Cannabis cultivation
-
గ్యారంటీల అమలుకు గంజాయి సాగు.. కాంగ్రెస్ సర్కార్‌కు బీజేపీ మద్దతు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపే లక్క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంటూ ప్రజలపై పథకాల వర్షం కురిపించింది. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఆర్థిక నష్టాల కారణంగా హామీలను తీర్చడంలో భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌లో గంజాయి సాగుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఏడాదికి రూ.2000 కోట్లు సమకూరుతాయని అంచనా వేసుకుంది.అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం గంజాయి సాగు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం సూచన మేరకు రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా కమిటీ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం.ఇక.. ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేయాలని నిపుణుల బృందం ప్రతిపాదన చేసినట్టు మంత్రి నేగి తెలిపారు. గంజాయి సాగు సులభం కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. గంజాయి సాగుకు అనుమతించేందుకు నార్కోటిక్ నిబంధనలను(ఎన్డీపీఎస్ చట్టం) సవరించాలని నిపుణుల కమిటీ సూచించినట్టు చెప్పుకొచ్చారు.ఈ కమిటీ హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించి.. ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం గంజాయి సాగును ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. అంతేకాకుండా జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు విజయవంతమైన నమూనాలను కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే హిమాచల్ ప్రదేశ్‌లో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించినట్లు నేగి స్పష్టం చేశారు.వైద్యంలో గంజాయి వాడకం..గంజాయిని కేవలం మాదక ద్రవ్యంగా సేవించడమే కాకుండా పలు ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. మూర్ఛ, మానసిక అనారోగ్యం, క్యాన్సర్ రోగులకు గంజాయి మొక్కలోని మత్తు లేని భాగాన్ని తీసుకుని చికిత్స చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. గంజాయి మొక్కలో రెండు రకాల రసాయనాలను గుర్తించారు. ఒకటి టెట్రాహైడ్రోకాన్నబినాల్(టీహెచ్‌సీ), మరొకటి కాన్నబిడాల్(సీబీడీ). టీహెచ్‌సీ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో గంజాయి మొక్కను నార్కోటిక్ పంటగా కూడా పిలుస్తారు. కాన్నబిడాల్లో ఎలాంటి మత్తు పదార్థాలు ఉండవు. గంజాయి మొక్కలోని ఈ రసాయనాన్ని వైద్యంలో వాడుతున్నారు. నేషనల్ బొటానికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గంజాయి మొక్క నుంచి 25వేలకు పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.చట్టం ఏం చెబుతోంది?మన దేశంలో ఎన్డీపీఎస్ యాక్ట్-1985 ప్రకారం, హెరాయిన్, మార్ఫిన్, గంజాయి, హశిష్, హశిష్ ఆయిల్, కొకైన్, మెఫిడ్రిన్, ఎల్ఎస్డీ, కేటమైన్, అంఫెటమైన్ లాంటి మత్తు పదార్థాల ఉత్పత్తి, రవాణా, అమ్మకం చట్టవిరుద్ధం. ఈ యాక్ట్‌లోని 20వ సెక్షన్ ప్రకారం గంజాయిని అక్రమంగా సాగు చేస్తే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.అయితే, గంజాయి సాగుపై దేశమంతటా నిషేధం ఉన్నప్పటికీ, ఈ విషయంలో చట్టాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంది. దేశంలో ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే గంజాయి సాగుకు షరతులతో కూడా అనుమతులు ఉన్నాయి. యూపీ, జమ్మూకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాల్లో పరిశోధనాపరమైన అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు అనుమతి ఉంది. గంజాయి పంటను ఏడాదిలో రెండు సార్లు పండించవచ్చు.అమెరికాలో ఇలా.. ప్రపంచంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం తప్పేం కాదు. అలాగే గంజాయిని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం.. 88 శాతం అమెరికన్లు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వద్దని కోరారు. తాజాగా బైడెన్ హయాంలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్ నుంచి షెడ్యూల్-1 డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి చేర్చుతున్నారు. -
అక్రమ మద్యం, గంజాయిపై నిఘా పెంచండి: కేఎస్ జవహర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీస్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అక్రమ మద్యం, గంజాయి తదితర మాదక ద్రవ్యాల రవాణా, వాడకంపై ఉక్కుపాదం మోపేందుకు సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో సమన్వయం చేసుకోండి. వీటితో సంబంధం ఉన్న కింగ్ పిన్‌లను గుర్తించి పీడీ యాక్టు కింద అరెస్టు చేయండి. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులలో నిఘాను మరింత పటిష్టం చేయండి. ముఖ్యంగా గంజాయి సాగు చేసే గిరిజనులను ఆపరేషన్ పరివర్తన్ కింద ప్రత్యామ్నయ పంటల సాగు వైపు ప్రోత్సహించండి. ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వచ్చే అవకాశాలున్నందున సరిహద్దులతో పాటు రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల్లో నిఘాను అధికం చేసి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. ఎస్ఈబీ కమిషనర్ యం.రవిప్రకాశ్ మాట్లాడుతూ.. గంజాయికి సంబంధించి 90 శాతం ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా నుంచి.. 10 శాతం కోరాపుట్ నుంచి ఏపీలోకి వస్తోందని తెలిపారు. ఒడిశా డీజీపీ సమన్వయంతో గంజాయి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి 25 మంది కింగ్ పిన్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.4.38 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. మద్యం సరఫరాకు సంబంధించి రాష్ట్రంలోని ప్రతి డిస్టిలరీకి ఒక సహాయ కమిషనర్ స్థాయి అధికారిని ఇన్చార్జ్గా పెట్టామని చెప్పారు. మద్యం రవాణా చేసే వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అధికారులు దేవకుమార్, వాసుదేవరావు, రజత్ భార్గవ, డా.మల్లిఖార్జున, ఢిల్లీ రావు, రవిశంకర్ అయ్యన్నార్, కాంతిరాణా టాటా, విజయ సునీత, రవి సుభాష్, తుహిన్ సిన్హా, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దు రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్.జవహర్‌రెడ్డి ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ‘నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయండి. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు.. ప్రతిరోజూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలి. తాగునీటి సరఫరా విధానాన్ని పర్యవేక్షించేందుకు రూపొందించిన యాప్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి’ అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. 9 జిల్లాల్లో తాగునీటికి ఇబ్బంది లేదని కలెక్టర్లు నివేదించినట్లు చెప్పారు. మిగిలిన 17 జిల్లాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపేందుకు అవసరమైన నీటిని కాలువల ద్వారా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రూపొందించిన యాప్‌ను శుక్రవారం అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామ స్థాయిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధిత ఇంజనీర్ ఆమోదంతో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా డిమాండ్‌ను యాప్‌లో అప్లోడ్ చేసి జిల్లా కలెక్టర్ ద్వారా పంపిస్తే ఆమోదిస్తామని తెలిపారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, నారాయణరెడ్డి, జాన్ సత్యరాజ్, బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు. -
కుదుళ్లు కట్టి... డ్రిప్ పెట్టి!
సాక్షి, హైదరాబాద్: అడవి మధ్యలో ఉన్న చదునైన ప్రాంతాల్లో చెల్లాచెదురుగానో, కొండ వాలుల్లోనే గంజాయిని సాగుచేయడం ఇప్పటివరకు వింటూనే ఉన్నాం. పోలీసులు, ప్రత్యేక బలగాలు ఈ తోటల్ని గుర్తించినప్పుడు వీటిని ధ్వంసం చేస్తుంటారు. అయితే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ‘డ్రగ్ డిస్ట్రిబ్యూటర్’ ఎన్.ప్రవీణ్‌కుమార్‌ను విచారించినప్పుడు విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రంగా జరుగుతున్న గంజాయి సాగులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆధారాల కోసం అన్వేషిస్తుంటే... హైదరాబాద్ నుంచి విశాఖ ఏజెన్సీకి పెట్రోలియం ఈథర్... అక్కడ నుంచి సిటీకి హష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తున్న కుత్బుల్లాపూర్ వాసి ప్రవీణ్ కుమార్‌ను హెచ్–న్యూ మంగళవారం అరెస్ట్ చేసింది. ప్రవీణ్ దందాలకు సంబం«ధించిన ఆధారాల కోసం అన్వేషిస్తూ అతడి ఫోన్‌ను తనిఖీ చేసింది. అందులో కొన్ని తోటలకు సంబంధించిన వీడియోలను గుర్తించింది. కొండలకు సమీపంలో చదునైన ప్రాంతంలో ఉన్న అక్కడి మొక్కలకు కుదుళ్లు కట్టి ఉండటం, నీటి సరఫరా కోసం డ్రిప్ ఇరిగేషన్ పైపులు ఏర్పాటు చేయడం చూసింది. అక్రమార్జన ద్వారా అతడు కూడబెట్టిన సొమ్ముతో దాన్ని ఖరీదు చేసినట్లు భావించింది. దీనిపై ప్రవీణ్‌ను ప్రశ్నించగా... అది ఏజెన్సీలోని గూడెం మాడుగుల మండలంలోని అలగం గ్రామంలో అడవి మధ్యలో గిరిజనులు సాగుచేస్తున్న గంజాయి పంట అని అతడు చెప్పగా, అవాక్కవడం అధికారుల వంతయింది. అరెస్టు అయితే బెయిల్ ఇప్పిస్తాడు సాధారణంగా డ్రగ్స్‌వంటి అక్రమ దందాలు చేసే వాళ్లు ‘క్యాష్ అండ్ క్యారీ’ లేదా అడ్వాన్స్ చెల్లిస్తేనే సరుకు సరఫరా వంటి విధానాలను అవలంబిస్తుంటారు. వీరికి రెగ్యులర్ కస్టమర్లు తక్కువ కావడంతో ఈ పంథా అనుసరిస్తారు. అయితే ప్రవీణ్ మాత్రం తన హష్ ఆయిల్ దందాను క్రెడిట్ విధానంలోనూ చేస్తున్నాడు. నగరంలో ఉన్న 15 మంది పెడ్లర్స్ (అక్రమరవాణా చేసేవారు)కు వాళ్లు ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా 20 నుంచి 30 డబ్బాల (ఒక్కోటి 5 ఎంఎల్) హష్ ఆయిల్ ముందే సరఫరా చేస్తాడు. దాన్ని వాళ్లు అమ్ముకున్న తర్వాత ప్రవీణ్‌కు డబ్బు చెల్లిస్తుంటారు. ఇతడి వద్ద పెడ్లర్స్‌గా పనిచేస్తున్న వారిలో ఎవరైనా అరెస్టు అయితే...వారికి బెయిల్ కూడా ఇప్పిస్తుంటాడు. అతడి వాట్సాప్‌లోని ఓ సందేశం ఆధారంగా పోలీసులు ఈ విషయం గుర్తించారు. ఇతడి వద్ద పనిచేసే విక్రమ్ అనే సరఫరాదారుడిని బెంగళూరు పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడికి బెయిల్ ఇవ్వడానికి అదే నగరానికి చెందిన ఓ లాయర్‌తో ప్రవీణ్ సంప్రదింపులు జరిపాడు. అందుకు అవసరమైన ఖర్చులను కూడా పంపించాడు. ఇతడి వ్యవహారాలు, నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో గుర్తించడానికి మరోసారి విచారించాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
‘మత్తు’కు ముకుతాడు.. ఏపీ సర్కార్ చర్యలతో అడ్డుకట్ట
అది ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కొండల్లో 50 గడపలు ఉన్న గిరిజన గూడెం చిన వాకపల్లి. ఈ ఊళ్లోని గిరిజనులు ప్రస్తుతం 150 ఎకరాల్లో రాగులు, పసుపు, మొక్క జొన్న, వరి, కందులు తదితర సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఇక్కడ ఈ పంటలన్నీ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఈ ఏడాదే సాగు చేయడం. అక్రమం అని తెలిసినా నాలుగు దశాబ్దాలుగా బతుకుదెరువు కోసం గంజాయి సాగే వారికి ఆదరవుగా నిలిచింది. అప్పట్లో పోలీసులకు చిక్కి నెలల తరబడి జైళ్లలో మగ్గిందీ ఈ గిరిజన బిడ్డలే. అయితే అదంతా గతం. ప్రభుత్వ చర్యల వల్ల పచ్చటి పంటలతో ఏవోబీ ముఖ చిత్రం మారిపోయింది. (ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి వడ్డాది శ్రీనివాస్) : ‘ఏవోబీ’లో దశాబ్దాల పాటు సాగిన గంజాయి సాగుకు ప్రభుత్వ చర్యలతో అడ్డుకట్ట పడింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. గత మూడేళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో గంజాయి మత్తు దాదాపు వదిలింది. ప్రధానంగా ప్రభుత్వం రైతాంగ పరంగా అమలు చేస్తున్న పథకాలన్నీ గిరిజనుల దరికి తీసుకెళ్లడంతో వారు సగర్వంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులను కల్పించింది. సంప్రదాయ, వాణిజ్య పంటల వల్ల కూడా లాభాలు కళ్లజూసేలా తగిన ప్రోత్సాహం ఇస్తూ.. అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యంగా దాదాపు 2.5 లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ (రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు, డీకేటీ పట్టాలు పంపిణీ చేయడం ద్వారా ‘ఇది మా భూమి’ అనే భరోసా కల్పించింది. ఈ పట్టాలు పొందిన వారికి, వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింప చేసింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ఇతరత్రా పథకాలన్నీ అందించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచింది. వీటికి తోడు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. వీటన్నింటి వల్ల గిరిజనుల జీవితాల్లో కొత్త శకం ప్రారంభమైంది. జి.మాడుగుల మండలం బొయితిలిలో గతంలో గంజాయి సాగు భూమిలో వరి సాగు చేస్తున్న గిరిజనులు ఆపరేషన్ పరివర్తన్ ఇలా.. ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ద్వారా పోలీసు శాఖ ఏవోబీలోని జి.మాడుగుల, జీకే వీధి, పెదబయలు, చింతపల్లి, కొయ్యూరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగూడ మండలాల్లో 7,515 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించింది. ► ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం దేశంలోనే తొలిసారి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు నిర్వహించిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా ఏకంగా 2 లక్షల కేజీలకు పైగా గంజాయి పంటను ధ్వంసం చేసింది. ఇదో రికార్డు. ఏవోబీలో గంజాయి సాగు విస్తరించడానికి ప్రధాన కారణమైన మావోయిస్టులు, ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలను పోలీసులు సమర్థంగా కట్టడి చేశారు. ► గతంలో గంజాయి పంట సాగు చేసే గిరిజన రైతుకు ఒక వంతు, ఇతర రాష్ట్రాల్లో ఉంటూ పెట్టుబడి పెట్టే స్మగ్లింగ్ ముఠాలకు ఇంకో వంతు, మావోయిస్టులకు మరో వంతు అనే విధానం అనధికారికంగా అమలయ్యేది. అపరేషన్ పరివర్తన్‌ను విజయవంతం చేయడంతో ఈ విధానానికి బ్రేక్ పడింది. ► ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం లేకుండా చేసిన పోలీసులు.. వారి సానుభూతిపరులు, మిలీషియా (వృత్తిపరంగా సైనికులు కాకపోయినా, సైనిక శిక్షణ పొందిన వ్యక్తుల సమూహం) ప్రభావాన్ని కూడా పూర్తిగా కట్టడి చేశారు. ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలు, వారి ఏజంట్లను ఏజెన్సీ నుంచి తరిమికొట్టారు. ఆర్బీకేల ద్వారా అడుగడుగునా అండ ► గంజాయి సాగు నిర్మూలనతో తన పని పూర్తి అయ్యిందనుకోలేదు ప్రభుత్వం. గంజాయి సాగు చేసిన గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది. పోలీసు శాఖ సహకారంతో ఐటీడీఏ సమగ్రంగా సర్వే నిర్వహించింది. ► వ్యవసాయ, ఉద్యానవన శాఖల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపట్టింది. వరితోపాటు ప్రధానంగా వాణిజ్య పంటలపై అవగాహన కల్పిస్తోంది. రాగులు, వేరుశనగ, పసుపు, కందులు, మొక్కజొన్న, రాజ్మా, డ్రాగన్ ఫ్రూట్, లిచీ, అనాస, పనస, మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ తదితర పంటల సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోంది. ► ఈ ప్రక్రియలో గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సాగు వివరాలను ఈ–క్రాపింగ్‌లో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో గిరిజనులు రెట్టించిన ఉత్సాహంతో ఏరువాక చేపట్టారు. ► గతంలో భయం భయంగా గంజాయి సాగు చేసిన గిరిజనులు ప్రస్తుతం దర్జాగా సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పొలాల్లో రాగుల పంటలో కలుపు తీయడం కనిపించింది. పసుపు పంటను, కాఫీ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏవోబీలో వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా కొబ్బరి, జామ, అరటి, సపోటా, శీతాఫలం వంటి ఉద్యాన పంటలతోపాటు కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారట్, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటల సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బొయితిలిలో వరి చేనులో పనులు చేస్తున్న రైతులు పచ్చటి పంటలతో కళ్లెదుటే మార్పు ► ఒకప్పుడు నిండుగా గంజాయి మొక్కలతో కనిపించిన ఏవోబీలోని కొండలు ప్రస్తుతం వరి, రాగులు, మొక్కజొన్న, పసుపు, కాఫీ, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలతో కళకళలాడుతున్నాయి. జి.మాడుగుల మండలం బొయితిలి లో ఏకంగా 343 ఎకరాల్లో గతంలో గంజాయి సాగు చేసేవారు. ప్రస్తుతం ఆ భూముల్లో సంప్రదాయ, వాణిజ్య పంటలు వేశారు. ► గతంలో 293 ఎకరాల్లో గంజాయి సాగు చేసిన నూరుమత్తి పంచాయతీలో ప్రస్తుతం ఒక్కగంజాయి మొక్క కూడా కనిపించడం లేదు. కోరపల్లిలోన 292 ఎకరాల్లో గంజాయి సాగన్నది గతం. ఆ భూముల్లో ప్రస్తుతం రాగులు, వేరుశనగ, మిల్లెట్లు, రాగుల సాగు మొదలుపెట్టారు. ► జీకే వీధి మండలం జెర్రిల గూడెంలో గతంలో 257 ఎకరాల్లో గంజాయి మొక్కలే కనిపించేవి. ఆ భూముల్లోనే ఇప్పుడు సపోటా, జామ, సీతాఫలం, స్వీట్ ఆరెంజ్ తదితర పండ్ల తోటలు వేశారు. మొండిగెడ్డ పంచాయతీలో గతంలో గంజాయి వేసిన 392 ఎకరాల్లో కొబ్బరి, ఆపిల్ బేర్, స్వీట్ ఆరెంజ్ మొక్కలు నాటుతున్నారు. ► దుప్పలవాడలో గత ఏడాది గంజాయి సాగు చేసిన 202 ఎకరాల్లో ప్రస్తుతం రాజ్మా పండించేందుకు గిరిజన రైతులకు ప్రభుత్వం 2,180 కేజీల విత్తనాలు 90 శాతం సబ్సిడీపై సరఫరా చేసింది. పెద బయలు మండలంలో రాగులు, కాఫీ సాగు మొదలు పెట్టారు. ► డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీలో గతంలో గంజాయి సాగు చేసిన 170 ఎకరాల్లో ప్రస్తుతం వేరుశనగ పండించేందుకు 2,400 కేజీల విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. చింతపల్లి మండలం అన్నవరంలో 75 ఎకరాల్లో సాగు కోసం 344 కేజీల చిరుధాన్యాల విత్తనాలు, 45 కేజీల రాగుల విత్తనాలు, 25,500 కాఫీ మొక్కలను పంపిణీ చేశారు. ► కొయ్యూరు మండలం బురదల్లులో 359 ఎకరాల్లో కాఫీ తోటల పెంపకం కోసం 2,52,800 కాఫీ మొక్కలను అందించారు. జోలాపుట్, దోడిపుట్టు, బుంగపుట్టు, బూసిపుట్టు, బాబుశాల, బరడ, బంగారుమెట్ట, తమ్మింగుల, బెన్నవరం, లొట్టుగెడ్డ, షిల్కరి, పోయిపల్లి, పెద్ద కొండపల్లి, పర్రెడ, లక్ష్మీపేట.. ఇలా ఏవోబీలో గతంలో గంజాయి సాగు చేసిన 7,515 ఎకరాలు.. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటల సాగుతో కళ కళలాడుతూ నిజమైన మార్పునకు నిదర్శంగా నిలిచాయి. దేశంలోనే తొలిసారి గంజాయి, ఇతర డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పోలీసు శాఖ సమర్థవంతంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ను నిర్వహించింది. దేశంలోనే తొలిసారిగా గంజాయి సాగు నిర్మూలనకు ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం ద్వారా ఏపీ పోలీసు శాఖ రికార్డు సృష్టించింది. గిరిజనులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ చేపట్టింది. – కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గిరిజనుల జీవితాల్లో వెలుగు గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను స్పష్టంగా వివరించడంతో గిరిజనులు మాకు సహకరించారు. గతంలో వారు గంజాయి సాగు చేసిన భూముల్లోనే ప్రత్యమ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం రెవెన్యూ, ఐటీడీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమన్వయంతో పని చేస్తున్నాం. గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. – జె.సతీష్ కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా రాగులు పంట వేశాను ఎన్నో ఏళ్లు మా పొలంలో గంజాయి మొక్కలే వేశాను. పోలీసువారు వచ్చి చెప్పడంతో గంజాయి మొక్కలు తీయించివేశాను. ఇతర పంటలు వేసుకోవాలని ఆఫీసర్లు వచ్చి చెప్పారు. ఇప్పుడు రాగులు వేశాను. విత్తనాలు ప్రభుత్వమే ఇచ్చింది. ఇక నుంచి మేము రాగులు, పసుపే పండిస్తాం. – పండమ్మ, గిరిజన మహిళా రైతు, బొయితిలి మా బిడ్డల భవిష్యత్ కోసమే మా బిడ్డలకు మంచి జీవితం అందించాలనే గంజాయి సాగు మానేశాం. పసుపు పంట వేశాం. ఈ పంటకు సరైన ధర కల్పిస్తే చాలు. ప్రభుత్వ పథకాల ద్వారా మా పిల్లల్ని బాగా చదివించుకుంటాం. – బేతాయమ్మ, రైతు, వాకపల్లి ప్రభుత్వంపై నమ్మకంతోనే మార్పు మా గూడేల్లో గంజాయి సాగును పూర్తిగా విడిచి పెడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న నమ్మకంతోనే గిరిజనులు గంజాయి సాగు మానేశారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మాకు సహకరిస్తున్నారు. గిరిజనుల పంటలకు మద్దతు ధర కల్పించాలి. – లసంగి మల్లన్న, సర్పంచ్, బొయితిలి ఈ–క్రాపింగ్ చేస్తున్నాం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్న విత్తనాలను గిరిజన రైతులకు సక్రమంగా పంపిణీ చేస్తున్నాం. వారు సాగు చేస్తున్న పంటల వివరాలను తెలుసుకుని ఈ–క్రాపింగ్ చేస్తున్నాం. తద్వారా వైఎస్సార్ రైతు భరోసా, ఇతర పథకాలు వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్.ప్రీతి, అగ్రికల్చర్ అసిస్టెంట్ -
సెబ్ దూకుడు
సాక్షి, అమరావతి: సారా, గంజాయి దందాను కట్టడి చేయడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) దూకుడు పెంచింది. వారం రోజుల్లోనే విస్తృతంగా దాడులు జరిపి 566 కేసులు నమోదు చేసి 705 మందిని అరెస్టు చేసింది. అలాగే 64 వాహనాలను జప్తు చేసింది. ఆపరేషన్ పరివర్తన్ 2.0 కింద సారా తయారీ, రవాణాపై సెబ్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. రాష్ట్ర సరిహద్దులకు అవతల సాగు చేసిన గంజాయిని రాష్ట్రం గుండా అక్రమ రవాణా చేయకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. స్మగ్లర్లు అక్రమ రవాణాకు ఉపయోగించే దారులను ఇప్పటికే మ్యాపింగ్ చేసి సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దోనూరు, చింతూరు, ఇదుగురలపల్లి, లక్ష్మీపురం, మారేడుమిల్లిలతోపాటు అనకాపల్లి జిల్లాలోని తాటిపర్తి, భీమవరం గ్రామాల్లో చెక్ పోస్టులను నెలకొల్పింది. మరోవైపు వివిధ జిల్లాల్లో సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను వినియోగించింది. క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారాన్ని తెప్పించుకుంటూ దాడులు నిర్వహిస్తోంది. వారం రోజులుగా చేపడుతున్న కార్యాచరణ సత్ఫలితాలను అందించిందని సెబ్ వర్గాలు తెలిపాయి. సారా తయారీ, విక్రయాలకు సంబంధించి 560 కేసులు నమోదు చేసి 692 మందిని అరెస్టు చేశారు. అలాగే 2,940 లీటర్ల సారాను స్వాధీనం చేసుకోవడంతోపాటు 30 లీటర్ల సారా ఊటను సెబ్ ధ్వంసం చేసింది. 63 వాహనాలను జప్తు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 6 కేసులు నమోదు చేసింది. 13 మందిని అరెస్టు చేశారు. అలాగే 1,009 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక వాహనాన్ని జప్తు చేశారు. -
మూడేళ్లలో నేరాల సంఖ్య తగ్గింది
తిరుపతి క్రైం/తిరుమల: గడచిన మూడేళ్లలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డీజీపీ కాసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో క్రైం రేటును ప్రామాణికంగా తీసుకోకుండా క్రైమ్ రేటును గణించినట్టు చెప్పారు. శనివారం తిరుపతిలోని ఎస్వీ సెనేట్ హాల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో గస్తీ పెంచడంతోపాటు నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. రాష్ట్రంలో యాక్సిడెంట్ల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పదో తరగతి తెలుగు పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరిగిన మాట వాస్తవమేనని, ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే నారాయణను అరెస్ట్ చేశామని చెప్పారు. కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఏపీపీ సుజాతను సస్పెండ్ చేశామని చెప్పారు. ప్రాసిక్యూషన్‌కు ఏపీపీ సుజాత సహకరించకపోవడంతో చర్యలు తీసుకున్నామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత దిశ, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు ఆందోళనకరంగా లేవని, అయినా వాటి నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గంజాయి సాగు, రవాణాను నిరోధించాం రాష్ట్రంలో గంజాయి సాగు జరగకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ పంటలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. మల్కాన్‌గిరి జిల్లా నుంచి గంజాయి అక్రమ రవాణాను పూర్తి స్ధాయిలో నిరోధించినట్లు తెలిపారు. నిషేధిత వస్తువులు అక్రమంగా రవాణా చేస్తే చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటామని, నేరాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని సరిహద్దుల్లో త్వరలో చెక్ పోస్టు ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, తిరుమల శ్రీవారిని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం దర్శించుకున్నారు. -
గంజాయి.. ఇక గతమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతేడాది వరకు గంజాయి పండించిన పొలాలు ఉద్యాన పంటల క్షేత్రాలుగా మా రుతున్నాయి. గిరి శిఖరాల నడుమ మారుమూలన ఉండే ఆ పొలాల్లో ఇప్పుడు విదేశీ కూరగాయలతో పా టు కాఫీ, పసుపు, స్ట్రాబెర్రీ వంటి పంటలు పురుడు పో సుకుంటున్నాయి. గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడమే కాకుండా ఆ పొలాల్లో ఉద్యాన పంటలు పండించేలా గిరిజనులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. గంజాయి సాగును సమూలంగా నిర్మూలించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయానికి అనుగుణంగా.. లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ సాగువైపు అడుగులు పడుతున్నాయి. గిరిజనులకు ప్రోత్సాహకాలందిస్తూ.. వాణిజ్య పంటల సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్పటి పాలకులు పట్టించుకోక.. మన్యంలో గిరిజనులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నా అప్పటి పాలకులు సరిగ్గా పట్టించుకోకపోవడం వంటి పరిస్థితుల్లో అక్కడి గిరిజన రైతుల్లో కొం దరు గంజాయి సాగువైపు ఆకర్షితులయ్యారు. అలా విశాఖ మన్యంలో గంజాయి సాగు సుమారు 10 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించింది. ఎట్టిపరిస్థితుల్లో గంజా యి సాగుపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం రంగంలోకి దిగింది. ఫలితంగా గతేడాది వరకు సగటున 10 వేల ఎకరాల్లో సాగయ్యే గంజాయి పంట రెండేళ్లలో 7 వేల ఎకరాలకు పడిపోయింది. పోలీసులు, సెబ్, ఐటీడీఏ, సచివాలయ సిబ్బంది డ్రోన్ల సహాయంతో గంజాయి సాగును గుర్తించి.. ఆ భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించకపోతే తిరిగి గంజాయి వైపు గిరి జనులు మొగ్గుచూపే ప్రమాదం ఉండటంతో మూడేళ్లలో లక్షకు పైగా ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సా గు చేపటేఊ్టలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా 62 వేల మంది గిరిజనులకు 98 వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా అందించి ఆ భూములపై వారికి యాజమాన్య హక్కులు కల్పిం చింది. వీటితో పాటు గంజాయి సాగైన 7 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగు చేయిస్తోంది. శిక్షణ ఇచ్చి మరీ.. వాణిజ్య పంటలపై గిరిజనులకు అవగాహన కల్పించడంతో పాటు సాగు రీతులు, సస్యరక్షణపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించేలా ప్రభుత్వం చేర్యలు చేపట్టింది. ముఖ్యంగా వేరుశనగ, రాజ్మా, రాగులు వంటి పంట లతో పాటు డ్రాగన్ ఫ్రూట్, లిచీ, పైనాపిల్, అవకాడో, స్ట్రాబెర్రీ, అల్లం, నల్ల మిరియాలు, పొద మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళాదుంప, టమోటా, కాకర, బీర, బెండ వంటి ఉద్యాన పంటలను 46,650 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు రానున్న రెండేళ్లలో 34 వేల ఎకరాల్లో కాఫీ గింజల సాగుకు సన్నద్ధం చేయాలని అధికారులు భావి స్తున్నారు. మరో 5 వేల ఎకరాల్లో రూ.100 కోట్లతో పసుపు పండించనున్నారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి రూ.144 కోట్లు ప్రతి గిరిజనుడు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా మూడేళ్లకు అభివృద్ధి ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.144 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. స్వచ్ఛందంగా సాగు వైపు.. ప్రభుత్వం చేపడుతున్న చైతన్య కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంతో గిరిజనులు ఈ ఏడాది స్వచ్ఛందంగా గంజాయి సాగును విడనాడారు. ప్రభుత్వం కేవలం ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి చేతులు దులిపేసుకోకుండా.. గిరిజన రైతులకు పూర్తిస్థాయి సహకారం అందించాలని నిర్ణయించింది. విత్తనాలు సరఫరా చేయడంతోపాటు పంట చేతికి వచ్చేంత వరకు సహకారం అందిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. జామ్, జ్యూస్‌గా మార్చడం, పల్పింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ వంటి పనులు చేపట్టేలా వారిని ప్రోత్సహిస్తామన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా.. పంట ఆదాయం చేతికొచ్చేంత వరకూ గిరిజన రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. -
80.8 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో నిర్వహిస్తున్న ఆపరేషన్ పరివర్తనలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసు బృందాలు గురువారం మొత్తం 80.8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ అన్నవరం, గొర్లమెట్ట గ్రామాల్లో 70 ఎకరాలు, జి.కె.వీధి మండలం రింతాడ పంచాయతీ మర్రిపాలెం సమీపంలో 10.8 ఎకరాల గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు. ముందుగా ఆయా గ్రామాల్లో గిరిజనులకు గంజాయి నిర్మూలన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పోలీసుల ప్రచారాలకు ప్రభావితమైన గిరిజనులు స్వచ్ఛందంగానే గంజాయి తోటల ధ్వంసానికి ముందుకొస్తున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ సతీష్‌కుమార్ పర్యవేక్షణలో గంజాయి తోటలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప ఎస్ఐ జె.లోకేష్‌కుమార్, జి.కె.వీధి ఎస్ఐ షేక్ షమీర్ తదితరులు పాల్గొన్నారు. 34 కిలోల గంజాయి పట్టివేత ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం లబ్బూరు జంక్షన్ వద్ద గురువారం పోలీసులు రూ.68 వేల విలువైన 34 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఒకరు పరారయ్యారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన బొలెరో వాహనం, బైకు, స్కూటీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని మాకవరం పంచాయతీ అరబీరు గ్రామానికి చెందిన సీసా నాగేశ్వరరావు, ఒడిశా రాష్ట్రం కలహండి గ్రామానికి చెందిన పబిత్రా కటలుగా గుర్తించినట్లు ఎస్ఐ ఆర్.సంతోష్ చెప్పారు. -
గంజాయి కట్టడికి.. రైల్వే పోలీసులు సైతం..
సాక్షి, అమరావతి: గంజాయి దందాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’లో రైల్వే పోలీసులూ కీలకపాత్ర పోషిస్తున్నారు. రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జనరల్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ప్రత్యేక డ్రైవ్ చేపట్టాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్–ఎస్ఈబీ), పోలీసు అధికారులు విస్తృతంగా చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ గంజాయి మాఫియాను హడలెత్తిస్తోంది. వందల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు.. ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో తనిఖీలుచేస్తూ గంజాయి నిల్వలను పెద్దఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో.. ఉన్న గంజాయి నిల్వలను హడావుడిగా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు గంజాయి ముఠాలు ప్రయత్నిస్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రోడ్డు మార్గంలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. దీంతోపాటు రైళ్లలోనూ విస్తృతంగా తనిఖీలు చేయాలని జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. 25 ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు ఆపరేషన్ పరివర్తన్ కోసం జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలతో 25 ప్రత్యేక బృందాలను నియమించారు. వాటిలో విజయవాడ రైల్వే పోలీస్ జిల్లా పరిధిలో 20 బృందాలు, గుంతకల్ రైల్వే పోలీస్ జిల్లా పరిధిలో 5 బృందాలను ఏర్పాటుచేశారు. విజయవాడ రైల్వే పోలీస్ జిల్లా పరిధిలోని 15 ప్రధాన రైల్వేస్టేషన్లు, 15 అవుట్ పోస్టులు, గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని 19 ప్రధాన రైల్వేస్టేషన్లు, 15 అవుట్ పోస్టులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పార్శిళ్లలో ఉన్న గంజాయిని గుర్తించేందుకు పోలీసు జాగిలాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ‘ఆపరేషన్’ సంపూర్ణంగా విజయవంతమయ్యే వరకు రైళ్లలో తనిఖీలను కొనసాగిస్తామని అదనపు డీజీ (రైల్వే) హరీష్‌కుమార్ గుప్తా చెప్పారు. ఆపరేషన్‌లో ‘సెబ్’ కమిషనర్ మరోవైపు.. ‘ఆపరేషన్ పరివర్తన్’లో ‘సెబ్’ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ గురువారం స్వయంగా పాల్గొన్నారు. ముందస్తు సమచారం ఇవ్వకుండా ఆయన గురువారం విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం పంగళలంలోని సెబ్ బేస్ క్యాంప్‌నకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏడు బృందాలతో కలిసి ఆయన పాడేరు, చింతపల్లి మండలాల్లోని మారుమూల తండాల్లో గంజాయి సాగు తీరును పరిశీలించి విస్తుపోయారు. దాదాపు 200 ఎకరాల్లో ఈ పంటలను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో సెబ్ జేడీ సతీష్, సెబ్ స్పెషల్ యూనిట్ జేడీ నరేంద్రనాథ్ రెడ్డి, పాడేరు అదనపు ఎస్పీ జగదీశ్, సెబ్ సూపరింటెండెంట్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
AP: 239 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో గంజాయి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం 239 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల జగ్గంపేట, సీమకొండ, రంజెలమంది గ్రామాల సమీపంలో సుమారు 216 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను ఎస్ఈబీకి చెందిన ఏడు బృందాలు ధ్వంసం చేశాయి. 10.8 లక్షల గంజాయి మొక్కలను నరికేసి వాటికి నిప్పంటించారు. చింతపల్లి మండలం మేడూరు గ్రామ సమీపంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తుల సహకారంతో 15 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలకు నిప్పంటించారు. పాడేరు మండలంలోని ఇరడాపల్లి సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న కనక ఆధ్వర్యంలో గిరిజనులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, వలంటీర్ల సహకారంతో 8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. -
AP: గంజాయికి చెక్.. ముమ్మరంగా ‘ఆపరేషన్ పరివర్తన్’
సాక్షి, అమరావతి/పాడేరు/గూడెంకొత్తవీధి/చింతపల్లి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో గంజాయి సాగును నిర్మూలించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ‘ఆపరేషన్ పరివర్తన్’ను ముమ్మరం చేసింది. దీన్లో భాగంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అయిదు రోజుల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించింది. గంజాయి సాగుతో కలిగే దుష్పరిణామాలపై పోలీసులు, నిపుణులు గిరిజనులకు అవగాహన కల్పించారు. మరోవైపు ఎస్ఈబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన మార్గాల్లో తనిఖీలు చేస్తూ నిఘాను పటిష్టపరిచారు. మొత్తం 283 కేసులు నమోదు చేసి 763 మందిని అరెస్టు చేశారు. 9,266 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 179 వాహనాలను జప్తుచేశారు. 260 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసం లక్ష్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఇతర సిబ్బంది ఏడు బృందాలుగా పాడేరులో మకాం వేశాయి. జి.మాడుగుల, గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో ఆదివారం 260 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అనకాపల్లి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో జి.మాడుగుల మండలంలోని బొయితిలి ప్రాంతంలో 40 ఎకరాలు, గుప్పవీధిలో 40 ఎకరాలు, ఎగువ వాకపల్లిలో 55 ఎకరాలు, దిగువ వాకపల్లిలో 55 ఎకరాల్లో సుమారు 2 లక్షల గంజాయి మొక్కల్ని వేర్లతోసహా పీకేసి నిప్పంటించారు. గూడెంకొత్తవీధి మండలంలోని రింతాడ, దామనాపల్లి పంచాయతీల పరిధిలో సిగినాపల్లి, నల్లబెల్లి, తుప్పలదొడ్డి, గుర్రాలవీధి, అసరాడ, కాకరపాడు గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో, చింతపల్లి మండలంలోని టేకులవీధి, గడపరాయిలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐలు మహ్మద్ ఆలీషరీఫ్, షమీర్, ఆర్ఎస్ఐ నరేంద్ర, ఎస్ఈబీ అధికారులు త్రినా«థ్, మణికంఠ, డీవీజీ రాజు తదితరులు పాల్గొన్నారు. గంజాయి నిర్మూలనకు విద్యార్థులతో 2కే రన్ ఏజెన్సీలోని గంజాయి సాగు, అక్రమ రవాణా నిర్మూలనలో గిరిజన యువత భాగస్వాములవ్వాలని పాడేరు ఏఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. ‘నో టు గంజా’, పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఆదివారం విశాఖజిల్లా పాడేరులో గిరిజన విద్యార్థులతో 2కే రన్ నిర్వహించారు. చలిగాలులు ఉన్నప్పటికీ 500 మంది గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు ఏఎస్పీ జగదీష్ మాట్లాడుతూ గంజాయి సాగు ద్వారా విశాఖ ఏజెన్సీకి చెడ్డపేరు వస్తోందన్నారు. గిరిజనులంతా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. స్మగ్లర్లు గంజాయి రవాణాకు యువతను ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. గిరి జన యువత జైలు జీవితం గడుపుతూ భవి ష్యత్తును నాశనం చేసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయికి వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. -
గంజాయి సాగుపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గంజాయి సాగుపై చేపట్టిన జాయింట్ ఆపరేషన్ విజయవంతమైంది. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), ఐటీడీఏ సంయుక్త భాగస్వామ్యంతో బుధవారం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు. చింతూరు సబ్ డివిజన్ మోతుగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒడియా క్యాంప్‌లో ఈ ఆపరేషన్ చేపట్టారు. అక్కడి క్యాంప్‌లో నివసిస్తున్న సుమారు 130 కుటుంబాల్లో ఎక్కువ మంది చాలాకాలంగా గంజాయి సాగు చేస్తున్నారు. చింతూరు మండలంలోని వలస ఆదివాసీ గ్రామం ఒడియా క్యాంపునకు చెందిన వలస ఆదివాసీలు గంజాయి స్మగ్లర్ల ప్రలోభాలకు లొంగి ఇరురాష్ట్రాల సరిహద్దుల్లోని కొండ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనా«థ్‌బాబు ఆ ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో మోతుగూడెం ఎస్సై సత్తిబాబు ఒడిశా క్యాంప్‌లో 10 ఎకరాల్లో గంజాయి సాగవుతున్నట్టు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు స్వయంగా ఆ గ్రామంంలో పర్యటించి ఆదివాసీలకు ‘పరివర్తన’ పేరిట కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో ఎస్పీతో పాటు ఇతర అధికారులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గంజాయి పండిస్తున్న ప్రాంతానికి కాలి నడకన వాగులు, గుట్టలు దాటుకుంటూ వెళ్లి గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. ఎకరానికి 5 వేల మొక్కల చొప్పున పదెకరాల్లో నాటిన సుమారు రూ 2.50 కోట్ల విలువైన 50 వేల మొక్కలను నరికివేసి నిప్పు పెట్టారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ బి.రమాదేవి, చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ, రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పాటిల్, చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్, ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 60 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం గూడెం కొత్తవీధి: విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలోని రంపుల, తియ్యల మామిడి గ్రామాల్లో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 60 ఎకరాల్లో సాగు చేస్తున్న తోటలను ధ్వంసం చేసి నిప్పంటించామని సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఎస్ఈబీ, పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి గంజాయి సాగు చేస్తున్న గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ షమీర్, ఆర్ఎస్ఐ నరేంద్ర, ఏఈఎస్ బి.శ్రీనాథుడు, అటవీశాఖ అధికారి భూషణం పాల్గొన్నారు. -
గంజాయి నిర్మూలనకు గిరిజనుల ప్రతిన
జి.మాడుగుల/గూడెం కొత్తవీధి: గంజాయి పంటను ఇకపై సాగు చేయబోమని గిరిజనులు ప్రతిన బూనారు. గంజాయి సాగు, రవాణాను పూర్తిగా రూపుమాపేందుకు నడుం కట్టారు. విశాఖ ఏజెన్సీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ‘పరివర్తన’ కార్యక్రమంతో గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. జి.మాడుగుల మండలం మారుమూల గ్రామాల్లో ఇప్పటికే గిరిజనులు గంజాయి సాగును నిషేధిస్తూ తీర్మానించుకుని తోటలను నరికి పారేస్తున్నారు. మండలంలోని నుర్మతి పంచాయతీ పినజాగేరు, వండ్రాంగుల, వాకపల్లి, డిప్పలగొంది, గాదిగుంట గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో 100 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను సోమవారం గిరిజనులు కత్తులు పట్టి నరికి ధ్వంసం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలోని దామనాపల్లిలో సర్పంచ్ కుందరి రామకృష్ణ గ్రామపెద్దలు, యువకులను చైతన్యపరిచి సాగు చేస్తున్న గంజాయి తోటల్లో మొక్కలను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఫీల్డ్‌మెన్ గోవింద్, గ్రామ వలంటీర్లు, యువకులు పాల్గొన్నారు. -
'గంజాయి'పై కదిలిన గ్రామ చైతన్యం
కొయ్యూరు: గంజాయిని రాష్ట్రంలో సమూలంగా నాశనం చేయాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు ఆ గ్రామంలోని యువకులు ముందుకు కదిలారు. తమ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేయటంతోపాటు.. ఇకపై గ్రామస్తులు ఎవరూ గంజాయి పండించకూడదని తెలియజెప్పారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ చౌడుపల్లి గ్రామాన్ని ఆనుకొని అటవీ ప్రాంతం ఉంది. కొందరు గ్రామస్తులు అక్కడ గంజాయిని పండిస్తున్నారు. గ్రామ యువకులు పలువురు గురువారం అక్కడికి చేరుకుని, సుమారు ఎకరం విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక నుంచి గ్రామస్తులు ఎవరూ గంజాయిని పండించరని, ఎవరైనా తోటలను వేస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని చెప్పారు. దీనిపై కొయ్యూరు సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ.. గంజాయి ఎక్కువగా సాగవుతున్న మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజలు ఈ విధంగా చైతన్యవంతులై గంజాయి తోటలను స్వయంగా వారే ధ్వంసం చేయటం శుభపరిణామమన్నారు. -
2,000 కిలోల గంజాయి స్వాధీనం
చింతూరు: రాష్ట్రంలో గంజాయి రవాణాపై దాడులు కొనసాగుతున్నాయి. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ.. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఒడిశా నుంచి తెలంగాణకు తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన గంజాయిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఏఎస్పీ కృష్ణకాంత్ బుధవారం మీడియాకు వెల్లడించారు. మోతుగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుకుమామిడి అటవీ ప్రాంతం మీదుగా గంజాయి రవాణా జరుగుతుందంటూ వచ్చిన సమాచారంతో సీఐ యువకుమార్, ఎస్ఐ సత్తిబాబు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో కొబ్బరికాయల లోడ్‌తో వచ్చిన ఓ వ్యానును తనిఖీ చేయగా.. కొబ్బరికాయల కింద గంజాయి మూటలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి తెలంగాణకు చెందిన కడియం గురుసాగర్, పొగిడాల పర్వతాలు, ఒడిశాకు చెందిన నైని రామారావును అరెస్టు చేసి.. 2 వేల కిలోల గంజాయి, వ్యాన్‌ను, కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏజన్సీ వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు విస్తృతంగా చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. ఏజెన్సీలో ముమ్మరంగా గంజాయి తోటల ధ్వంసం సీలేరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసం కొనసాగుతోంది. బుధవారం గుమ్మరేవుల పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాల్లో గంజాయి మొక్కలను స్థానికులు నరికేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో గిరిజనులు స్వచ్ఛందంగా తమ గ్రామాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ చేపట్టిన చర్యలతో చింతగుప్ప, పొలుతురుకోట గ్రామాల ప్రజలు గంజాయి మొక్కలను నరికేసి.. ఇకపై గంజాయి సాగు చేయబోమని ప్రతిజ్ఞ చేశారు. చింతగుప్ప గ్రామంలో గంజాయి మొక్కలు నరికివేస్తున్న గిరిజనులు -
గంజాయిపై సమష్టి పోరు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా) : దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న గంజాయి సాగును రాష్ట్రంలో సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు యంత్రాంగం ఉమ్మడి వ్యూహం రచిస్తోంది. సాగు దశ నుంచే దీనిని కట్టడి చేసేందుకు పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించింది. తూర్పు గోదావరి జిల్లా వేదికగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు అధికారులకు ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పలు విభాగాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సుమారు మూడున్నర గంటలపాటు రాజమహేంద్రవరంలో అంతర్గత సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు దగ్గర నుంచే గంజాయి నియంత్రణ, రవాణా కట్టడికి సరిహద్దుల్లో ఎదురవుతున్న ప్రతిబందకాలను అధిగమించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని సూచించారు. ఇందుకు పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని సమష్టి పోరుకు సిద్ధంకావాలని ఆదేశించారు. ఇందుకోసం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేస్తున్నామని చెప్పారు. దీనికి పోలీసు, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, ఐటీడీఏల సహకారం తీసుకుంటామన్నారు. అనంతరం డీజీపీ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. మీరే చూస్తారుగా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నెలరోజులుగా రాష్ట్రంలో గంజాయిపై లోతైన అధ్యయనం చేశామని గౌతమ్ సవాంగ్ చెప్పారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారుగా అని డీజీపీ అన్నారు. నిజానికి ఆంధ్రా–ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందన్నారు. ఎన్ఐఎ సహకారంతో ఇప్పుడు దానిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో 2.90 లక్షల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని డీజీపీ చెప్పారు. పదేళ్ల కంటే గత ఏడాదిలో కొన్ని రెట్లు అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గతంలో 3 వేల ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగును ధ్వంసం చేసినట్లు చెబుతున్నారని.. కానీ, ఈసారి మొదటి విడతలోనే 4,500 ఎకరాల్లో ధ్వంసం చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్న డీజీపీ సవాంగ్ ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులపై గట్టి నిఘా ఏర్పాటుచేయడంతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు. ఇప్పటికే 463 మంది అంతర్రాష్ట్ర నిందితులను దోషులుగా నిలబెట్టామన్నారు. అలాగే, 1,500 వాహనాలను జప్తుచేసి, 5,000 మంది నిందితులను అరెస్టు చేశామని గౌతమ్ సవాంగ్ చెప్పారు. సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామని, ఒడిశా డీజీపీతో కూడా మాట్లాడామన్నారు. ఈ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గంజాయి సాగుపై దాడులు విస్తృతం పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గంజాయి రవాణా, సాగుపై పోలీసు దాడులు నిర్వహించామన్నారు. ఈ ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ బృందాలను నియమించామన్నారు. నిజానికి.. 2016లోనే ఏపీతో పాటు ఒడిశా సైతం గంజాయికి కేంద్రంగా మారిందన్నారు. ఇక గంజాయి ఏ విధంగా తరలిస్తున్నారు? ఎలా పట్టుకోవాలి? ఎక్కడ చెక్ పోస్టులు పెట్టాలి అనే అంశాలపై సమగ్రంగా చర్చించామని డీజీపీ చెప్పారు. నాలుగేళ్లుగా కేరళ నుంచి వచ్చిన స్మగ్లర్లు ఇక్కడే ఉండి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని గుర్తించామని ఆయన చెప్పారు. గంజాయి స్మగ్లింగ్ ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఎక్కువగా ఉందన్నారు. అసత్య ఆరోపణలు సరికాదు ఇక గుజరాత్ ముంద్రా, నరసాపురం ఉదంతాలతో రాష్ట్రానికి ఎలాంటి సంబంధంలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి స్పష్టంచేశారు. కొందరు కావాలనే దీనిపై అసత్యపు ప్రచారం చేస్తున్నారన్నారు. విచారణ చేస్తున్న ఏజెన్సీలన్నీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. డీఆర్ఐ, ఎన్సీబీ, ఇప్పుడు సీబీఐ కూడా ఆరా తీస్తున్నాయని ఆయన చెప్పారు. పోలీస్ వ్యవస్థపై రాజకీయంగా విమర్శలు చేయవద్దని డీజీపీ హితవు పలికారు. గంజాయి, ఇతర స్మగ్లింగ్ వ్యవహారాలపై ప్రజలు ముందుకొచ్చి సమాచారం ఇవ్వాలని డీజీపీ కోరారు. ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఏపీ, తమిళనాడు పోలీసులు సహకారం శ్రీసిటీ వేదికగా ఇరు రాష్ట్రాల పోలీసు అధికారుల చర్చలు ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో అక్రమ రవాణా, శాంతిభద్రతల పరిరక్షణకు కసరత్తు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) అడిషనల్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రెండు రాష్ట్రాల పోలీసు శాఖల సమన్వయం, పరస్పర సహకారం కోసం మంగళ వారం శ్రీసిటీ పారిశ్రామికవాడలోని వ్యా పార వాణిజ్య కేంద్రంలో చిత్తూరు, నెల్లూరు, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు సమావేశమయ్యారు. సెబ్ అడిషనల్ ఎస్పీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన శ్రీసిటీ సెజ్ పరిధిలో ఇరు ప్రాంతాల పోలీసుల మధ్య సహకారం, సమన్వయం ఉన్నప్పుడే అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో శ్రీసిటీని శాంతిభద్రతల విషయంలో మోడల్ సిటీగా మార్చవచ్చన్నారు. అలాగే, ఆకతాయిలు, రౌడీమూకలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంతర్రాష్ట్ర నేరాలను నివారించడం, ఇసుక, కంకర, మట్టి, ఎర్రచందనం, మద్యం, గంజాయి, రేషన్ బియ్యంలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్‌కుమార్, శ్రీసిటీ సెక్యూరిటీ చీఫ్ రమేష్ సాదర స్వాగతం పలికారు. -
Telangana: గంజాయి కట్టడికి మూడంచెలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా, స్మగ్లింగ్‌ను నియంత్రించేందుకు పోలీస్ శాఖ, ఎక్సైజ్ విభాగాలు నడుం బిగించాయి. ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నాయి. మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ విభాగాలతో గంజాయి నియంత్రణపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలకనుగుణంగా మూడంచెల వ్యవస్థను ఏర్పాటుచేసే పనిలో పోలీస్, ఎక్సైజ్ విభాగాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పటిష్టమైన నిఘా.. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా అవుతున్న గంజాయితోపాటు రాష్ట్రంలో సాగువుతున్న గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు అంతర్రాష్ట్ర, రాష్ట్ర, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేతృత్వంలో జిల్లా కమిటీ గంజాయి నియంత్రణకు కృషి చేస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్, శాంతి భద్రతల అదనపు డీజీపీ నేతృత్వంలోని రాష్ట్ర కమిటీ జోనల్ ఐజీలతో నియంత్రణ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక పోలీస్, ఎక్సైజ్ విభాగాలతో నిరంతరం సమాచార మార్పిడి చేసుకునేలా అంతర్రాష్ట్ర కమిటీ చర్యలు చేపట్టనుంది. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలో ప్రవేశించే పాయింట్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాలని ఇరు విభాగాలు నిర్ణయించాయి. ఇందుకోసం పోలీస్ శాఖ బెటాలియన్ల నుంచి 10 మంది సాయుధ బలగాలను ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేయనుంది. ఎక్సైజ్ విభాగం సైతం ఆయా జిల్లాల పరిధి నుంచి 10 మంది సిబ్బందిని అక్కడ నియమించనున్నట్లు తెలిసింది. ఈ చెక్‌పోస్టులను ఇరు విభాగాల సీఐ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. ఇలా ఏపీ–తెలంగాణ సరిహద్దులో, మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు (నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో), కర్ణాటక–తెలంగాణ సరిహద్దు (వికారాబాద్, మహబూబ్‌నగర్)లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ), ఎక్సైజ్ శాఖ నేతృత్వంలో రైళ్లలో నిఘాను పెంచి గంజాయి రవాణాను కట్టడి చేయాలని భావిస్తున్నారు. ప్రతీ మండల పరిధిలో ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు చేస్తున్న వారి వివరాలను కనిపెట్టి వాటిని ధ్వంసం చేయాలని ఇప్పటికే పోలీస్ నిఘా వ్యవస్థ అధికారులను ఆదేశించింది. రొటేషన్ పద్ధతిలో కేసులు.. రెండు విభాగాలకు కేసులు నమోదు చేసే అధికారం ఉండటంతో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు రొటేషన్ పద్ధతిలో కేసుల నమోదుకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఒక కేసు పోలీస్ శాఖ, ఒక కేసు ఎక్సైజ్ విభాగం నమోదు చేసేలా వెసులుబాటు చేసుకున్నట్టు తెలిసింది. దీనివల్ల న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉంటాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో మొదలైన ఆపరేషన్ ఇప్పటికే హైదరాబాద్‌లో పోలీస్–ఎక్సైజ్ శాఖ నేతృత్వంలో ఆపరేషన్ గాంజా ప్రారంభించారు. నగర కమిషనరేట్ ప«రిధిలోని వెస్ట్ జోన్ జాయింట్ సీపీ–ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ అజయ్‌రావ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇం దులో భాగంగా నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్, గంజాయి అమ్మకాలు జరిపే హాట్ పాయింట్స్‌లో పోలీస్–ఎక్సైజ్ సిబ్బందిని మఫ్టీలో రంగంలోకి దించారు. ఫూట్ పెట్రోలింగ్ గంజాయి అమ్మకందారులు, కొనుగోలుదారులు, స్మగ్లర్లను గుర్తించేందుకు మొదటిసారి రెండు విభాగాల నేతృత్వంలో ఫూట్ పెట్రోలింగ్ (కాలినడక గస్తీ) చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పది మంది సిబ్బంది హాట్ స్పాట్స్‌లో గస్తీ కాస్తారని, అనుమానిత వ్యక్తులు, కారణం లేకుండా ప్రాంతాలు సందర్శించే వారిని గుర్తించి తనిఖీలు చేయడంతోపాటు ప్రశ్నిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. -
ఆనంద్‌బాబు వ్యాఖ్యలకు ఆధారాల్లేవు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో కొందరు రాజకీయ, ఇతర నాయకుల ప్రమేయంతోనే స్మగ్లింగ్ మాఫియా కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పిన మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు వ్యాఖ్యలకు తగిన ఆధారాలు లేవని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు స్పష్టం చేశారు. విశాఖ నుంచి వెళ్లిన ఒక ప్రత్యేక పోలీసు బృందం ఆయన్ను విచారించిందన్నారు. అందులో భాగంగానే ఐపీసీ సెక్షన్ 160 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశామని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర –ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో గంజాయి సాగు శాశ్వత నిర్మూలన ఒక్క పోలీసు వ్యవస్థతోనే సాధ్యం కాదని, ఆయా ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతతో సంకల్పించాలని సూచించారు. నల్గొండ పోలీసులు రెండు వారాల ముందు నుంచే విశాఖ ప్రాంతంలో పలు కేసుల విషయమై స్థానిక పోలీసులను సంప్రదించారని, కానీ చింతపల్లి వద్ద కాల్పుల ఘటన విషయమై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సమస్య దశాబ్దాల కాలంగా ఉందన్నారు. పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి కొంత కాలంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలో 2016లో 724 ఎన్డీపీఎస్ కేసులలో 2,290 మందిని అరెస్ట్ చేశామన్నారు. 2017లో 712 కేసుల్లో 2,100 మందిని, 2018లో 579 కేసుల్లో 2,174 మందిని, 2019లో 812 కేసుల్లో 2,565 మందిని, 2020లో 812 కేసుల్లో 2,565 మందిని, ఈ ఏడాది అక్టోబర్ 15 వరకు 1,359 కేసుల్లో 4,059 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. రెండేళ్లలో విశాఖ పోలీసులు ఏవోబీలో దాదాపు 50 గ్రామాల్లో 800 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారని చెప్పారు. గంజాయి స్మగ్లర్ల సమాచారం ఉందని ఎవరు చెప్పినా విచారిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. -
గంజాయి సాగుదారులకే బాధ
కాకినాడ రూరల్: రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఇది చేతల ప్రభుత్వమని నిరూపిస్తూ ప్రతి రైతు జీవితకాలం గుర్తుంచుకునేలా ఆర్బీకేలు లాంటి వ్యవస్థలను తెచ్చారని చెప్పారు. బుధవారం కాకినాడలో ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ రైతుల హృదయాల్లో నిలిచిపోవటాన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా తదితరులు లేఖలు రాస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులంతా బాగున్నారని, గంజాయి సాగు చేసే టీడీపీ నేతలే బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడు నెలలుగా విస్తృతంగా దాడులు జరిపి గంజాయి సాగు చేసే నిందితులను పట్టుకున్నామన్నారు. అన్నీ అవాస్తవాలే అనంతపురం జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు టీడీపీ నేతలు ఆరోపణలు చేయటాన్ని కన్నబాబు ఖండించారు. కోస్తా జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించినట్లు అసత్యాలు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో అమలాపురం ప్రాంతంలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులను నాడు హోంశాఖ మంత్రిగా ఉన్న చినరాజప్ప పోలీసులతో బెదిరించారని గుర్తు చేశారు. వ్యవసాయ బోర్లకు మీటర్ల బిగింపుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఎక్కడైనా రూపాయి అదనంగా చార్జీ పడుతోందా? అని ప్రశి్నంచారు. వ్యవసాయ బడ్జెట్ 14 శాతానికి పెంచాం టీడీపీ హయాంలో 2014–15 బడ్జెట్లో వ్యవసాయానికి 12 శాతం నిధులు కేటాయించగా 2018– 19 నాటికి 10 శాతానికి కుదించారని కన్నబాబు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019– 20లో 13 శాతం, తరువాత 14 శాతానికి పెంచిందని చెప్పారు. 2014– 15లో టీడీపీ ప్రభుత్వం రూ.5,583 కోట్లు విలువైన 40.62 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా 2018 –19 సీజన్లో రూ.12,639 కోట్ల మేర ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు. 2019– 20లో రూ.15,037 కోట్లు, 2020– 21లో రూ.15,487 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. మార్క్‌ఫెడ్ ద్వారా పప్పు దినుసులు, ఉల్లి, జొన్న తదితరాల సేకరణకు 2014– 15లో రూ.402 కోట్లు వెచి్చంచగా వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 2019– 20లో రూ.2,595 కోట్లు వెచ్చించిందని తెలిపారు. కోవిడ్ సమయంలో ఉల్లి మొదలుకుని బత్తాయిలు, పూలు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామన్నారు. ఉచిత పంటల బీమా.. ఈ –క్రాప్‌లో నమోదు చేసుకుంటే రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేకుండా ఉచిత పంటల బీమా కల్పిస్తున్నామని కన్నబాబు తెలిపారు. గత సర్కారు రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి 60.84 లక్షల మందికి పంటల బీమా సదుపాయం కల్పించగా తమ ప్రభుత్వం రెండేళ్లలో 1.21 కోట్ల మంది రైతులకు ఉచితంగా పంటల ఇన్సూరెన్స్ చేసిందని చెప్పారు. రెండేళ్లలో రూ.3,716 కోట్లు ఇన్సూరెన్స్ కింద ప్రభుత్వం చెల్లించిందన్నారు. రూ.15 వేల కోట్లతో రాష్ట్రంలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లను తెస్తున్నామన్నారు. 7.38 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, యూరియా 2.66 లక్షల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 3.30 లక్షల టన్నులు నిల్వ ఉన్నాయన్నారు. నాడు టీడీపీ రుణమాఫీ పేరుతో రైతులను వంచించగా ఇప్పుడు రెండేళ్లలో రైతు భరోసా కింద మొత్తం రూ.17,030 కోట్లను 23 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. -
ఏపీ: మద్యం.. తగ్గుముఖం
అక్రమ మద్యంపై ఉక్కుపాదం బెల్ట్ షాపులు, పర్మిట్ రూములను మూసేయించడం, దుకాణాల సంఖ్యను తగ్గించడంతో పాటు.. విక్రయాల సమయాన్ని కుదించాం. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. ఈ సమయంలో రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలి రాకుండా చూడాలి. ఎక్కడైనా తయారు చేస్తుంటే చర్యలు తీసుకోవాలి. కాలేజీలు, యూనివర్సిటీలకు సమీపంలో గంజాయి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో నిఘా పెట్టాలి. గంజాయి సాగును గుర్తించి, ఎప్పటికప్పుడు ధ్వంసం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: అక్రమ మద్యం తయారీ, రవాణాతో పాటు గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దానిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాల ప్రగతిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, 4,379 మద్యం షాపులను 2,975కు కుదించి.. మూడింట ఒక వంతు దుకాణాలను మూసి వేశామని తెలిపారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం 43 వేల బెల్టు షాపులను తీసేయడంతో పాటు 4,379 పర్మిట్ రూమ్‌లను మూసి వేయించడం వల్ల రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఇది వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించే వారని, ఈ సమయాన్ని ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేశామని చెప్పారు. ఈ చర్యలన్నింటితో లిక్కర్ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు, బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయని వివరించారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం ► గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలి. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించి గంజాయి తోటలను ధ్వంసం చేయాలి. పోలీసు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ► డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపై పర్యవేక్షణ ఉండాలి. ► దీనిపై కార్యాచరణ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో తెలియజేయాలి. ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపై దృష్టి పెట్టాలి. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు ► నిర్ధేశించిన రేట్ల కన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలి. ఎస్ఈబీ కాల్ సెంటర్ నంబర్‌పై విస్తృత ప్రచారం కల్పించాలి. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్ చేసేలా జిల్లాల వారీగా ప్రచారం చేయాలి. ► వచ్చే కాల్స్‌పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆయా జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే.. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలి. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలి. ► ఈ సమీక్షా సమావేశంలో ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ డైరెక్టర్ (స్పెషల్ యూనిట్స్) ఏ రమేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న పోలీసులు (ఫైల్) కేసుల వివరాలు ఇలా.. ► మద్యం అక్రమ రవాణా, తయారీపై నమోదైన కేసులు : 1,20,822 ► అరెస్ట్ అయిన నిందితులు : 1,25,202 ► 2020లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు : 63,310 ► 2021లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు : 57,512 ► ఎస్ఈబీ నమోదు చేసిన కేసులు : 74,311 ► పోలీసులు నమోదు చేసిన కేసులు : 46,511 ► సీజ్ చేసిన అక్రమ మద్యం (లీటర్లు) : 8,30,910 ► స్వాధీనం చేసుకున్న నాటుసారా (లీటర్లు) : 8,07,644 ► ధ్వంసం చేసిన బెల్లం ఊట (లీటర్లు) : 2,30,48,401 ► సీజ్ చేసిన వాహనాలు : 29,491 ► ఇసుక అక్రమ రవాణాపై నమోదైన కేసులు : 12,211 ► అరెస్ట్ అయిన నిందితులు : 22,769 ► స్వాధీనం చేసుకున్న ఇసుక (టన్నులు) : 5,72,372 ► స్వాధీనం చేసుకున్న వాహనాలు : 16,365 ► గంజాయి సాగు, రవాణాపై నమోదైన కేసులు : 220 ► అరెస్ట్ అయిన నిందితులు : 384 ► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 18,686 ► 2021 మార్చి 20 నుంచి 2021 మార్చి 31 వరకు ఆపరేషన్ నయా సవేరా కింద నమోదైన కేసులు : 69 ► అరెస్ట్ అయిన వారు : 174 ► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 2,176 ► అవేర్నెస్ క్యాంపులు : 330 -
నట్టింట్లో గంజాయి వనం
-
నట్టింట్లో గంజాయి వనం
► మణికొండలో తన ఫ్లాట్‌లోనే సాగు చేస్తున్న ఘనుడు ► ప్లాస్టిక్ గ్లాసుల్లో విత్తనాలు.. మొలకెత్తగానే పూల కుండీల్లోకి.. ► మొక్కలు ఏపుగా పెరిగేందుకు ప్రత్యేక లైట్లు, ఫ్యాన్లు ► విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అమ్మేందుకు పథకం ► అమెరికాలోని తన మిత్రుడి ద్వారా ‘సాగు’ మెళకువలు ► గంజాయి అమ్మబోతూ పోలీసులకు చిక్కిన నిందితుడు ► విచారణలో విషయం తెలుసుకొని అవాక్కయిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: గంజాయి.. ఎక్కడో ఏజెన్సీ ఏరియాలోనో, దట్టమైన అటవీ ప్రాంతంలోనో, కొన్ని రకాలైన పంటల మధ్యనో దొంగచాటుగా సాగు చేస్తారని ఇప్పటిదాకా తెలుసు! కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా అపార్ట్మెంట్లోనే దర్జాగా గంజాయి సాగు మొదలెట్టేశాడు! పూల కుండీలు, ప్లాస్టిక్ గ్లాసుల్లో సాగు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గంజాయి మొక్కలు ఏపుగా పెరగడానికి ప్రత్యేకంగా లైట్లు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసిన ఇతడు.. విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను టార్గెట్‌గా చేసుకుని వ్యాపారం చేసేందుకు పథకం వేశాడు. ఇంతలోనే సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కినట్లు అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి సోమవారం వెల్లడించారు. నగరంలో ఈ తరహా ఉదంతం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ‘ఫ్రెష్ మాల్’తో ఎక్కువ లాభం వస్తుందని... గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మణికొండ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి సయ్యద్ షాహెద్ హుస్సేన్ వైకే రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. గంజాయి సేవించడం అలవాటు ఉన్న ఇతడు కొన్నాళ్లకు విక్రేతగా మారాడు. నగరానికి సమీపంలోని తాండూరులో కేజీ రూ.3,500 చొప్పున గంజాయి ఖరీదు చేసుకొని వచ్చి.. ఇక్కడ రూ.16 వేల చొప్పున అమ్మేవాడు. ఈ క్రయ విక్రయాల నేపథ్యంలో హుస్సేన్‌కు మూడు నెలల క్రితం గంజాయి సాగు ఆలోచన వచ్చింది. ఎక్కడో పండించిన గంజాయి.. ఎన్నో రోజుల తర్వాత తీసుకువచ్చి విక్రయిస్తున్నా లాభం వస్తోందని, అలాగాకుండా తానే పండించి ‘ఫ్రెష్ మాల్’ను విక్రయిస్తే మరింత లాభాలు పొందచ్చని భావించాడు. ఆ ఆలోచనను వెంటనే అమల్లో పెట్టి ఫ్లాట్‌నే పొలంగా మార్చేశాడు. అమ్మబోతూ చిక్కడంతో గుట్టురట్టు హుస్సేన్ ఇలా ఇప్పటికే తన ఫ్లాట్‌లోని హాలు, లివింగ్ ఏరియా, కారిడార్‌ల్లో 40 కుండీల్లో గంజాయి సాగు చేశాడు. ఈ పంట చేతికి వచ్చిన తర్వాత నగరంలోని విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు విక్రయించేందుకు పథకం వేశాడు. ఈ లోపు ఇతర ప్రాంతాల నుంచి సేకరించిన గంజాయిని విక్రయించడం కొనసాగించాడు. ఇటీవల కొన్న 8.6 కేజీల గంజాయిని అమ్మడానికి సోమవారం గోల్కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలో ఎస్సైలు తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు. ఇతడిని విచారించగా.. ఫ్లాట్‌లో గంజాయి సాగు వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి వీడియోలు.. ఇంట్లోనే గంజాయి సాగు విషయాన్ని అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడైన గరిత్ క్రిస్టోఫర్‌కు హుస్సేన్ చెప్పాడు. అప్పటికే అక్కడ తన అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో గంజాయిని పండిస్తున్న క్రిస్టోఫర్... సాగు విషయాలు హుస్సేన్‌కు చెప్పడంతో పాటు కొన్ని వీడియోలనూ పంపించాడు. వాటి ఆధారంగా గంజాయి సాగుకు అవసరమైన పూలకుండీలు తదితరాలను హుస్సేన్ స్థానికంగా కొన్నాడు. తన ఫ్లాట్‌లోనే మొక్కల్ని పెంచేందుకు తాండూరు పరిసరాల నుంచే గంజాయి విత్తనాలను తెచ్చాడు. వాటిని తొలుత డిస్పోజబుల్ గ్లాసుల్లో నాటాడు. కొద్దిగా ఎదిగిన తర్వాత పూలకుండీల్లోకి మారుస్తూ సాగు చేస్తున్నాడు. గంజాయి మొక్కలు బాగా పెరిగేందుకు ప్రత్యేకంగా లైట్లు, గాలి కోసం ఫ్యాన్లు ఏర్పాటు చేశాడు. హైడ్రోపోలిక్ సిస్టమ్‌లో సాగు మణికొండలోని వైకే రెసిడెన్సీపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడ గంజాయి పంటను పండించే పద్ధతిని చూసి ఆశ్చర్యపోయారు. పూలకుండీల్లో ఉన్న ఈ మొక్కలకు పోసిన నీరు వృథా కాకుండా హుస్సేన్.. హైడ్రోపోలిక్ పద్ధతిని అనుసరిస్తున్నాడు. ఇందులో ‘క్లే పెల్లెట్స్’వాడటంతో అదనపు నీరు కిందకు రాగానే మళ్లీ దాన్నే మరోసారి మొక్కకు సరఫరా చేసే టెక్నాలజీ ఉంటుంది. కొబ్బరిపొట్టు, వేప నూనె వంటి సంప్రదాయ పద్ధతులను కూడా హుస్సేన్ ఈ గంజాయి మొక్కలపై వాడుతున్నాడు. వీటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పెంచుతున్న మొక్కలు ఇంకా చిన్నవి కావడంతో.. వాసన రాలేదని, అందువల్లే అంతా సాధారణ మొక్కలుగా భావించి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. -
డ్రగ్స్‌కు బానిసై.. పోలీసులకు పట్టుబడి..
చేవెళ్ల రూరల్ /పూడూరు: ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసై పెడదారి పట్టారు. వారికి జోర్దాన్ దేశీయుడు జతకలిశాడు. డ్రగ్స్ దొరకకపోవడంతో గంజాయి కొనుగోలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. వీరు నలుగురితోపాటు గంజాయి సాగుచేస్తున్న రైతును పోలీసులు గురువారం రిమాండుకు తరలించారు. కేసు వివరాలను చేవెళ్ల డీఎస్పీ రంగారెడ్డి, సీఐ ఉపేందర్ వెల్లడించారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన నీలం ప్రత్యూష్, వినయ్‌కుమార్, రఘువంశీధర్రెడ్డిలు స్నేహితులు. వీరిలో ప్రత్యూష్, రుఘవంశీధర్రెడ్డిలు బీటెక్ పూర్తి చేశారు. వినయ్‌కుమార్ నగరంలో ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్నారు. వీరు ముగ్గురు డ్రగ్స్‌కు బానిసయ్యారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని దూల్‌పేటకు వెళ్లారు. అక్కడ డగ్స్ దొరకలేదు. అక్కడికి డ్రగ్స్ కోసం వచ్చిన జోర్డాన్ దేశానికి చెందిన సయ్యద్ మహ్మద్ సల్హా వారికి పరిచయమయ్యాడు. అక్కడున్న కొందరు పూడూరు మండలం కంకల్ గ్రామంలో ఓ రైతు వద్ద గంజాయి దొరుకుతుందని చెప్పారు. దీంతో నలుగురు కలిసి బుధవారం ప్రత్యూష్ కారు(ఐ 10)లో కంకల్‌కు వచ్చారు. గంజాయి సాగుచేస్తున్న మల్లం సదానందం అలియాస్ ఆనందం, నందం వారికి రూ.3,500లకు కిలో గంజాయి విక్రయించాడు. విశ్వసనీయ సమాచారంతో చేవెళ్ల సీఐ ఉపేందర్, చన్గోముల్ ఎస్ఐ నాగరాజులు దాడి చేసి కంకల్- చన్గోముల్ రహదారిపై పట్టుకున్నారు. కారులోని కిలో గంజాయితోపాటు అది అమ్మిన రైతు సదానందం ఇంట్లో మరో కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం పోలీసులు, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు రైతు పొలంలో సాగుచేస్తున్న దాదాపు 25 గంజాయి మొక్కలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద ఉన్న సెల్ఫోన్లతోపాటు కారు, రైతు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థులు డ్రగ్స్‌కు బానిపై దాని కోసం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లే దుస్థితికి దిగజారారని పోలీసులు తెలిపారు. విదేశీయుడు సయ్యద్ మహ్మద్ సల్హా విజిటింగ్ వీసాపై ఇండియా వచ్చాడు. అతడి వీసా గడువు మార్చి 15 వరకు ఉంది. గంజాయి సాగు చట్టవిరుద్ధం అని తెలిసినా రైతు సదానందం తొందరగా డబ్బు సంపాధించాలనే దురుద్దేశంతో గంజాయిని అంతర్ పంటగా సాగుచేస్తున్నాడని డీఎస్పీ రంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఐదుగురిని పోలీసులు రిమాండుకు తరలించారు. కాగా గత నెలలో ఓ కారులో కంకల్ గ్రామం నుంచి తరలిస్తున్న 8.5 కిలోల గంజాయిని వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
‘మావో’ల కోటలో గంజాయి తోటలు.!
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మావోయిస్టులే. రెండోది గంజాయి సాగు. అందాలకు నిలయమైన విశాఖ మన్యం దీనికి వేదిక అవుతోంది. ఏటేటా పంట విస్తీర్ణం పెరగడంతో ఏజెన్సీ అంతటా గంజాయి వాసనలు గుప్పుమంటున్నాయి. ఏవోబీ దాటి ఇతర రాష్ట్రాలకు ఈ మత్తు గమ్మత్తుగా రవాణా అవుతోంది. ఎక్సైజ్, పోలీసు అధికారులు దాడులు జరుపుతున్నా...నెలకు రూ. 10 కోట్లు వంతున ఏటా సుమారు రూ. వంద కోట్లుపైనే ఈ వ్యాపార లావాదేవీలు జరుగుతున్నట్టు అంచనా. ఖాకీలు దూరని కారడవుల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగవుతోంది. సీలేరు నదీపరీవాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తునపెంచుతున్నారు. జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు,ముంచంగిపుట్టులతో పాటు ఏవోబీలోనూ పెంపకం అధికంగా ఉంది. ఇవన్నీ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు కావడం విశేషం. ఆగస్టు నెలాఖరు నుంచి కోతలు చేపట్టి, ఎండబెట్టిన గంజాయి రవాణాకు సిద్ధమైందన్న వాదన వ్యక్తమవుతోంది. అదే రీతిలో గంజాయి తోటల పెంపకం సీజన్ ప్రారంభమైంది. ఈ పనిని దగ్గరుండి అంతరరాష్ర్ట వ్యాపారులు చేపడుతున్నారు. తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన కొందరు ఏజెన్సీలో తిష్టవేసి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. అయితే గంజాయి తోటల పెంపకం దారుల నుంచి మావోయిస్టులు డబ్బులు గుంజుతున్నారంటూ పోలీసులు ప్రచారం మొదలుపెట్టడం తాజాగా చర్చనీయాంశమవుతోంది. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లోనే గంజాయి సాగవడం ఇందుకు తార్కాణమని పోలీసులంటున్నారు.బలమైన అండ లేకుండా స్మగ్లర్లు అక్రమ రవాణా చేయలేరు. పోలీసులు చెబుతున్నట్లు వ్యాపారులకు అండ మావోయిస్టులేనా అనే చర్చ జిల్లా వ్యాప్తంగా వేడి పుట్టిస్తోంది. ఇతర రాష్ట్రాలకు తరలింపు వేలాది ఎకరాల్లో ఏజెన్సీలో పండించిన గంజాయిని పాడేరు, చింతపల్లి, సీలేరు, అరకుఘాట్ల నుంచి మైదాన ప్రాంతాల మీదుగా హైదరాబాద్‌తో పాటు గోవా, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. రూ.వంద కోట్ల టర్నోవర్ గంజాయికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ గిరాకీ ఉంది. కిలో రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ ధర పలుకుతోంది. ముఖ్యంగా శీలావతి రకం కాసులు కురిపిస్తుంది. దీంతో సంప్రదాయ పద్ధతులను వీడి ఆధునిక పద్ధతుల్లో పెంపకం ప్రారంభించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తున్నారు. ఈ విధంగా పండించిన గంజాయి ఏటా దాదాపు రూ.100 కోట్ల పైగానే టర్నోవర్ అవుతోంది. దీంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు గంజాయి తోటల పెంపకంపై దృష్టి సారించారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ పబ్బం గడుపుకుంటున్నారు. అరకొర చెల్లింపులు వారికి ఇచ్చి వీరు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. అన్నలపై బురద జల్లుతున్నారా? గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టడంలో పోలీసులు పెద్దగా పురోగతి సాధించలేకపోతున్నారు. నామమాత్రపు దాడులు చేసి చేతులు దులుపకుంటున్నారు. గంజాయి వ్యాపారాన్ని అడ్డుకోలేకపోతున్న వారు తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికే మావోయిస్టులపై బురదజల్లుతున్నారని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. గంజాయి వ్యాపారులను మావోయిస్టులు బెదిరించి డబ్బులు గుంజుతున్నారని, ఇది ఉద్యమ సిద్ధాంతం ఎలా అవుతుందని పోలీసులు ఇటీవల ఏజెన్సీలో పోస్టర్లు అతికించడంతో పాటు ఉన్నతాధికారులు ప్రకటనలు కూడా విడుదల చేశారు. ఇప్పటికే అన్నలకు గిరిజనులు వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రచారం ముమ్మరం చేయగా తాజాగా అక్రమ వసూళ్లు, వ్యాపారాలకు అండ వంటి ప్రచారాాలతో మావోయిస్టులపై పోలీసులు ముప్పేట దాడి ప్రారంభించారు. ఇంతకాలం తుపాకీలతో వారిని నేరుగా ఎదుర్కొన్న ఖాకీలు ఇప్పుడు మావోయిస్టుల మనోస్ధైర్యాన్ని దెబ్బకొట్టే వ్యూహాన్ని అమలుచేస్తున్నాయి. -
మన్యంపై గంజాయి పడగ
పాడేరు : ఈ ఏడాది కూడా మన్యంలో భారీగా గంజాయి సాగు చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తమిళనాడు, కేరళ, ఒడిశా సహా విశాఖ జిల్లా మైదాన ప్రాంతాలకు చెందిన గంజాయి వ్యాపారులు మన్యంలో తిష్ట వేశారు. గంజాయి సాగును ప్రోత్సహించేం దుకు కుగ్రామాలను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సాగుకు వాతావరణం అనుకూలంగా ఉంది. దీంతో వ్యాపారులు మారుమూల గిరిజనులతో చర్చలు జరుపుతున్నారు. యథేచ్ఛగా రవాణా గత ఏడాది కూడా భారీస్థాయిలో గంజాయి సాగు చేసి రూ.కోట్లలో వ్యాపారం చేశారు. జిల్లావ్యాప్తంగా గంజాయి రవాణాపై పోలీసు దాడులు జరిగినా వేర్వేరు మార్గాల్లో తమిళనాడు, కేరళ, గోవా, హైదరాబాద్ ప్రాంతాలకు తరలించారు. కొన్నిసార్లు పట్టుబడినా అధిక శాతం సరకును తమ ప్రాంతాలకు సులభంగానే తరలించారు. చివరకు ఆయిల్ ట్యాంకర్లను కూడా అనుకూలంగా మార్చుకున్నారు. కూలీల సాయంతో అడవి మార్గాల్లో గంజాయిని మోయించి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న వ్యాపారుల ముఠా సభ్యులు పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాల్లోనూ ఉన్నారు. వ్యాపారం బాగా కలిసి రావడంతో భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేయిస్తున్నారు. వారం రోజులుగా గంజాయి వ్యాపారుల సంచారం అధికమైంది. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు మండల కేంద్రాల్లో కూడా మకాం వేసి సాగును ప్రోత్సహిస్తున్నారు. పాడేరుకు చెందిన కొందరు ప్రముఖ వ్యాపారులు కూడా సాగులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏటా భారీస్థాయిలో సాగు చేస్తున్నా తోటల ధ్వంసానికి పోలీసు, ఎక్సయిజ్ శాఖలు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోద్యం చూస్తున్న రెవెన్యూ, అటవీ శాఖలు గంజాయి నిర్మూలన బాధ్యత ఎక్సయిజ్, పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖలదే. ఏజెన్సీలో కాస్తోకూస్తో ఎక్సయిజ్, పోలీసుశాఖలే దాడులు జరుపుతున్నాయి. రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బందికి ఎక్కడ సాగవుతోందో తెలిసినా కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు అన్ని శాఖలను సమన్వయపరచాలని, మాఫియా అక్రమాలను నిరోధించాలని గిరిజనులు కోరుతున్నారు.