కర్నూలులోని హోసన్న మందిరంలో ప్రార్థన చేస్తున్న భక్తులు
గుణదల (విజయవాడ తూర్పు)/కర్నూలు కల్చరల్/డాబాగార్డెన్స్ (విశాఖ)/ : ప్రపంచశాంతిని కాంక్షించిన శాంతిదూత.. కరుణామయుడు.. ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినం పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చర్చిలన్నీ జనసంద్రంగా మారాయి. లక్షలాది మంది భక్తులు ప్రార్థనలతో పరవశించిపోయారు. ప్రభువు చూపిన మార్గంలో పయనించాలంటూ బిషప్‌లు, పాస్టర్లు సందేశాన్నిచ్చారు.
ప్రసిద్ధ క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రం విజయవాడలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో బాలయేసును దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పశువుల పాకలో పడుకోబెట్టిన బాలయేసు స్వరూపానికి సాగిలపడి మొక్కులు చెల్లించుకున్నారు. పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు భక్తులనుద్దేశించి మాట్లాడారు. సమిష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అంబరాన్నింటిన సంబరాలు..
మరోవైపు.. విజయవాడ నగర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. పలు ప్రముఖ చర్చిల్లో సోమవారం ఉదయం సర్వమానవాళి సుఖ శాంతులతో ఉండేలా చూడాలని దైవకుమారునికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పటమట సెయింట్ పాల్ కథెడ్రల్ చర్చి, సెయింట్ పాల్స్ బసిలికా చర్చి, గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ ఎదురుగా ఉన్న సెయింట్ పాల్ సెంటినరీ చర్చిలో తెల్లవారుజాము నుంచి ఆరాధనా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో విశ్వాసులు హాజరయ్యారు.
వన్‌టౌన్ తారాపేటలోని పురాతన సెయింట్ పీటర్స్ చర్చి, సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చిలో ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక విశాఖ నగరంలోని సెయింట్ ఆంథోనీ చర్చి, ట్రినిటీ లూథరన్ చర్చి, జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ రక్షణగిరి పునీత పేతురు చర్చి, బాప్టిస్ట్ చర్చిల్లో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. క్రీస్తు స్తుతి గీతాలు భక్తుల హృదయాలను పరవశింపజేశాయి. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న చర్చిల్లోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
కర్నూలులోని బిషప్ చర్చిలో రెవరెండ్ చౌరప్ప, సీఎస్‌ఐ చర్చిలో పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్, కోల్చ్ చర్చిలో పాస్టర్ రెవరెండ్ అనిల్‌కుమార్ సామ్యేల్, రెవరెండ్ జీవన్‌రావు సందేశం వినిపించారు. యేసును గుండెల్లో నింపుకుని పొరుగు వారిని ప్రేమిస్తూ ఆపన్న సమయంలో చేతనైన సహాయ, సహకారాలందించడమే నిజమైన క్రిస్మస్ అన్నారు. నంద్యాలలోని హోలీక్రాస్ కెథడ్రల్ చర్చిలో బిషప్ రైట్ రెవరెండ్ ఐజక్ వరప్రసాద్, జోసెఫ్ బాబు, హోలీక్రాస్ కెథడ్రల్ పాస్టరేట్–2 (ఆల్‌సెయింట్ చర్చి)లో రెవరెండ్ విజయ్‌కుమార్, డీనరీ చైర్మన్ ఇమ్మానియేల్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment