ఏపీ: మద్యం.. తగ్గుముఖం | CM YS Jagan Comments on activities of Special Enforcement Bureau | Sakshi
Sakshi News home page

CM YS Jagan Review ఏపీ: మద్యం.. తగ్గుముఖం

Published Fri, Sep 24 2021 1:53 AM | Last Updated on Fri, Sep 24 2021 7:13 PM

CM YS Jagan Comments on activities of Special Enforcement Bureau - Sakshi

అక్రమ మద్యంపై ఉక్కుపాదం
బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూములను మూసేయించడం, దుకాణాల సంఖ్యను తగ్గించడంతో పాటు.. విక్రయాల సమయాన్ని కుదించాం. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. ఈ సమయంలో రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలి రాకుండా చూడాలి. ఎక్కడైనా తయారు చేస్తుంటే చర్యలు తీసుకోవాలి. కాలేజీలు, యూనివర్సిటీలకు సమీపంలో గంజాయి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో నిఘా పెట్టాలి. గంజాయి సాగును గుర్తించి, ఎప్పటికప్పుడు ధ్వంసం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: అక్రమ మద్యం తయారీ, రవాణాతో పాటు గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులను ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దానిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యకలాపాల ప్రగతిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, 4,379 మద్యం షాపులను 2,975కు కుదించి.. మూడింట ఒక వంతు దుకాణాలను మూసి వేశామని తెలిపారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం

43 వేల బెల్టు షాపులను తీసేయడంతో పాటు 4,379 పర్మిట్‌ రూమ్‌లను మూసి వేయించడం వల్ల రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఇది వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించే వారని, ఈ సమయాన్ని ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేశామని చెప్పారు. ఈ చర్యలన్నింటితో లిక్కర్‌ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు, బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయని వివరించారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం
► గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలి. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించి గంజాయి తోటలను ధ్వంసం చేయాలి. పోలీసు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. 
► డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపై పర్యవేక్షణ ఉండాలి. 
► దీనిపై కార్యాచరణ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో తెలియజేయాలి. ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపై దృష్టి పెట్టాలి.

ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు
► నిర్ధేశించిన రేట్ల కన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలి. ఎస్‌ఈబీ కాల్‌ సెంటర్‌ నంబర్‌పై విస్తృత ప్రచారం కల్పించాలి. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్‌ చేసేలా జిల్లాల వారీగా ప్రచారం చేయాలి.
► వచ్చే కాల్స్‌పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆయా జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే.. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలి. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలి. 
► ఈ సమీక్షా సమావేశంలో ప్లానింగ్‌ అండ్‌ రిసోర్స్‌ మొబలైజేషన్‌ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్, ఎస్‌ఈబీ డైరెక్టర్‌ (స్పెషల్‌ యూనిట్స్‌) ఏ రమేష్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
తూర్పు గోదావరి జిల్లాలో బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న పోలీసులు (ఫైల్‌) 

కేసుల వివరాలు ఇలా..
► మద్యం అక్రమ రవాణా, తయారీపై నమోదైన కేసులు : 1,20,822  
► అరెస్ట్‌ అయిన నిందితులు : 1,25,202 
► 2020లో ఎక్సైజ్‌ శాఖ నమోదు చేసిన కేసులు : 63,310 
► 2021లో ఎక్సైజ్‌ శాఖ నమోదు చేసిన కేసులు : 57,512 
► ఎస్‌ఈబీ నమోదు చేసిన కేసులు : 74,311   
► పోలీసులు నమోదు చేసిన కేసులు : 46,511 
► సీజ్‌ చేసిన అక్రమ మద్యం (లీటర్లు) : 8,30,910 
► స్వాధీనం చేసుకున్న నాటుసారా (లీటర్లు) : 8,07,644 
► ధ్వంసం చేసిన బెల్లం ఊట (లీటర్లు) : 2,30,48,401
► సీజ్‌ చేసిన వాహనాలు : 29,491 
► ఇసుక అక్రమ రవాణాపై నమోదైన కేసులు : 12,211 
► అరెస్ట్‌ అయిన నిందితులు : 22,769 
► స్వాధీనం చేసుకున్న ఇసుక (టన్నులు) : 5,72,372 
► స్వాధీనం చేసుకున్న వాహనాలు : 16,365
► గంజాయి సాగు, రవాణాపై నమోదైన కేసులు : 220 
► అరెస్ట్‌ అయిన నిందితులు : 384 
► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 18,686 
► 2021 మార్చి 20 నుంచి 2021 మార్చి 31 వరకు ఆపరేషన్‌ నయా సవేరా కింద నమోదైన కేసులు : 69 
► అరెస్ట్‌ అయిన వారు : 174  
► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 2,176 
► అవేర్‌నెస్‌ క్యాంపులు : 330    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement