
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్ మోగింది. ఈనెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు 14వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు వెళ్లనున్నట్టు అఖిలపక్ష కార్మిక సంఘాల నిర్ణయం తీసుకుంది. కాగా, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగి వచ్చే వరకూ సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. 14వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో రేపు కుర్మన్నపాలెంలో రాస్తా రోకో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, సమ్మెకు రాజకీయ పార్టీల మద్దతును కార్మికులు కోరుతున్నారు. ఇదే సమయంలో ఏడో తేదీన మరోసారి ఆర్‌ఎల్‌సీతో చర్చలు జరపనున్నట్టు కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ క్రమంలోనే స్టీల్‌ప్లాంట్ కార్మికులు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఇక, యాజమాన్యం దిగి వచ్చే వరకూ సమ్మె చేపట్టాలని నిర్ణయించినటఉట తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు జరిగింది. స్టీల్ ప్లాంట్ మరో 1500 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగించారు. గతంలో 1100 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిన విషయం తెలిసిందే. కార్మికుల ఆందోళన కొనసాగుతున్నప్పటికీ తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దాదాపు 4500 మందిని తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక, సీఎం చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం కార్మికుల తొలగింపు జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మిక సంఘాలు నేతలు మండిపడుతున్నారు.