మందు‘బాబు’ దందానే! | Liquor Mafia in the hands of TDP syndicate Chandrababu Govt | Sakshi
Sakshi News home page

మందు‘బాబు’ దందానే!

Published Thu, Jul 25 2024 4:34 AM | Last Updated on Thu, Jul 25 2024 4:34 AM

Liquor Mafia in the hands of TDP syndicate Chandrababu Govt

2014–19లో టీడీపీ సిండికేట్‌ గుప్పిట్లోనే మద్యం.. ఆ ఐదేళ్లలో రూ.12.50 లక్షల కోట్ల దోపిడీ

ఊరూ పేరూ లేని బ్రాండ్లు తెచ్చిందే బాబు  

పచ్చ నేతల గుప్పిట్లోనే డిస్టిలరీలు

మద్యం దందాపై వైఎస్సార్‌సీపీ ఉక్కుపాదం

నాణ్యతా ప్రమాణాల కోసం అధునాతన ల్యాబ్‌లు

2019–24 మధ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన విక్రయాలు

తేల్చి చెప్పిన ఎక్సైజ్‌ గణాంకాలు, కేంద్ర హోంశాఖ నివేదిక

సాక్షి, అమరావతి: శాసనసభ సాక్షిగా ‘పచ్చ’ దయ్యాలు వేదాలు వల్లించాయి! మద్యం సిండికేట్‌ను గుప్పిట్లో పెట్టుకుని గతంలో ఐదేళ్లూ యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబు బృందం నీతు లు వల్లిస్తోంది! ఎన్నికల హామీలను అమలు చేయలేక సాకులు అన్వేషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాల నాటకంలో బుధవారం మరో అంకానికి తెర తీశారు. ఎక్సైజ్‌ శాఖపై శ్వేతపత్రం పేరుతో అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించారు. 

కానీ 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ నేతల మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–24 వరకు దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేయడంతో విక్రయాలు తగ్గాయని ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తున్నాయి.

చంద్రబాబు ఆరోపణ: మేం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం దందాకు పాల్పడింది.
నిజం ఇదీ: టీడీపీ సిండికేట్‌ మద్యం దోపిడీకి నిదర్శనాలివిగో..
– 2014–19 మధ్య టీడీపీ మద్యం సిండికేట్‌ చెలరేగడంతో పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌ దుకాణాలతో మద్యం ఏరులై పారింది. 
– ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 వరకు జోరుగా విక్రయాలు. అనధికారికంగా 24 గంటలూ దందా.
– 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా అంతే సంఖ్యలో పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి. వీటికి తోడు 43 వేలకు పైగా బెల్ట్‌ దుకాణాలు. 
– ఎమ్మార్పీ కంటే 25 శాతం అధిక ధరలకు అమ్మకాలు. 
– ఏటా బార్ల సంఖ్య పెంపు.
– జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) నివేదిక ప్రకారం 2015–16లో ఏపీలో 34.9 శాతం మంది పురుషులకు, 0.4 శాతం మంది మహిళలకు మద్యం అలవాటు ఉంది.

పచ్చ సిండికేట్‌ దోపిడీ రూ.12.50 లక్షల కోట్లు
మద్యం దందాను వ్యవస్థీకృతం చేసి రూ.12.50 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డ చరిత్ర చంద్రబాబు సర్కారుదే. 2014 నుంచి 2019 వరకు మద్యం సిండికేట్‌ను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో ఉంచుకుని బడి, గుడి అనే  విచక్షణ లేకుండా విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులిచ్చేశారు. పర్మిట్‌ రూమ్‌ల పేరుతో అనధికారిక బార్లను తెరిచేసి మరో 43 వేల బెల్ట్‌ దుకాణాలను నెలకొల్పి ఏరులై పారించారు. ఎంఆర్‌పీ కంటే రూ.10 నుంచి రూ.25 వరకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల చొప్పున ఐదేళ్లలో ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు కొల్లగొట్టారు.

చంద్రబాబు ఆరోపణ : ఊరూ పేరూ లేని బ్రాండ్లు తెచ్చారు..
నిజం: అవన్నీ మీరు తెచ్చిన బ్రాండ్లే చంద్రబాబూ!
– ప్రెసిడెంట్‌ మెడల్, హైదరాబాద్‌ బ్లూ డీలక్స్‌ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు.
– గవర్నర్‌ రిజర్వ్, లెఫైర్‌ నెపోలియన్, ఓక్టోన్‌ బారెల్‌ ఏజ్డ్, సెవెన్త్‌ హెవెన్‌ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకూ టీడీపీ సర్కారే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది. 

– హైవోల్టేజ్, వోల్టేజ్‌ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్‌ ఎంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, బ్రిటీష్‌ ఎంపైర్‌ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం బాబు సర్కారు నిర్వాకాలే.
ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్‌ 7న అనుమతి జారీచేసింది.

– రాయల్‌ ప్యాలెస్, న్యూకింగ్, సైన్‌ అవుట్‌ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు.
– బిరా –91 పేరుతో మూడు రకాల బీర్‌ బ్రాండ్లకు 2019 మే 14న చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. అప్పటికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇంకా అధికారం చేపట్టలేదు. 
– ఆ మర్నాడే టీఐ మ్యాన్షన్‌ హౌస్, టీఐ కొరియర్‌ నెపోలియన్‌ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతినిచ్చిందన్నది నిఖార్సైన నిజం!

చంద్రబాబు ఆరోపణ: డిస్టిలరీలన్నీ లాక్కున్నారు..
నిజం: ఆ డిస్టిలరీలన్నీ మీరు అనుమతిచ్చినవే... మీ వాళ్లవే చంద్రబాబూ!!
రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వలేదు.

మద్యం తయారీ డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుయాయుల గుప్పిట్లోనే ఉన్నాయన్నది నిజం. ఆ డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చిందీ కూడా గతంలో టీడీపీ ప్రభుత్వమే. ఆ డిస్టిలరీలు తయారు చేసిన మద్యాన్నే గతంలో టీడీపీ హయాంలో విక్రయించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ హయాంలోనూ అదే మద్యాన్నే విక్రయించారు. మరి అందులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్తగా చేసిన అక్రమం ఏముందీ? టీడీపీ అధికారంలో ఉంటే మద్యం నాణ్యమైనదని.. లేదంటే నాసిరకమని దుష్ప్రచారం చేయడం చంద్రబాబు బృందానికి, పచ్చ మీడియాకే చెల్లింది.

పచ్చ ముఠాదే మద్యం దందా..
రాష్ట్రంలోని డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు, టీడీపీ ఎమ్మెల్యే పుట్టా మధుసూదన్‌ యాదవ్‌ కుమారుడు, ప్రస్తుతం ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ది. 

– శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులనాయుడు కుటుంబానిది. 
– ఎస్పీవై ఆగ్రో ప్రొడక్టŠస్‌ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలోకి ఫిరాయించినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి నాడు చంద్రబాబు అనుమతిచ్చారు. 
– గత ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019 ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో అప్పటి మంత్రి, ప్రస్తుత స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వాటాదారుగా ఉన్నారు.

చంద్రబాబు ఆరోపణ: మేనిఫెస్టోలో హామీని వైఎస్సార్‌సీపీ ఉల్లంఘించింది..
నిజం: దశలవారీ మద్య నియంత్రణను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసింది. 
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం దందాపై ఉక్కు పాదం మోపింది. ప్రైవేట్‌ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వపరం చేశారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. మద్యం దుకాణాల వేళలను కుదిస్తూ ఉ.10 నుంచి రాత్రి 9 వరకే పరిమితంగా విక్రయాలకు అనుమతించారు. 4,380 పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేశారు. 43 వేల బెల్ట్‌ దుకాణాలను పూర్తిగా తొలగించారు. 

కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు షాక్‌ కొట్టేలా ధరలు పెంచారు. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిచ్చాయి. టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు సగానికి పడిపోయాయి.

ఏపీలో మద్యం వినియోగం తగ్గింది
– కేంద్ర ప్రభుత్వ నివేదిక
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వినియోగం తగ్గిందని కేంద్ర ప్రభుత్వమే వెల్లడించడం గమనార్హం. మద్యం అలవాటు 2015–16లో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం ఉంది.  2019–21 మధ్య పురుషుల్లో ఈ అలవాటు 31.2 శాతానికి,  మహిళల్లో 0.2 శాతానికి తగ్గినట్లు పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

చంద్రబాబు ఆరోపణ: నాణ్యత లేని మద్యంతో వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింది.
నిజం: వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో మద్యం నాణ్యతపై టీడీపీ గత ఐదేళ్లూ పదేపదే సాగించిన దుష్ప్రచారం బెడిసికొట్టింది. నాడు మద్యంలో విషపు అవశేషాలు ఉన్నట్లు చెన్నైలోని ఎస్‌జీఎస్‌ లేబొరేటరీ పేరిట ఓ తప్పుడు నివేదికను టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అయితే అలాంటి నివేదికేదీ తాము ఇవ్వలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కాని సహజ సిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని ఆ లేబొరేటరీ ప్రకటించింది. 

తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది. అయినప్పటికీ రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)కు చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ ల్యాబ్‌లో పరీక్షించింది. ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని నివేదిక ఇచ్చింది.

– 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం నాణ్యత పరీక్షలు తూతూ మంత్రంగా నిర్వహించారు. ఆ ఐదేళ్లలో 96,614 శాంపిల్స్‌ మాత్రమే సేకరించి పరీక్షించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం నాణ్యత పరీక్షల కోసం బెవరేజస్‌ కార్పొరేషన్‌ రూ.12.5 కోట్లతో అత్యాధునిక లేబరేటరీలను ఏర్పాటు చేసింది. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్‌ను పరీక్షించారు.

రాష్ట్రంలో మద్యం డిస్టిలరీలకు ఎప్పుడెప్పుడు అనుమతులు ఇచ్చారంటే...
1. కాంటినెంటల్‌ వైన్స్, ఆటోనగర్, విజయవాడ, 1971, ఆగస్టు 9
2. బీఆర్కే స్పిరిట్స్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 1998, సెప్టెంబరు 15
3. పెర్ల్‌ డిస్టిలరీ లిమిటెడ్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, 1997, ఆగస్టు 14
4. సోరింగ్‌ స్పిరిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, చేబ్రోలు, తూ.గోదావరి జిల్లా, 2007, నవంబరు 7
5. సెంటిని బయో ప్రొడక్టŠస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, గండేపల్లి, కృష్ణాజిల్లా 2010, జూన్‌ 9
6. బీవీఎస్‌ డిస్టిలరీస్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 2017, జనవరి 2
7. శ్రావణి ఆల్కో బ్రూ ప్రైవేట్‌ లిమిటెడ్, గంపలగూడెం, కృష్ణాజిల్లా, 2017, సెప్టెంబరు 29
8. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, వంగూరు, ప.గోదావరి జిల్లా, 1997, నవంబరు 17
9. జీఎస్‌బీ అండ్‌ కో, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2008
10. బీడీహెచ్‌ ఆగ్రో వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కొప్పరం, తూ.గోదావరి జిల్లా,  2017, ఆగస్టు 25
11. విశాఖ డిస్టిలరీస్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2019, ఫిబ్రవరి 25
12. పీఎంకే డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2017, అక్టోబరు 23
13. ఈగిల్‌ డిస్టిలరీస్, తాడిగొట్ల, కడప, 1974, అక్టోబరు
14. ఎస్వీఆర్‌ డిస్టిలరీస్, తిరుపతి, 1982
15. శ్రీకృష్ణా ఎంటర్‌ప్రైజెస్, తిమ్మ సముద్రం, చిత్తూరు జిల్లా, 1998, జులై
16. ఎస్‌ఎన్‌జే సుగర్స్, ప్రొడక్ట్స్, వెంకటాచలం, నెల్లూరు జిల్లా, 2018, మే
17. మోహన్‌ బెవరేజస్‌ అండ్‌ డిస్టిలరీస్‌ లిమిటెడ్, పల్లూరు, చిత్తూరు జిల్లా, 1978
18. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, నంద్యాల, కర్నూలు జిల్లా, 2016, సెప్టెంబరు
19. ఖోడేస్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కుప్పం, చిత్తూరు జిల్లా, 1970
20. ప్రాగ్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నల్లమిల్లి, తూ.గోదావరి జిల్లా, 1997, మార్చి 31.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement