. 

బెల్ట్‌షాపుల కోసం బల్‌్కగా మద్యం బాటిళ్లను విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో సిబ్బంది అవసరం తగ్గింది. దీంతో సెబ్‌ను ఏర్పాటు చేసి ఎక్సైజ్‌ శాఖలోని 70 శాతం సిబ్బందిని అందులోకి పంపారు. బెల్ట్‌షాపులు తగ్గడంతో పల్లెల్లో మద్యం సేవించేవారి సంఖ్య తగ్గిపోయింది. తద్వారా నేరాల సంఖ్య కూడా పడిపోయింది. 

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరడంతో తిరిగి ఎక్సైజ్‌ శాఖను ఏర్పాటు చేస్తున్నారు. సెబ్‌లో విలీనమైన ఎక్సైజ్‌ అధికారులను తిరిగి మాతృశాఖలో నియమించి పాత పంథాలోనే విధులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తిరిగి ఎక్సైజ్‌ స్టేషన్లలో సీఐ, ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. 

వీటితో పాటు 26 జిల్లాలకు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌లు(ఈఎస్‌), ఉమ్మడి 13 జిల్లాలకు డిప్యూటీ కమిషనర్‌ (డీసీ)లను నియమించనున్నారు. దీంతో కోరుకున్న చోట పోస్టులు దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దలను, ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు.   

పోస్టుకో రేటు.. 
డీసీ, ఈఎస్, ఏసీలతో పాటు సీఐల నియామకాల కోసం రెండురోజులుగా అమరావతిలో కసరత్తు జరుగుతోంది. ఎక్సైజ్‌శాఖ యూనియన్‌ నాయకులు అక్కడే మకాం వేశారు. యూనియన్‌ కనుసన్నల్లోనే పోస్టింగులు ఖరారవుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ కమిషనర్‌ పోస్టు కావాలంటే స్థానిక మంత్రి లేదా ఎమ్మెల్యే సిఫార్సు లేఖ తప్పనిసరి. ఈ లేఖ కావాలంటే రూ.15 లక్షలు స్థానిక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిందే. లేఖ తీసుకొస్తే ఆపై పోస్టింగు ఇచ్చేందుకు ఎక్సైజ్‌ శాఖలోని ఓ ప్రభుత్వ పెద్దకు మరింత ముట్టజెప్పాలి. 

ఈ క్రమంలో విశాఖపట్నం, గుంటూరు, పశి్చమగోదావరి, విజయవాడ డీసీ పోస్టులకు రూ.30 లక్షలు ధర నిర్ధారించినట్లు తెలుస్తోంది. కొందరు ఇంత కంటే ఎక్కువ ఇచ్చి చేరేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తక్కిన జిల్లాల్లో డీసీ పోస్టులకు రూ.20లక్షలు, ఈఎస్‌ పోస్టులకు రూ.15లక్షలుగా ధర ఫిక్స్‌ చేశారు. ఈ మొత్తాలకు తక్కువ కాకుండా ఎవరు ఎక్కువ ఇస్తే వారికి పోస్టింగులు ఇస్తున్నారు. పోస్టింగులకు టీడీపీ ఎమ్మెల్యేల సిఫా­ర్సు లేఖలు తప్పనిసరి అని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. 

ప్రజాప్రతినిధులు యూనియన్‌ నాయకులు సిఫార్సు చేసిన వారికే లేఖలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు డీసీగా మునిచంద్రమోహన్, అనంతపురం డీసీగా నాగమద్దయ్య ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. చిత్తూరు డీసీ పోస్టు మంత్రి నారా లోకేశ్‌ సిఫార్సు చేసిన వారికే దక్కనున్నట్లు తెలుస్తోంది. కడప డీసీకి పెద్దగా పోటీ లేదని సమాచారం. అలాగే విశాఖ డిప్యూటీ కమిషనర్‌గా శ్రీరామచంద్రమూర్తి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా ఆర్‌. ప్రసాద్‌ పేరు ఖరారైందని చెబుతున్నారు. అలాగే శ్రీకాకుళం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా రామకృష్ణ ఖరారైనట్లు సమాచారం.  

కానిస్టేబుల్‌ పోస్టుకు సైతం
ఎక్సైజ్‌ స్టేషన్‌లలో సీఐ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)గా ఉంటారు. ఆయన కింద ఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు ఉంటారు. ప్రస్తుతం సీఐల పోస్టింగులకు బేరాలు నడుస్తున్నాయి. సీఐ పోస్టుకు సిఫార్సు లేఖ కావాలంటే రూ.8–10 లక్షలు సంబంధిత టీడీపీ ఎమ్మెల్యేకు ముట్టజెప్పాలని తెలుస్తోంది. రాజధానిలో పోస్టింగ్‌ కావాలంటే మరో రూ.10 లక్షలు సమర్పించుకోవాల్సిందే. స్టేషన్‌ను బట్టి ఈ ధరల్లో తేడాలు ఉన్నాయి. 

ఈఎస్‌లు.. లెటర్‌కు రూ.10 లక్షలు, రాజధానిలో పోస్టుకు రూ.15 లక్షలు ముట్టజెప్పాల్సిందేనని తెలుస్తోంది. మొదటగా డీసీలు, ఈఎస్‌లు, సీఐలను నియమించనున్నారు. ఆపై వీరు ఎస్‌ఐ నుంచి కానిస్టేబుళ్ల వరకూ నియమించుకోవచ్చు. ఈ నియామకాల్లోనే వీరు పెట్టిన పెట్టుబడిని రికవరీ చేయాలనే యోచనలో కొందరు డీసీలు, ఈఎస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

కానిస్టేబుల్‌ పోస్టుకు రూ.లక్ష, హెడ్‌ కానిస్టేబుల్‌కు రూ.1.50 లక్షలు, ఎస్‌ఐ పోస్టుకు రూ.5 లక్షలు ధర నిర్ణయించారు. తాము అడిగినంత చెల్లించలేనివారికి మొబైల్‌ పార్టీ, థర్డ్‌గ్రేడ్‌ స్టేషన్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 
 
కొత్త పాలసీలో భారీ ఆదాయం 
ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకురానుంది. టెండర్ల ద్వారా లేదా లాటరీ ద్వారా మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించనున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు ‘సిండికేట్‌’ ద్వారా మద్యం ధరలు పెంచి విక్రయాలు సాగించనున్నారు. దీంతో అధికారులకు నెలమామూళ్లు ఇస్తారు. 

తద్వారా పోస్టింగ్‌ పెట్టుబడితో పాటు భారీగానే ఆర్జించే అవకాశం ఉంది. పైగా బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా నడిచే అవకాశం ఉంది. దీంతోనే ఆదాయం ఉన్న స్టేషన్‌ల కోసం భారీగా పెట్టుబడి పెట్టి పోస్టింగులు తెచ్చుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

విశాఖలో భారీ డిమాండ్‌ 
విశాఖ ఎక్సైజ్‌ శాఖలో పోస్టింగ్‌లకు భారీ డిమాండ్‌ ఉంది. డిప్యూటీ కమిషనర్‌ నుంచి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వరకు ప్రతి చోట విపరీతమైన గిరాకీ కనిపిస్తోంది. పోస్టును బట్టి రేటు పలుకుతోంది. విశాఖ ఎక్సైజ్‌ శాఖలో డిప్యూటీ కమిషనర్‌ పోస్టు హాట్‌ సీటుగా మారిపోయింది. ఇక్కడ పోస్టింగ్‌ కోసం ఆశావహుల సంఖ్యలో కూడా ఎక్కువగానే ఉంది. 

ప్రధానంగా ముగ్గురు సీనియర్‌ అధికారులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ సూపరింటెండెంట్‌గా పని చేసి వెళ్లిన అధికారి కూడా ఈ కోవలో ఉన్నట్టు సమాచారం. అలాగే పక్క జిల్లాల నుంచి మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు 5 నుంచి 10 మంది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఈ పోస్టుకు రూ.30 లక్షలు ముట్టజెప్పేందుకు రెడీ అవుతున్నారు. 

అలా­గే ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. కీలకమైన ఆ స్థానాలను చేజిక్కించుకుంటే.. ఆ తరు­వాత జరిగే సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ బదిలీల్లో సులు­­వుగా సంపాదించుకోవచ్చని ఇప్పుడు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

స్టేషన్‌ను బట్టి రేటు 
సీఐ నుంచి కానిస్టేబుళ్ల వరకు రేటుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలు కూడా తప్పనిసరి. ఆ సిఫార్సు లేఖలకు స్టేషన్‌ను బట్టి రేటు నిర్ణయించినట్లు సమాచారం. సీఐ పోస్టింగ్‌కు రూ.5 నుంచి రూ.8 లక్షలు, ఎస్‌ఐకి రూ.2 నుంచి రూ.3 లక్షలు, హెడ్‌ కానిస్టేబుల్‌కు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలు, కానిస్టేబుల్‌ స్థాయికి రూ.50 వేలు నుంచి రూ.75 వేలు వసూలు చేస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. 

ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి నేత కీలక పాత్ర పోషిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సదరు సీఐ స్థాయి అధికారి లాబీయింగ్‌లో సిద్ధహస్తుడన్న పేరు ఉంది. కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది పోస్టింగుల విషయంలో ఎవరైనా ప్రజాప్రతినిధులను కలిస్తే.. సదరు అధికారి ద్వారా రావాలని స్పష్టంగా చెబుతున్నట్లు సమాచారం.  
 
వెలగపూడిదే రాజ్యం.. 
విశాఖపట్నం నగర పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా హవా అంతా విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చలాయిస్తున్నారు. కానిస్టేబుల్‌ నుంచి ఈసీ వరకూ పోస్టులకూ ఆయనే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. తక్కిన ఎమ్మెల్యేలు ఎవరూ లేఖలు ఇచ్చేందుకు వీల్లేదు. వీరిలో గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఉండటం విశేషం. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, వంశీకృష్ణ యాదవ్‌ కూడా ఉన్నారు. 

భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మినహా తక్కిన వారంతా తమ నియోజకవర్గాల్లో పోస్టింగ్‌ల కోసం ఎమ్మెల్యేల వద్దకు వెళ్తుంటే ‘వెలగపూడిని కలవండి’ అని వారు చెబుతున్నట్టు తెలుస్తోంది. గతంలో మద్యం సిండికేట్‌ మొత్తం వెలగపూడి కనుసన్నల్లోనే నడిచేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి ఎక్సైజ్‌ను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వ సహకారం కూడా ఉన్నట్లు 
తెలుస్తోంది.  

ఉత్తరాంధ్రలో కూడా.. 
విశాఖలో మాత్రమే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళంలో మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి. దీంతో అక్కడ పోస్టింగ్‌లకు కూడా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. 

విశాఖలో పోస్టింగ్‌ అవకాశం దక్కని వారు రెండో ఆప్షన్‌గా శ్రీకాకుళంను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ జిల్లా స్థాయిలో పోస్టింగ్‌ లభిస్తే ఒక వైపు కింది స్థాయి అధికారుల బదిలీల్లోనే కాకుండా మద్యం కంపెనీల నుంచి కూడా పెద్ద ఎత్తున లాభం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లా కూడా ఎక్సైజ్‌ అధికారులకు హాట్‌ ఫేవరెట్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement