AP Should Become Narcotics Free State Says CM Jagan at SEB Review - Sakshi
Sakshi News home page

నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఏపీ.. ఆపరేషన్‌ పరివర్తన్‌ కూడా!

Published Mon, Dec 19 2022 3:44 PM | Last Updated on Mon, Dec 19 2022 4:50 PM

AP should become narcotics free state Says CM Jagan At SEB Review - Sakshi

సాక్షి,  తాడేపల్లి : రాష్ట్రంలో ఎక్సైజ్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) పనితీరు పైన సోమవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారాలని ఈ సమావేశంలో ఆయన ఆకాంక్షించారు. ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దు.. ఆ లక్ష్యంతోనే పని చేయాలంటూ పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు కలిసి పని చేయాలంటూ ఆయన సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. 

ఎస్‌ఈబీ సమీక్ష సందర్భంగా.. నార్కొటిక్స్‌తో పాటు అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడం, మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం.. యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడం.. ఈ నాలుగింటిపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అలాగే.. రాష్ట్రాన్ని నార్కొటిక్స్‌ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దడంలో ఎక్సైజ్, ఎస్‌ఈబీ అధికారులతో పోలీస్‌ శాఖ మరింత సమన్వయంతో పని చేయాలని కోరారు. అదే విధంగా దిశ యాప్‌ వినియోగం, కాల్స్, వేగంగా స్పందించడం వంటి వాటిపై అన్ని చోట్లా మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని సీఎం జగన్‌ సూచించారు. 

ఇకపై వారంలో రెండు సమావేశాలు
మరింత సమర్థవంతంగా పని చేసేందుకు ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అక్రమ మద్యం నియంత్రణ దిశలో ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌ అధికారులు తీసుకున్న చర్యలు, గంజాయిసాగు అరికట్టడంపై సమీక్షించాలన్నారు. అలాగే.. ప్రతి గురువారం పోలీస్‌ ఉన్నతాధికారులు సమావేశం కావాలన్నారు. జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి.. నార్కొటిక్స్, అక్రమ మద్యాన్ని అరి కట్టడం, సచివాలయాల మహిళా పోలీసులతో సమన్వయం, దిశ చట్టం, యాప్‌ ఇంకా సమర్థ వినియోగంపై సమీక్షించాలని,  ఇక నుంచి ఇవన్నీ రెగ్యులర్‌గా జరగాలని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. 

కాలేజీలు, వర్సిటీల్లో ప్రచారం
ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌.. 14500తో పాటు, నార్కొటిక్స్‌ నియంత్రణపై అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద పెద్ద హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు నార్కొటిక్స్‌ వినియోగించకుండా అరికట్టాలని సీఎం జగన్‌ కోరారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చి దిద్దాలని ఆయన ఆకాంక్షించారు. అదే లక్ష్యంతో పోలీస్, ఎక్సైజ్‌ శాఖ అధికారులు పని చేయాలని కోరారు. మన యూనివర్సిటీలు, కాలేజీలు.. అన్నీ జీరో నార్కొటిక్స్‌గా ఉండాలి. అదే ఆయా శాఖల లక్ష్యం కావాలి. ఇందు కోసం నెల రోజుల్లో అన్ని కాలేజీలు, వర్సిటీల్లో హోర్డింగ్‌ల ఏర్పాటు పూర్తి కావాలి అని చెప్పారు.

పటిష్టం చేయండి
మహిళా పోలీసులు, దిశ చట్టం, యాప్‌ను ఇంకా పటిష్టం చేయాలి. మహిళా పోలీసుల పనితీరు ఇంకా మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది మహిళా పోలీస్‌లు ఉన్నారు. ఇంకా దిశ చట్టాన్ని ఇంకా బాగా అమలు చేయాలి. యాప్‌ డౌన్‌లోడ్స్‌ పెరగాలి అని సీఎం జగన్‌.. సంబంధిత అధికారులకు తెలిపారు.

ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి:
గంజాయిసాగుదార్లకు వ్యవసాయం, పాడి వంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలి. అప్పుడు వారికి శాశ్వత ఉపాధి కల్పించినట్లు కూడా అవుతుంది. గంజాయి సాగుదార్లను మార్చే విధంగా, ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ నిర్వహించాలని సీఎం జగన్‌ సూచించారు.

ఎస్‌ఈబీ ఇంకా సమర్థంగా..
అక్రమ మద్యం గురించి కానీ, పబ్లిక్‌ ప్లేసెస్‌లో మద్యపానం కానీ.. ఇసుక ఎక్కువ ధరకు అమ్మడం కానీ.. ఇలా దేనిపై ఫిర్యాదు వచ్చినా ఎస్‌ఈబీ అధికారులు వెంటనే స్పందించాలి. తగిన చర్య తీసుకోవాలి. ఆ విధంగా ఎస్‌ఈబీ మరింత సమర్థంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఎస్‌ఈబీ పరిధి కేవలం లిక్కర్‌ వరకే కాకుండా నార్కొటిక్స్, గంజాయి, గుట్కాలు.. వంటి వాటి విషయాల్లో కూడా కఠినంగా వ్యవహరించాలి. లోకల్‌ ఇంటలిజెన్స్‌ను (నిఘా)ను బాగా వినియోగించుకోవాలి.

ప్రత్యేక గుర్తింపు రావాలి..
మనం చేసిన పనుల వల్ల అవార్డులు రావాలి. దేశంలో ఎక్కడ మన మాదిరిగా సచివాలయాల్లో మహిళా పోలీసులు లేరు. కాబట్టి వారిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. దాని వల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చు. దేశమంతా మనవైపు చూసేలా మన చర్యలు ఉండాలి. ఆ స్థాయిలో పనితీరు చూపాలి.

ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా భూములు.. 
రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు 2.82 లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామన్న సీఎం, ఆ భూముల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, అక్రమ మద్యం నియంత్రణ, ఆ దిశలో తీసుకున్న చర్యలు, గంజాయి సాగు ధ్వంసం, ఆ సాగుదార్లపై తీసుకున్న చర్యలు, కేసుల నమోదు.. వంటి అన్నింటిపై సమీక్షలో అధికారులు వివరించారు. 

ఎస్‌ఈబీ సమీక్ష సమావేశానికి.. డిప్యూటీ సీఎం (ఎక్సైజ్‌) కే. నారాయణ స్వామి, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ కేవి. రాజేంద్రనాథ్‌ రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, ఎస్‌ఈబీ కమిషనర్‌ ఏ.రవిశంకర్, ఎస్‌ఈబీ డైరెక్టర్‌ రమేష్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement